
సాక్షి, హైదరాబాద్: తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కేందుకు ప్రధాన కారణమైన తొలి తెలుగు శాసనం వెలుగు చూసిందిక్కడ. మరే భాషకూ లేని అవధానం వంటి ఉత్కృష్ట సాహితీ ప్రక్రియ పురుడు పోసుకుందీ ఇక్కడే. ఒక్కటేమిటి... తేనలూరే తెలుగుకు అత్యంత గొప్పగా పట్టం కట్టింది తెలంగాణ గడ్డ. ప్రత్యేక రాష్ట్ర హోదాలో మధుర తెలుగుకు మహాభిషేకం చేయబోతోంది తెలంగాణ. సంప్రదాయానికి పట్టం కడుతూ, అదే సమయంలో ఆధునికతను కూడా మేళవిస్తూ ప్రపంచ తెలుగు మహాసభలను న భూతో అన్న రీతిలో నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది.
శుక్రవారం ప్రారంభం కానున్న ఈ ఐదు రోజుల ‘తెలుగు’ పండుగను విజయవంతం చేసేందుకు ఏర్పాట్లన్నీ ముమ్మరంగా సాగుతున్నాయి. 1975లో తొలి ప్రపంచ తెలుగు మహాసభలకు వేదికగా నిలిచిన హైదరాబాద్ లాల్‌బహదూర్ స్టేడియమే ఈసారీ మహాసభల ప్రధాన వేదికకు ప్రాంగణమవుతోంది. ఇక్కడ భారీ కాకతీయ తోరణ ఆకృతి ప్రధానాకర్షణగా వేదిక రూపుదిద్దుకుంటోంది. ఇందుకోసం కార్మికులు మూడు రోజులుగా రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు.
అయితే వేదిక తదితర ఏర్పాటు పనులు ఆలస్యంగా మొదలయ్యాయి. పనుల్లో జాప్యం జరుగుతుండటంతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బుధవారం సాయంత్రం నుంచి రాత్రి దాకా ఎల్బీ స్టేడియం ప్రాంగణాన్ని పరిశీలించారు. గురువారం మధ్యాహ్నానికల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ వేదిక తదితరాలన్నీ సిద్ధమవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు, తెలుగు భాషకు సేవ చేసిన సాహితీ దిగ్గజాల పేరుతో నగరవ్యాప్తంగా 100 స్వాగత వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో 85 వరకు బుధవారానికే సిద్ధమయ్యాయి. ప్రధాన చారిత్రక భవనాలు, శాసనసభ, సచివాలయం, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాలను విద్యుద్దీపాల వెలుగులతో సుందరంగా ముస్తాబు చేశారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో తెలుగు మహాసభల భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
ప్రత్యేక ఆకర్షణగా లేజర్ షో
తెలుగు సంప్రదాయాన్ని కళ్లముందు నిలిపే వీనులవిందైన సన్నటి సంగీతం. మరోవైపు మిరుమిట్లు గొలిపే వేలాది వెలుగురేఖలు. వాటిని చీల్చుకుంటూ, బసవపురాణం రచిస్తూ పాల్కురికి సోమనాథుడు కళ్లెదుట కన్పిస్తాడు. ఆయన అంతర్థానమవుతూనే, భాగవతాన్ని తేనెలూరే తెలుగులో అందించిన బమ్మెర పోతన. ఆ వెంటనే కాకతీయ సామ్రాజ్య వైభవం. ఆ తర్వాత ఎందరెందరో తెలుగు సాహితీ దిగ్గజాలు... ఇలాంటి పలు విశేషాలతో లేజర్ షో ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభ కార్యక్రమాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
దాదాపు 20 నిమిషాల పాటు ఆహూతులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తనుంది. గతంలో హైదరాబాద్‌లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్, ఏషియన్ గేమ్స్‌లో బాణసంచా, లేజర్ షోలతో ఆకట్టుకున్న ప్రఖ్యాత విజ్‌క్రాఫ్ట్ సంస్థకు ఈ బాధ్యత అప్పగించినట్టు తెలిసింది. మహాసభల్లో పలు దేశాల నుంచి 410 మందితెలుగు భాషాభిమానులు, దేశవ్యాప్తంగా 1,000 మంది ఆహ్వానితులు, 7,000 మంది ఔత్సాహికులు... మొత్తమ్మీద 50 వేల మంది దాకా తొలి రోజు కార్యక్రమాల్లో పాల్గొంటారని అంచనా. ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆహ్వానితులకు, పేర్లు నమోదు చేసుకున్న వారికి భోజనం, రవాణా, బస తదితరాలు ఉచితంగా కల్పిస్తున్నారు. నేరుగా వచ్చే వారికి చవక ధరకే భోజనం అందించేందుకు ఎల్బీ స్టేడియంలో 60 భోజన కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.
తొలి రోజు ఇలా..
♦ తొలి రోజు శుక్రవారం ప్రధాన వేదికైన ఎల్బీ స్టేడియంలో పాల్కురికి సోమనాథుని ప్రాంగణం, బమ్మెర పోతన వేదిక వద్ద సాయంత్రం ఐదింటికి మహాసభలకు శ్రీకారం జరుగుతుంది
♦ ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, విశిష్ట అతిథులుగా గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు పాల్గొంటారు
♦ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సభాధ్యక్షత వహిస్తారు
♦ కార్యక్రమాలు ప్రారంభమైనట్టు ప్రకటించగానే 15 నిమిషాల పాటు వీనులవిందైన సంగీతం, భారీ బాణసంచా తదితరాలు అలరిస్తాయి. అనంతరం సాంస్కృతిక సమావేశం ఉంటుంది
♦ ఒడిశాకు చెందిన జ్ఞానపీఠ గ్రహీతలు సీతాకాంత్ మహాపాత్ర, ప్రతిభారాయ్‌లను సన్మానిస్తారు. దీనికి ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ గౌరవ అతిథిగా, మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరవుతారు
♦ సాయంత్రం 6.30 నుంచి 7 వరకు డాక్టర్ రాజారెడ్డి–రాధారెడ్డి ఆధ్వర్యంలో ‘మన తెలంగాణ’ సంగీత నృత్య రూపకం ఉంటుంది
♦ రాత్రి 7 నుంచి 7.30 వరకు రామాచారి బృందం లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీ ఆధ్వర్యంలో పాట కచేరీ
♦ 7.30 నుంచి రాత్రి 9 వరకు ‘జయజయోస్తు తెలంగాణ’ సంగీత నృత్యం