breaking news
Maternal uncle
-
దారుణం: మూడు నెలల చిన్నారిని బండకేసి..
సాక్షి, నల్గొండ : నల్గొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నెలలు నిండని ఓ చిన్నారిపై తాగుడు బానిసైన సొంత మేనమామే కిరాతకంగా ప్రవర్తించాడు. మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో చిన్నారిని నేలకేసి కొట్టి.. చంపాడు ఆ దుర్మార్గుడు. జిల్లాలోని పెద్దవూర మండలం చిన్నగూడెంలో జరిగిన ఈ ఘటన అందరి మనసులను ద్రవింపజేస్తుంది. గుంటూరు జిల్లాకు చెందిన లక్ష్మి, వెంకటేశ్వర్లు దంపతులుకు ఇద్దరు కుమార్తెలు. మరోసారి గర్భవతి అయిన లక్ష్మీ మూడు నెలల క్రితం డెలివరీ కోసం నల్లగొండలోని తన స్వగ్రామానికి వచ్చింది. డెలివరీ అనంతరం తల్లిగారి ఇంటి వద్ద ఆమె ఉండగా.. శుక్రవారం పెద్ద కూతురు పుట్టినరోజు కావడంతో తండ్రి వెంకటేశ్వర్లు అత్తవారింటికి వచ్చాడు. ఈ సమయంలో మద్యానికి బానిసైన లక్ష్మీ సోదరుడు ఉపేందర్ తన తండ్రితో డబ్బులు కావాలని గొడవ పడ్డారు. తండ్రి డబ్బులు ఇవ్వకపోవడంతో.. కోపంతో తాగిన మత్తులో అక్క కుమార్తె అయిన మూడు నెలల చిన్నారిని బండకేసి కొట్టాడు. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ క్రమంలో నిందితుడు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా గ్రామస్తులు పట్టుకొని స్తంభానికి కట్టివేసి పోలీసులకు సమాచారం అందించారు. భయంతో చిన్నారి తల్లి లక్ష్మీ, అమ్మమ్మ కూడా అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే గతంలో కూడా ఉపేందర్ తన తండ్రిపై , అక్కలపై కత్తితో దాడి చేశారని, ఊరులోని ఆడవాళ్లతో దురుసుగా ప్రవర్తించే వాడని గ్రామస్తులు పోలీసుల ముందు వాపోయారు. భార్య, పిల్లలను తీసుకొని సొంత ఊరికి వెళ్లడానికి వచ్చానని, ఆ లోపే తన బిడ్డను చంపాడని చిన్నారి తండ్రి వెంకటేశ్వర్లు కన్నీటి పర్యంతమయ్యారు. -
ఈతకు వెళ్లి మామ, అల్లుడు మృతి
బాలానగర్: మెదక్ జిల్లా దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గాజులరామారం పెద్దచెర్వులో ఈతకు వెళ్లి మామ, అల్లుడు నీట మునిగి మృతి చెందారు. శ్రీనివాస్(35), అతని సోదరి కుమారుడు అరవింద్(10) బుధవారం సాయంత్రం గ్రామ చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు. ఈత కొడుతూ ప్రమాదవశాత్తు అరవింద్ మునిగిపోయాడు. అతనిని రక్షించే క్రమంలో శ్రీనివాస్ కూడా నీట మునిగి చనిపోయాడు. రెండు మృతదేహాలను స్థానికులు వెలికి తీశారు. -
మనస్తాపంతో యువతి ఆత్మహత్య
తడ్కల్ : మేనమామ తిట్టాడన్న మనస్తాపంలో ఓ యువతి చేదబావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కంగ్టి మండలం దెగుల్‌వాడీలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. కంగ్టి ఎస్ఐ ప్రదీప్‌బాబు కథనం మేరకు.. కోనాపూర్ వసంత (21) మూడు నెలల వయస్సులో తల్లి మరణించడంతో అప్పటి నుంచి మేనమామ పిడికిలి గోవర్ధన్‌రెడ్డి వద్ద ఉంటోంది. వసంత తల్లి మరణాంతరం తండ్రి సంగారెడ్డి మరో వివాహం చేసుకుని నిజామాబాద్ జిల్లా కొడప్గల్లో ఉంటున్నాడు. కాగా బుధవారం ఇంటి పని విషయంలో మేనమామ భార్య అరుణతో వసంత గొడవ పడడంతో గోవర్దన్‌రెడ్డి ఇద్దరినీ మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన వసంత గ్రామ సమీపంలోని చేద బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. గురువారం శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలు వసంత మేనమామ గోవర్ధన్‌రెడ్డి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రదీప్‌బాబు తెలిపారు.