ఇంటింటికీ ప్రపంచ తెలుగు మహాసభలు

World Telugu Conference to every home - Sakshi

ప్రతి జిల్లాలో హోర్డింగ్‌లు, స్వాగత తోరణాలు

మహాసభల సందేశం అందరికీ చేరేలా ఏర్పాట్లు

సరస్వతీ ప్రార్థన, పోతన పద్యం ఆలాపనతో మహాసభలు ప్రారంభం

తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభల సమాచారం ఇంటింటికీ చేరేలా తెలంగాణ సాహిత్య అకాడమీ విస్తృత ప్రచారం చేపట్టింది. ఇప్పటికే గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహిం చగా తాజాగా తెలంగాణలోని 31 జిల్లాల్లో ప్రాచీన, ఆధునిక కవులు, రచయితలు, సాహితీవేత్తల ఫొటోలు, హోర్డింగ్‌లను ఏర్పాటు చేయనుంది. మహాసభలు జరగనున్న హైదరాబాద్‌లో ఇప్పటికే 100 హోర్డింగ్‌లు ఏర్పాటు చేసింది. నగరానికి వచ్చే అన్ని మార్గాల్లో ప్రముఖుల పేరుతో స్వాగత తోరణాలను ఏర్పాటు చేస్తోంది. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో ఆ జిల్లాకు చెందిన కవుల హోర్డింగ్‌లు, తోరణాలను మూడేసి చొప్పున ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభల ఉద్దేశాన్ని ప్రజలంతా అర్థంచేసుకునేలా ఈ నెల 13 వరకు అవగాహన ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రతినిధులు, అతిథులకు రైల్వేస్టేషన్‌లు, బస్‌స్టేషన్‌లలోనే మహాసభల సమాచారం తెలిసేవిధంగా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్‌లు, మహాత్మా గాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్‌లు, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కియోస్క్‌లు ఏర్పాటు చేస్తామన్నారు.

సరస్వతీ ప్రార్థనతో ప్రారంభం
మహాసభలు సరస్వతీ ప్రార్థనాగీతం తో ప్రారంభమవుతాయి. ఆ తరు వాత బమ్మెర పోతనామాత్యుడి విరచిత మహాభాగవతంలోంచి ఒక పద్యాన్ని రాగయుక్తంగా ఆలపిస్తారు. అనంతరం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులు ప్రసంగిస్తారు. ఆ తరువాత ఆచార్య ఎన్‌ గోపి వచన కవిత్వంపై మాట్లాడతారు. తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక ఇతివృత్తంతో డాక్టర్‌ రాధారెడ్డి రాజారెడ్డి రూపొందించిన కూచిపూడి నృత్యరూపకం, తెలంగాణ కవులు, రచయితలు, సాహితీవేత్తలను సమున్నతంగా ఆవిష్కరించే దేశిపతి శ్రీనివాస్‌ రూపొందించిన నృత్యరూపక ప్రదర్శనలతో మొదటి రోజు వేడుకలు ముగుస్తాయి. తెలుగుదనం ఉట్టిపడేలా తెలంగాణ భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు నేటి తరానికి తెలిసేలా ఎల్బీ స్టేడియంలో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. వేదిక బయటవైపు 50 తెలంగాణ రుచుల స్టాళ్లు, మరో 20 పుస్తక ప్రదర్శన స్టాళ్లు, 20 హస్తకళల స్టాళ్లు ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్‌ బిర్యానీతోపాటు, అన్ని రకాల తెలంగాణ పిండివంటలు తెలంగాణ రుచులను స్టాళ్ల ద్వారా సబ్సిడీ ధరల్లో విక్రయిస్తారు.

వైభవంగా వేడుకలు....
ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవ వేడుకలను వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించేందుకు తెలంగాణ సాహిత్య అకాడమీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకల్లో సుమారు 50 వేల మంది పాల్గొంటారని అంచనా. రాష్ట్రం నలుమూలలతోపాటు వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి తరలిరానున్న సుమారు 8 వేల మంది ప్రతినిధులు, అతిథులు, తెలుగు భాష, సాహిత్యాభిమానులు వేడుకల్లో పాల్గొనేలా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మొదటి రోజు ప్రారంభోత్సవానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తదితరులు హాజరవుతారు. ముగింపు ఉత్సవాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

తెలుగు భాషకు పట్టం కట్టిన ‘కురిక్యాల’శాసనం
....................
జిన భవనము లెత్తించుట
జిన పూజల్సేయుచున్కి జినమునులకున
త్తిన అన్నదానం బీవుట
జిన వల్లభుబోలగలరె జిన ధర్మపరుల్‌
..............................
దినకరు సరివెల్గుదుమని
జినవల్లభునొట్ట నెత్తు జితన వినచున్‌
మనుజుల్గలరే ధాత్రిన్‌
వినుతిచ్చుడు ననియవృత్త విబుధ కవీన్ద్రుల్‌ 
..............................................
ఒక్కొక్క గుణంబు కల్గుదు 
రొక్కణ్ణి గాకొక్క లెక్కలేదెవ్వరికిన్‌
లెక్కింప నొక్కలక్కకు
మిక్కిలి గుణపక్షపాతి గుణమణ గుణముల్‌

తెలుగు భాషకు ప్రాచీన హోదా తెచ్చిపెట్టిన కందపద్యాలివి. ఏ భాషకైనా ప్రాచీన హోదా రావాలంటే కనీసం వెయ్యేళ్ల చరిత్ర ఉండాలి. కరీంనగర్‌ జిల్లా బొమ్మలగుట్ట సమీపంలోని కురిక్యాల వద్ద లభించిన కురిక్యాల రాతి శాసనం ఆ ఆధారాన్ని అందించింది. క్రీస్తు శకం 946లోనే జినవల్లభుడు తెలుగులో రాసిన కందపద్యాలు వెయ్యేళ్లకుపైగా తెలుగు వాడుకలో ఉందని నిరూపించాయి. కురిక్యాల శాసనంపై సంస్కృతం, కన్నడం, తెలుగు మూడు భాషలలో ఈ పద్యాలు ఉన్నట్లు శాసనాల అధ్యయనంలో వెల్లడైంది. 2వ హరికేసరి కాలానికి చెందిన ఈ శాసనంలో జైనమత ప్రసిద్ధి, దేవాలయాలు, పూజావిధానాలు, తదితర అంశాలపై జినవల్లభుడు పద్యాలు రాసినట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి తెలిపారు.

మహాసభల్లో ఉచితంగా ‘వాగ్భూషణం..భూషణం’
కేసీఆర్‌కు నచ్చిన పుస్తకం10 వేల కాపీలు ముద్రణ
సభలు, సదస్సుల్లో అందరూ మెచ్చేవిధంగా ప్రసంగించాలంటే ఏం చేయాలి? ఎలాంటి ప్రసంగంతో సభికులను ఆకట్టుకోగలం? నాయకులుగా రాణించాలనుకునే వారి ప్రసంగాలు ఎలా ఉండాలి? ఇలాంటి వివరాలతో అప్పట్లో ఇరివెంటి కృష్ణమూర్తి రాసిన ‘వాగ్భూషణం..భూషణం’పుస్తకం ప్రపంచ తెలుగు మహాసభల్లో విశేషంగా ప్రాచుర్యంలోకి రానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎంతో నచ్చిన ఈ పుస్తకాన్ని మహాసభలకు హాజరయ్యే ప్రతి ఒక్కరికీ ఉచితంగా అందజేయనున్నారు. ఇందుకోసం 10 వేల కాపీలను ముద్రిస్తున్నారు. కేసీఆర్‌ను జనరంజకమైన నేతగా తీర్చిదిద్దడంలో ఈ చిన్న పుస్తకం ‘వాగ్భూషణం..భూషణం’ఎంతో దోహదం చేసినట్లు ఆయన సన్నిహితులు చెబుతారు. ఎస్‌ఈఆర్టీ రూపొందించిన ‘తెలంగాణ సాంస్కృతిక వైభవం’అనే మరో పుస్తకాన్ని కూడా అందజేయనున్నారు. ప్రతినిధులకు ఇచ్చే కిట్‌లో మహాసభల వివరాలతో కూడిన బ్రోచర్, తెలంగాణ సాంస్కృతిక వైభవం, తదితరాలు ఉంటాయి. బ్రోచర్‌లో 5 రోజుల కార్యక్రమాల వివరాలను పొందుపరుస్తున్నారు.

మహాసభలపై డాక్యుమెంటరీ.. 
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ప్రపంచ తెలుగు మహాసభలను ప్రత్యేకంగా వీడియో చిత్రీకరణ చేయనున్నారు. దీనిని ‘తెలంగాణ వైభవం’పేరుతో డాక్యుమెంటరీగా రూపొందించి భద్రపరుస్తారు. ఐదు వేదికల్లో, ఐదు రోజుల పాటు జరిగే అన్ని కార్యక్రమాలను మినిట్‌ టు మినిట్‌ చిత్రీకరిస్తారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top