హైదరాబాద్: 2015 ఆగస్టు 15 నాటికి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
హైదరాబాద్: 2015 ఆగస్టు 15 నాటికి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాగునీటి సదుపాయం కూడా కచ్చితంగా ఉండేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. సచివాలయంలో సోమవారం పాఠశాలల్లో తాగునీరు, టాయిలెట్ పరిస్థితులపై విద్యాశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిసరఫరా శాఖ అధికారులతో పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు, విద్యాశాఖమంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్షించారు. టాయిలెట్ల నిర్మాణానికి చేపట్టాలని చర్యలను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
భేటీ నిర్ణయాలను జగదీశ్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం 24,364 వరకు పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. 4,693 వరకు పాఠశాలల్లో తాగునీటి సదుపాయం కల్పించేందుకు రెండుశాఖలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. 2,100 పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేక టాయిలెట్ సదుపాయం కల్పించాల్సి ఉందని తేల్చారు. పాఠశాలల్లో టాయిలెట్ల పరిస్థితిపై సమగ్ర నివేదికలను వారంరోజుల్లో తమకు అందజేయాలని విద్యాశాఖ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.