
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ ఇస్తామన్న హామీ అమలులో భాగం గా అర్హులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఇప్పటివరకు 6 లక్షల మంది అర్హులను గుర్తించామని, హైదరాబాద్ తదితర పట్టణ ప్రాంతాల్లో సర్వే జరుగుతోందన్నారు. ఆయా ప్రాంతాల్లో కూడా సమాచారం సేకరించాక అమలు చేస్తామని తెలిపారు.
బుధవారం అసెంబ్లీలో పద్దులపై చర్చ సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పద్దులపై ఎర్రబెల్లి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల అభివృద్ధికి, వాటి బలోపేతానికి సీఎం కేసీఆర్ అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి పని చేస్తున్నారన్నారు. 8,690 ఉన్న గ్రామ పంచా యతీలను 12,750కి పెంచారని, వాటిల్లో ఖాళీలను భర్తీ చేశారన్నారు. అర్హులకు పదోన్నతులు ఇచ్చామని పేర్కొన్నారు. సఫాయి కార్మికుల వేతనాలను రూ.8,500కు పెంచామని తెలిపారు.
ఉప సర్పంచ్‌కి చెక్ పవర్ ఇస్తే తప్పేంటి?
గ్రామాల్లో సర్పంచ్‌తోపాటు ఉప సర్పంచ్‌కి చెక్ పవర్ ఇస్తే ఇబ్బంది ఏంటని ఎర్రబెల్లి ప్రశ్నించారు. ప్రజల ఓట్లతోనే గెలిచిన ఉప సర్పంచ్‌కి చెక్ పవర్ ఇవ్వడం వల్ల జరిగే నష్టం ఏంటని పేర్కొన్నారు. ఈ విషయంలో కొంతమంది కావాలనే రాజకీయాలు చేస్తున్నారని, వాటిని ఎమ్మెల్యేలు పట్టించుకోవద్దని సూచించారు.