ప్రేమ, పెళ్లి అంటూ కట్నం తీసుకొని ఇప్పుడేమో..

A Young Woman Complained to the Police About the Marriage Being Postponed - Sakshi

ప్రేమపేరుతో యువకుడి మోసం 

పెళ్లి చేసుకుంటానని చెప్పి జాప్యం చేస్తున్న యువకుడు 

విసుగెత్తి పోలీసులను ఆశ్రయించిన యువతి 

మంచాల: ప్రేమించి తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు తప్పించు తిరుగుతున్నాడని యువతి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల కథనం ప్రకారం.. మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన మార మల్లేశ్‌ బీఈడీ పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నాడు. అయితే మల్లేశ్‌ నాలుగేళ్ల కిందట అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమెను పెండ్లి చేసుకుంటానని నమ్మించాడు. నాలుగు నెలల క్రితం పెళ్లి విషయమై అమ్మాయి ఒత్తిడి చేయడంతో మల్లేశ్‌ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే ఆ అమ్మాయి పోలీసులను ఆశ్రయించింది. దీంతో గ్రామపెద్దలు, ఇరు కుటుంబాలకు చెందిన వారు పోలీస్‌స్టేషన్‌లో పంచాయతీ పెట్టారు. అనంతరం గ్రామపెద్ద సçమక్షంలో మల్లేశ్‌ తనకు రెండెకరాల భూమి, రూ.20 లక్షలు కట్నం కావాలని డిమాండ్‌ చేశాడు. దీంతో గ్రామపెద్దలు ఎకర భూమి, రూ.10 లక్షలు కట్నం ఇప్పిస్తామని ఒప్పించారు. రూ.2 లక్షలు నగదు అప్పుడే కట్నం కింద మల్లేశ్‌కు ఇచ్చారు.

అప్పుడే పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో వారిద్దరూ పూలదండలు మార్చుకున్నారు. అయితే పెళ్లి విషయంలో మాత్రం ఎలాంటి కదలిక రాలేదు. ఇప్పుడు మంచి రోజులు లేవు. మంచి రోజుల్లో పెళ్లి చేసుకుంటానని ఆ యువతికి చెబుతూ వస్తున్నాడు. ఇలా ఎన్నాళ్లు కాలయాపన చేస్తారని  శుక్రవారం గ్రామంలో పంచాయతీ పెట్టి నిలదీశారు. అమ్మాయిని పెళ్లి చేసుకుని తీరాలని పట్టుబట్టడంతో ఆ అమ్మాయిని ఇంట్లోకి రానిచ్చారు. రాత్రంతా ఇంట్లో ఉన్నారు. అయితే శనివారం తెల్లారేలోగానే తనకు పెళ్లి ఇష్టం లేదు, పెళ్లి వద్దంటూ అమ్మాయిని తీసుకొని మల్లేశ్‌ పోలీస్‌స్టేషన్‌ వచ్చాడు. ఇలా మరోసారి వీరి ప్రేమ వ్యవహారం పోలీస్‌స్టేషన్‌ చేరింది. అమ్మాయి మాత్రం మల్లేశ్‌నే పెళ్లి చేసుకుంటానని, తనకు న్యాయం చేయాలని కోరుతుంది. అమ్మాయి కుటుంబసభ్యులు కూడా తమ కూతురుకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top