మేనమామ తిట్టాడన్న మనస్తాపంలో ఓ యువతి చేదబావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
తడ్కల్ : మేనమామ తిట్టాడన్న మనస్తాపంలో ఓ యువతి చేదబావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కంగ్టి మండలం దెగుల్‌వాడీలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. కంగ్టి ఎస్‌ఐ ప్రదీప్‌బాబు కథనం మేరకు.. కోనాపూర్ వసంత (21) మూడు నెలల వయస్సులో తల్లి మరణించడంతో అప్పటి నుంచి మేనమామ పిడికిలి గోవర్ధన్‌రెడ్డి వద్ద ఉంటోంది. వసంత తల్లి మరణాంతరం తండ్రి సంగారెడ్డి మరో వివాహం చేసుకుని నిజామాబాద్ జిల్లా కొడప్‌గల్‌లో ఉంటున్నాడు. కాగా బుధవారం ఇంటి పని విషయంలో మేనమామ భార్య అరుణతో వసంత గొడవ పడడంతో గోవర్దన్‌రెడ్డి ఇద్దరినీ మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన వసంత గ్రామ సమీపంలోని చేద బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. గురువారం శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలు వసంత మేనమామ గోవర్ధన్‌రెడ్డి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రదీప్‌బాబు తెలిపారు.