ఇద్దరిని బలిగొన్న ఈత సరదా | Which killed two swimming fun | Sakshi
Sakshi News home page

ఇద్దరిని బలిగొన్న ఈత సరదా

Jun 11 2015 12:08 AM | Updated on Mar 28 2018 11:08 AM

చౌటుప్పల్: ఈత సరదా ఇద్దరు చిన్నారులను బలిగొంది. అప్పటి వరకు తమకళ్ల ఎదుట ఉన్న బాలురు అంతలోనే విగతజీవులుగా మారడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

చౌటుప్పల్: ఈత సరదా ఇద్దరు చిన్నారులను బలిగొంది. అప్పటి వరకు తమకళ్ల ఎదుట ఉన్న బాలురు అంతలోనే విగతజీవులుగా మారడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. వివరాలు.. చౌటుప్పల్ మండలం పెద్దకొండూరు గ్రామానికి చెందిన పోలబోయిన బుచ్చయ్య కుమారుడు మనోజ్(13), రంగారెడ్డి జిల్లా బోడుప్పల్‌కు చెందిన దుర్గం బాబు కుమారుడు ప్రేమ్‌సాగర్(12), గుండెబోయిన జంగయ్య కుమారులు నవీన్, కిశోర్‌లు బుధవారం మధ్యాహ్నం పెద్దకొండూరు సమీపంలోని చెరువులోకి ఈతకు వెళ్లారు. ప్రేమ్‌సాగర్, మనోజ్‌లు నీటిలో ఆడసాగారు. మిగతా ఇద్దరు పిల్లలు ఒడ్డున ఉన్నారు. ఈక్రమంలో మనోజ్ నీళ్లలోకి దిగాడు.
 
 అతడికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోతుండగా, అతడిని రక్షించేందుకు ప్రేమ్‌సాగర్ కూడా నీళ్లలోకి దిగాడు. ఇతడికీ ఈత రాకపోవడంతో, ఇద్దరూ నీళ్లలో మునిగిపోయారు. ఒడ్డున ఉన్న నవీన్ తన తమ్ముడు కిశోర్‌ను అక్కడే ఉంచి గ్రామంలోకి పరుగులు తీసి విషయం తల్లిదండ్రులకు చెప్పాడు. గ్రామస్తులు వచ్చి చూసేసరికి మనోజ్, ప్రేమ్‌సాగర్ మృతిచెందారు. కాగా, ఈ నలుగురు పిల్లలు దగ్గరి బంధుత్వం గల అక్కాచెల్లెళ్ల పిల్లలు. ప్రేమ్‌సాగర్ వేసవి సెలవులు కావడంతో ఇక్కడికి వచ్చాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చౌటుప్పల్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఐ భూపతి గట్టుమల్లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తహసీల్దార్ షేక్‌అహ్మద్ సంఘటన స్థలాన్ని సందర్శించి పంచనామా నిర్వహించారు.
 
 అప్పుడే నూరేళ్లు నిండాయారా..
 బోడుప్పల్‌కు చెందిన దుర్గం బాబు, వాణి దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. పెద్దకొండూరుకు చెందిన పోలబోయిన బుచ్చయ్య, లింగమ్మ దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. రెండు కుటుంబాల్లోని ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో, తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. అప్పుడే నూరేళ్ల నిండాయా కొడుకా.. అంటూ వారు రోదించిన తీరు అందరినీ కలచివేసింది. కాగా, ప్రేమ్‌సాగర్ బోడుప్పల్‌లో 5వ తరగతి చదువుతుండగా, మనోజ్ పెద్దకొండూరులో చౌటుప్పల్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేశాడు. వీరిద్దరినీ ఈ ఏడాది నకిరేకల్‌లోని హాస్టల్‌లో చేర్పించాలనుకున్నారు వారి తల్లిదండ్రులు. ఈనెల 12నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండడంతో, ప్రేమ్‌సాగర్ బుధవారం సాయంత్రం బోడుప్పల్‌కు వెళ్లాల్సి ఉంది. అంతలోనే విద్యార్థులు ఈతకని వెళ్లడంతో మృత్యురూపంలో చెరువు గుంత కబళించింది. దీంతో పెద్దకొండూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.
 
 ఇటుక బట్టీల మట్టి కోసం తీసిన గుంతల వల్లే..    
 పెద్దకొండూరు చెరువు పక్కనే పెద్ద ఎత్తున ఇటుక బట్టీలు ఉన్నాయి. ఇటుక బట్టీలకు అవసరమైన మట్టిని బట్టీల యజమానులు ఎలాంటి అనుమతులు లేకుండానే జేసీబీలతో పెద్ద ఎత్తున మట్టిని తోడారు. దీంతో లోతైన గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల చెరువును పిలాయిపల్లి కాలువ ద్వారా మూసీ జలాలతో నింపారు. ఈ పెద్ద గుంతలు నీటితో నిండిపోయాయి. అంతకుముందు కూడా ఈతకు వెళ్లిన పిల్లలు చిన్న గుంతల్లో స్నానం చేసి ఇంటికి వచ్చారు. బుధవారం ఈతకు వెళ్లిన పిల్లలు గుంతల లోతు తెలియక అందులో మునిగి మృత్యువాతపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement