
దక్కాల్సిందే..!
జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు పార్టీ నేతలందరూ సమష్టిగా పనిచేయాలని టీఆర్‌ఎస్ కీలక నేతలు దిశానిర్దేశం చేశారు.
జెడ్పీ కుర్చీని ఎలాగైనా కైవశం చేసుకోవాలన్న సంకల్పంతో టీఆర్‌ఎస్ ఎత్తుగడలు వేస్తోంది. ఇందుకు ఆ పార్టీ ముఖ్య నేతలు హరీష్, కేటీఆర్‌లు తమ కేడరుకు దిశానిర్దేశం చేశారు. శిబిరాలతో పనిలేకుండా.. జెడ్పీటీసీలు తమ వైపు మొగ్గు చూపేలా వ్యూహరచన చేయాలని జిల్లా నేతలకు సూచించారు. అధికారంలో ఉన్న తమకు అనుకూలంగా ఫలితాన్ని మార్చుకోవాలని చెప్పారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు పార్టీ నేతలందరూ సమష్టిగా పనిచేయాలని టీఆర్‌ఎస్ కీలక నేతలు దిశానిర్దేశం చేశారు. శాసనసభా సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ జిల్లా ఎమ్మెల్యేలు, కొత్తగా ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులు పార్టీ కీలక నేతలతో భేటీ అయ్యారు. సోమవారం నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, మంగళవారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీ రామారావును టీఆర్‌ఎస్ జిల్లా నేతలు కలుసుకున్నారు.
ఎంపీ జితేందర్‌రెడ్డి ఢిల్లీలో లోక్‌సభ సమావేశాలకు హాజరవుతున్న నేపథ్యంలో రెండు రోజులుగా జరుగుతున్న భేటీలకు దూరంగా ఉన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు విఠల్‌రావు ఆర్యతో పాటు ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, ఇతర ఎమ్మెల్యేలు, మరికొందరు ముఖ్య నేతలు ఈ బృందంలో వున్నారు. చైర్మన్‌గిరీ దక్కించుకునేందుకు అవసరమైన ఇతర సభ్యుల మద్దతు కూడగట్టాల్సిందిగా జిల్లా నేతలకు మంత్రులు హరీష్, కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. జిల్లా స్థాయిలో అభివృద్ది, పార్టీ బలోపేతాన్ని దృష్టిలో పెట్టుకుని జడ్పీ చైర్మన్ పీఠం కోసం ప్రయత్నించాల్సిందిగా జిల్లా నేతలకు సూచించారు.
క్యాంపు రాజకీయాలతో పనిలేకుండానే ఇతర పార్టీల సభ్యుల మద్దతు కూడగట్టాలని ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవలి ప్రాదేశిక సంస్థల ఎన్నికల్లో 28 జెడ్పీటీసీ స్థానాల్లో కాంగ్రెస్, 25 స్థానాల్లో టీఆర్‌ఎస్, తొమ్మిది చోట్ల టీడీపీ, రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ ఎస్ జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే దిశగా పావులు కదుపుతోంది. కొత్తగా ఎన్నికైన జెడ్పీటీసీల్లో ఆత్మ విశ్వాసం కల్పించడంతో పాటు, ఇతర పార్టీల పట్ల ఆకర్షితులు కాకుండా వుండేందుకే ముఖ్య నేతల వద్దకు తీసుకెళ్లినట్లు పార్టీ ఎమ్మెల్యే ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు.
రేసులో ఆ ఇద్దరు జెడ్పీటీసీలు
జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి టీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులు పోటీ పడుతున్నారు. వనపర్తి నియోజకవర్గంలోని పెబ్బేరు నుంచి ఎన్నికైన ప్రకాశ్, గద్వాల జెడ్పీటీసీ సభ్యుడు భాస్కర్ చైర్మన్‌గిరీని ఆశిస్తున్నారు. ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు అవసరమైన ఆర్థిక స్తోమత ఇద్దరు నేతల కూ లేకపోవడంతో ఆయా నియోజకవర్గ పార్టీ ఇంచార్జిలే తమ అనుయాయుల కోసం రంగంలోకి దిగినట్లు సమాచారం. గద్వాలలో మాజీ మంత్రి డీకే అరుణను రాజకీయంగా ఎదుర్కొనేందుకు తమ నియోజకవర్గానికి చెందిన జెడ్పీటీసీకే చైర్మన్ పదవి ఇవ్వాల్సిందిగా కృష్ణమోహన్‌రెడ్డి పట్టు బడుతున్నట్లు సమాచారం. కాగా రిజర్వుడు కేటగిరీకి జెడ్పీ చైర్మన్ పదవి రిజర్వు చేసిన నేపథ్యంలో రిటైర్డు ఇంజనీర్ ప్రకాశ్ (పెబ్బేరు)కు అవకాశం ఇవ్వాల్సిందిగా మరికొందరు సూచిస్తున్నారు. రెండు నియోజకవర్గాల్లోనూ ఇటీవలి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించలేక పోయారు. కనీసం జడ్పీ చైర్మన్ పదవిని తమ నియోజకవర్గానికి కేటాయిస్తే ప్రత్యర్థులను ఎదుర్కోవచ్చనే భావన నియోజకవర్గ నేతల్లో కనిపిస్తోంది.