'శక్తిగా ఎదిగి.. 'నిర్భయం'గా ఉండండి' | Sakshi
Sakshi News home page

'శక్తిగా ఎదిగి.. 'నిర్భయం'గా ఉండండి'

Published Sat, Jan 31 2015 9:53 AM

'శక్తిగా ఎదిగి.. 'నిర్భయం'గా ఉండండి' - Sakshi

- నిర్భయ కేంద్రం, శిశు గృహ భవనాల
ప్రారంభోత్సవంలో ఎంపీ కవిత

 
ఇందూరు: తెలంగాణ ఆడబిడ్డలు ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనే శక్తిని సముపార్జించుకుని నిర్భయంగా ఉండాలని ఎంపీ కవిత సూచించారు. సుభాష్‌నగర్‌లో నిర్మించిన శిశుగృహ భవనాన్ని  శుక్రవారం ప్రారంభించారు. భవనంలోని సౌకర్యాలను  ఆమె పరిశీలించారు. శిశుగృహలో ఉన్న అనాథలైన ఏడాదిలోపు పిల్లలకు అన్నప్రాసన చేశారు. ఏడాది వయసు గల పాపను ఆర్మూ ర్ మండలం పెర్కిట్‌కు చెందిన దంపతులకు దత్తత ఇచ్చారు.

అనంతరం జిల్లా ప్రభుత్వాస్పత్రికి చేరుకుని ఐదో అంతస్తులో ఏర్పాటు చేసిన నిర్భయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఐసీడీఎస్ పీడీ రాములుతో మాట్లాడి నిర్భయ కేంద్రంలో కల్పించి న సౌకర్యాలు, పని చేసే సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. ఫోన్ ద్వారా ట్రయల్ కాల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన సమావేశాన్ని కవిత ప్రారంభించారు. తెలంగాణ ఆడబిడ్డల సంక్షేమం కోసం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఆడబిడ్డ బిందెతో రోడ్డెక్కకుండా ఉండేందుకు వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తున్నారన్నారు. పేద ఎస్సీ ఎస్టీ మహిళలను వివాహ సమయంలో ఆదుకోవడానికి కళ్యాణలక్ష్మి, ఆడబిడ్డలను ఆపదలనుంచి కాపాడేందుకు షీ టీంల ఏర్పాటు వంటి చర్యలు తీసుకున్నారన్నారు.
 
ఆడబిడ్డలపై లైంగిక దాడులు, గృహహింస వేధింపులు జరిగితే వారికి అండగా నిలిచేందుకు నిర్భయ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. దాడుల బారిన పడిన మహిళలు, గృహహింస బాధితులు వారి సమస్యను నేరుగా చెప్పుకోవడానికి నిర్భయ కేంద్రం ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇందులో లీగల్ కౌన్సిలర్, పోలీసులు, డాక్టర్ ఉంటారని, ఎలాంటి సమస్యకైనా ఇక్కడ పరిష్కారం లభించడంతో పాటు నిందితులకు శిక్షపడే విధంగా నిర్భయ కేంద్రం పని చేస్తుందని తెలిపారు.

ఎలాంటి సమస్య ఎదురైనా నిర్భయ కేంద్రానికి 08462-225181 ఫోన్ చేయాలని సూచించారు. త్వరలోనే టోల్ ఫ్రీ నంబరు కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం నిర్భయ కేంద్రానికి సంబంధించి వాల్ పోస్టర్లను, కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, కలెక్టర్ రొనాల్డ్ రోస్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, మేయర్ ఆకుల సుజాత తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement