నీటితో రామప్ప సరస్సు కళకళలాడుతున్నా.. వర్షాలు లేవన్న సాకుతో అధికారులు నీటి సరఫరా నిలిపేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
వెంకటాపురం : నీటితో రామప్ప సరస్సు కళకళలాడుతున్నా.. వర్షాలు లేవన్న సాకుతో అధికారులు నీటి సరఫరా నిలిపేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రామప్ప సరస్సును నమ్ముకొని మండలంలోని పాలంపేట, రామాంజాపూర్, వెంకటాపురం, ఎల్లారెడ్డిపల్లె, నల్లగుంట, లక్ష్మీదేవిపేట, గంపోనిపల్లె, వీర్లపల్లె గ్రామాలకు చెందిన రైతులు పంటలు సాగుచేస్తున్నారు. 36 అడుగుల నీటిసామర్థం గల ఈ సరస్సు కింద అధికారికంగా ఐదువేల ఎకరాలు, అనధికారికంగా మరో ఐదువేల ఎకరాలు సాగవుతోంది.
సరస్సు ఒకసారి పూర్తిస్థాయిలో నిండితే రెండేళ్లపాటు ఖరీఫ్, రబీ పంటలకు ఢోకా ఉండదు. దీనికింద సోమికాలువ, ఒగరు కాలువ, నల్లకాలువ ఉన్నాయి. వీటి ద్వారా ఆయకట్టు పొలాలకు సాగునీరు అందుతుంది. సరస్సులో 27 అడుగుల నీటిమట్టం ఉన్నట్లయితే ఖరీఫ్, రబీ పంటలు, 18 అడుగుల నీరు ఉంటే ఖరీఫ్ సాగవుతుంది. ప్రస్తుతం సరస్సులో 25అడుగుల నీరు ఉంది. అంటే ఖరీఫ్ పంటలకు సరిపడా నీరు ఉన్నట్టే. అయితే వానలు కురవలేదన్న సాకుతో అధికారులు నీటి సరఫరా నిలిపివేశారు. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అధికారులు దయతలచి నీరు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.
నాలుగేళ్ల క్రితం మొదలైన కష్టాలు
సరస్సులో డీఫ్లోరైడ్ ప్రాజెక్టు నిర్మించి గత నాలుగేళ్లుగా వెంకటాపురం, గణపురం మండలాల్లోని 26 గ్రామాల ప్రజలకు తాగునీటిని అందిస్తున్నారు. వేసవిలో తాగునీటి సమస్య రాకూడదనే ఉద్దేశంతో అధికారులు రబీ పంటలకు సాగునీటిని విడుదల చేయడం లేదు. దీంతో ఆయకట్టు రైతులు రబీ పంటలను కోల్పోతున్నారు. సరస్సులోకి దేవాదుల నీరు వచ్చే వరకు మండలంలోని గ్రామాలను మినహాయిం చి ఇతర గ్రామాలకు తాగునీటి సరఫరాను నిలిపివేయాలని రైతులు పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నారు.
అయినా వారు పట్టించుకోకపోవడంతో ప్రతీ ఏటా రైతులకు, అధికారులకు మధ్య వివాదా లు చోటుచేసుకుంటున్నాయి. అసలే రబీ పంటలు కోల్పో యి నష్టాల పాలవుతున్న రైతులు.. ప్రస్తుత ఖరీఫ్ పంటలకు కూడా అధికారులు నీటిని విడుదల చేయకపోవడంతో ఏంచేయాలో తెలియక తల్లడిల్లుతున్నారు. చేసేది లేక వరుణుడిపైనే ఆశలు పెట్టుకుని వరినార్లు పోసుకున్నారు. వేసిన పంటలు ఎండిపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంద ని, అధికారులు తక్షణమే స్పందించి సాగునీటిని విడుదల చేయాలని రైతులు వేడుకుంటున్నారు.