ఓటెత్తాలి చైతన్యం

Youth Awareness on Vote Right - Sakshi

గ్రేటర్‌ పరిధిలో ఓట్లు అత్యధికం.. పోలింగ్‌ స్వల్పం 

4 లోక్‌సభ స్థానాల్లో 80 లక్షల మందికి పైగా ఓటర్లు

ఎన్నికల్లో 60 శాతానికి మించని పోలింగ్‌

పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే నయం  

పోలింగ్‌ శాతం పెంచేందుకు యంత్రాంగం చర్యలు

ఓటుహక్కు వినియోగించుకోవడంలో సిటీజనులు కాసింత నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఎన్నిక వేళ ఓటు వేయడం పౌరులుగా తమ ప్రథమ కర్తవ్యమనే విషయానికి ప్రాధాన్యమివ్వడంలేదు. దీంతో ప్రతి ఎన్నికల్లో ఆశించినంత పోలింగ్‌ శాతం ఉండటంలేదు. గ్రేటర్‌ పరిధిలో 4 లోక్‌సభ స్థానాలున్నాయి. వీటిలో హైదరాబాద్, సికింద్రాబాద్,మల్కాజిగిరి, చేవెళ్ల. ఇందులో పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల ఓటర్ల పోలింగ్‌ శాతం మెరుగ్గా ఉన్నట్లుగణాంకాలు చెబుతున్నాయి. వచ్చే నెల 11న జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లోనైనా మహానగర ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు భారీగాతరలివచ్చి ఓటెత్తేందుకుచైతన్యవంతం కావాల్సినఅవసరముంది. 

సికింద్రాబాద్‌లో దుస్థితి ఇలా..
సికింద్రాబాద్‌లోనూ ప్రతి ఎన్నికలోనూ పోలింగ్‌ శాతం తగ్గుముఖం పడుతోంది. గతంలో జరిగిన రెండు పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ మెజారిటీ ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. 2009 ఎన్నికలతో పోలిస్తే 2014లో 1.87 శాతం ఓట్లు తగ్గడం గమనార్హం.

హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల పరిధిలో సుమారు 80 లక్షల మందికిపైగా ఓటర్లు ఉన్నారు. వీరిలో తమ ఓటుహక్కు వినియోగించుకునేవారు మాత్రం 60 శాతం లోపేనని గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు, బల్దియా ఎన్నికలు నిరూపించాయి. పోలింగ్‌ జరిగే రోజును సెలవుదినంగా భావిస్తున్న ఐటీ, బీపీఓ, కేపీఓ, మార్కెటింగ్‌ తదితర అసంఘటిత రంగాల ఉద్యోగులు, వేతన జీవులు పోలింగ్‌కు దూరంగా ఉంటుండడంతో ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకొని సమాజంలో మార్పును తీసుకొచ్చే గురుతర బాధ్యతను విస్మరిస్తున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ఈసారి ఓటర్లలో చైతన్యం నింపి స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు జీహెచ్‌ఎంసీ పలు యాప్‌లను, చైతన్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం విశేషం. మహానగరం పరిధిలో గతంలో నాలుగు లోక్‌సభ స్థానాల్లో నమోదైన ఓట్ల శాతం ఇలా ఉంది.

విస్తృత ప్రచారం..
ఓటరు చైతన్యం పెంచడం, ఓటుహక్కును వినియోగించుకునే విషయంలో ప్రధాన రాజకీయ పక్షాలు, స్వచ్ఛంద సంస్థలు, జీహెచ్‌ఎంసీ అధికారులు, ఎన్నికల కమిషన్‌ అధికారులు నగర వ్యాప్తంగా అవగాహన, ప్రచార కార్యక్రమాల నిర్వహణకు ఇటీవల శ్రీకారం చుట్టాయి. నూతనంగా ఓటర్లుగా నమోదు చేసే విషయంలో వివిధ రాజకీయ పార్టీలు క్రియాశీలకంగా వ్యవహరించి వయోజనులను ఓటర్లుగా నమోదు చేసేందుకు శక్తివంచన లేకుండా కృషిచేశాయి. ఓటర్లుగా నమోదైన వారు పోలింగ్‌ జరిగే ఏప్రిల్‌ 11న విధిగా తమ ఓటుహక్కును వినియోగించుకునేలా చూడాలని ప్రజాస్వామ్యవాదులు సూచిస్తున్నారు.  

మల్కాజిగిరిలో పరిస్థితి ఇదీ..
మినీ ఇండియాగా పేరొందిన దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలో  గతంలో నమోదైన పోలింగ్‌ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. గతంలో జరిగిన రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ పోలింగ్‌ 51 శాతం దాటకపోవడం గమనార్హం. 2009 ఎన్నికలతో పోలిస్తే 2014లో 0.41 శాతం పోలింగ్‌ తగ్గడం గమనార్హం.

2009లో మొత్తం ఓట్లు:     23,43,050
ఓటేసినవారు:     12,05,714
2014లో మొత్తం ఓట్లు:     31,83,083
ఓటేసిన వారు: 16,24,859 (51.05శాతం)

సికింద్రాబాద్‌లో దుస్థితి ఇలా..
సికింద్రాబాద్‌లోనూ ప్రతి ఎన్నికలోనూ పోలింగ్‌ శాతం తగ్గుముఖం పడుతోంది. గతంలో జరిగిన రెండు పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ మెజారిటీ ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. 2009 ఎన్నికలతో పోలిస్తే 2014లో 1.87 శాతం ఓట్లు తగ్గడం గమనార్హం.

2009లో సికింద్రాబాద్‌లో మొత్తం ఓట్లు: 15,74,818
పోలైన ఓట్లు:     8,65,038 (54.53 శాతం)
2014లో మొత్తం ఓట్లు:     18,93,741
ఓటేసిన వారు:     10,04,763 (53.30 శాతం)

హైదరాబాద్‌లోనూ అత్యల్పమే..
హైదరాబాద్‌ నగరంలో సగం మంది ఓటర్లు పోలింగ్‌ రోజున ఇళ్లకు పరిమితమవడం, లేదా సెలవురోజు కావడంతో విహార యాత్రకు వెళుతుండడంతో ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నట్లు గత ఎన్నికల్లో జరిగిన పోలింగ్‌ శాతాన్ని పరిశీలిస్తే అవగతమవుతోంది. 2009 ఎన్నికలతో పోలిస్తే 2014 ఎన్నికల్లో 0.81 శాతం మేర పోలింగ్‌ స్వల్పంగా పెరగడం గుడ్డిలో మెల్ల.   

2009లో మొత్తం ఓట్లు:    13,93,242
ఓటేసినవారు:    7,31,348(52.49 శాతం)
2014లో మొత్తం ఓట్లు:     18,23,217
ఓటేసిన వారు:    9,71,770(53.50 శాతం)

చేవెళ్లలో చాలా నయం..
గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉన్న చేవెళ్ల నియోజకవర్గంలో ఓటింగ్‌ శాతం నగరంలోని 3 లోక్‌సభ స్థానాల కంటే మెరుగ్గా నమోదవడం విశేషం. గతంలో జరిగిన రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ నియోజకవర్గంలో పోలింగ్‌ 60 శాతానికి పైగానే నమోదైంది. 2009 ఎన్నికలతో పోలిస్తే 2014లో 4.01 శాతం మేర పోలింగ్‌ తగ్గడం గమనార్హం.

2009లో మొత్తం ఓటర్లు:     16,81,664
పోలైన ఓట్లు:     10,85,000 (64.52 శాతం)
2014లో మొత్తం ఓట్లు:     21,85,164
పోలైన ఓట్లు:     13,22,312(60.51 శాతం)

పోలింగ్‌ పెంపునకు చర్యలివీ..
వాదా యాప్‌: అంధులు, వృద్ధులు, గర్భిణులు రద్దీగా ఉండే పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కును తమకు వీలైన సమయంలో వినియోగించుకునేందుకు వారికి అనువైన స్లాట్‌ను ఈ యాప్‌ ద్వారా బుక్‌చేసుకోవచ్చు. వీరికి ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటుచేయడంతోపాటు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు వీలుగా వారికి పోలింగ్‌ సిబ్బంది సహకరించనున్నారు.
 
నమూనా పోలింగ్‌ కేంద్రాలు: జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్ల పరిధిలో నమూనా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి.. నూతనంగా ఓటర్లుగా నమోదైన వారు తమ ఓటుహక్కును ఎలా వినియోగించుకోవాలి.. వీవీప్యాట్‌ యంత్రాల పనితీరుపై అవగాహన కల్పిస్తున్నారు.
సీ విజిల్‌: ఎన్నికల్లో అక్రమాలు, వివిధ పార్టీల అభ్యర్థులు, క్యాడర్‌ చేసే అక్రమాలను ఎన్నికల సంఘం, బల్దియా దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ యాప్‌ను ప్రారంభించారు. ఫోటోలు, వీడియోలను ఈ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే చాలు అక్రమార్కులపై చర్యలు తథ్యం.
సువిధ: ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు నామినేషన్ల దాఖలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి తదితర అవసరమైన సమాచారాన్ని ఈ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top