ఎయిమ్స్, నిమ్స్ రెండూ కావాలి! | we want aaims and nims both hospitals, says laxma reddy | Sakshi
Sakshi News home page

ఎయిమ్స్, నిమ్స్ రెండూ కావాలి!

Mar 15 2015 3:01 AM | Updated on Sep 2 2017 10:51 PM

ఎయిమ్స్, నిమ్స్ రెండూ కావాలి!

ఎయిమ్స్, నిమ్స్ రెండూ కావాలి!

బీబీనగర్ నిమ్స్ స్థానం లో ఎయిమ్స్ ఏర్పాటు అంశంపై శాసన సభలో వాడివేడి చర్చ జరిగింది.

 బీబీనగర్ నిమ్స్‌పై శాసనసభలో చర్చ
 ప్రభుత్వాన్ని నిలదీసిన కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు
 నిమ్స్ అవసరం లేదన్న వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి
 సాక్షి, హైదరాబాద్: బీబీనగర్ నిమ్స్ స్థానం లో ఎయిమ్స్ ఏర్పాటు అంశంపై శాసన సభలో వాడివేడి చర్చ జరిగింది. ఈ అంశంపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడి సునీత, వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీఎల్పీ నేత కె.లక్ష్మణ్ లేవనెత్తిన ప్రశ్నపై శనివారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. అధికార టీఆర్‌ఎస్- కాంగ్రెస్, బీజేపీ సభ్యులు పరస్ప రం ఆరోపణలు చేసుకున్నారు. ఎయిమ్స్‌ను మరోచోట ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రజలకు నిమ్స్, ఎయిమ్స్ రూపంలో రెండు పెద్ద ఆస్పత్రుల సేవలు అందుబాటులోకి వచ్చేవని చిం తల రామచంద్రారెడ్డి(బీజేపీ) ప్రభుత్వాన్ని నిలదీశారు. బీబీనగర్ నిమ్స్ భవన నిర్మాణం పూర్తైదని, కేవలం పరికరాలు, వైద్యులను అందుబాటులోకి తెస్తే సరిపోతుందన్నారు.

రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటుకు అంగీకరిస్తూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ స్వయంగా లేఖ రాసినా.. రాష్ట్ర ప్రభుత్వం ఆ స్పత్రికి కావాల్సిన భూసేకరణ జరపకుండా ఆలస్యం చేయడం వల్లే ఈ బడ్జెట్‌లో కేంద్రం నిధులు కేటాయించలేకపోయిందని ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ తప్పుబట్టారు. ఎయిమ్స్ వచ్చే వరకైనా బీబీనగర్ నిమ్స్ ఆధ్వర్యంలో ఆస్పత్రిని ప్రారంభించి వైద్య సేవలు అందించాలని జీవన్‌రెడ్డి(కాంగ్రెస్)డిమాండ్ చేశారు. ఈ అంశంపై అధికార పక్షం విపక్షాలపై ఎదురుదాడి చేసింది.

బీబీ నగర్ నిమ్స్ ఆస్పత్రి స్థాపన నీరుగార్చడానికి గత కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి ఆరోపించారు. ఇప్పుడా ప్రాంతంలో నిమ్స్ ఆస్పత్రి అవసరం లేదన్నారు. చుట్టుపక్కల ఉన్న 4 జిల్లాల అవసరాలను దృష్టిలో పెట్టుకునే నిమ్స్ స్థానంలో ఎయిమ్స్ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని నిర్ణ యం తీసుకున్నామన్నారు. పునర్విభజన చట్టంలో ఎయిమ్స్ ఏర్పాటుపై హామీ లేకపోయినా సీఎం కేసీఆర్, తమ ఎంపీల చొరవతో కేంద్రం అంగీకరించిందన్నారు. బీబీ నగర్ నిమ్స్‌కు 150 ఎకరాలు ఉన్నాయని, అక్కడే ఎయిమ్స్‌ను నెలకొల్పేందుకు కావాల్సిన మరో 50 ఎకరాలను సేకరిస్తున్నామన్నారు. దీనికి సంబంధించి రాష్ట్రం నుంచి వెళ్లిన ప్రతిపాదనలు కేంద్రం వద్ద పరిశీలనలో ఉన్నాయన్నారు.


 ఉమ్మడిజాబితాలో జేఎన్‌టీయూలేదు
 పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 10లోని ఉమ్మడి సంస్థల జాబితాలో ‘జేఎన్‌టీయూ హెచ్’ వర్శిటీ లేనందునే రాష్ట్ర విద్యార్థుల కోసం ప్రత్యేక ఎంసెట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రలకు వేర్వేరుగా ఎంసెట్ నిర్వహణ ఎందుకు? అని పువ్వాడ అజయ్ కుమార్(కాంగ్రెస్) అడిగిన ప్రశ్నకు ఆయనపై విధంగా సమాధానమిచ్చారు. రాష్ట్రంలో అడవుల విస్తీర్ణాన్ని మూడేళ్లలో 25 నుంచి 35 శాతానికి వృద్ధి చేసేందుకు హరిత హారం కార్యక్రమాన్ని చేపట్టామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగురామన్న స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రం లో 25.43 లక్షల హెక్టార్లలో అడవులున్నాయన్నారు. టీఆర్‌ఎస్ సభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి, కె.విద్యాసాగర్, చింతా ప్రభాకర్, వీరేశం, ఆరూరి రమేష్, రాథోడ్ బాపూరావు అడిగిన ప్రశ్నకు మంత్రి జోగురామన్న పైవిధంగా స్పందించారు.        
 ఠ ఎర్రగడ్డలోని ఛాతీ వ్యాధుల ఆస్పత్రిని వాకారాబాద్‌లోని అనంతగిరి హిల్స్‌లో ఉన్న టీబీ శానిటోరియంకు మార్చాలని నిర్ణయం తీసుకున్న విషయం వాస్తవమేనని వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఎర్రగడ్డ ఆస్పత్రి స్థలంలో అత్యాధునిక సచివాలయ సముదాయం నిర్మించనున్నామన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement