అన్ని చర్యలు తీసుకుంటూనే ఉన్నాం

We Are Taking All Steps To Prevent Dengue - Sakshi

ఆసుపత్రుల్లో అదనపు వైద్యులను నియమించాం

హైకోర్టుకు నివేదించిన వైద్య ఆరోగ్య శాఖ

క్షేత్రస్థాయిలో చర్యలు కనిపించడం లేదన్న ధర్మాసనం

విచారణ 15వ తేదీకి వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: డెంగీ నివారణకు అవసరమైన అన్ని చర్యలను చేపడుతూనే ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నిలోఫర్‌ తదితర ఆసుపత్రుల్లో అదనపు డాక్టర్లను నియమిస్తున్నామని వివరించింది. డెంగీ నిర్ధారణకు అవసరమైన పరీక్షలు చేసేందుకు ఆసుపత్రుల్లో అన్ని ఏర్పాట్లు చేశామని, అదనపు మంచాలను కూడా ఏర్పాటు చేశామని తెలిపింది. దోమల నివారణకు ఫాంగింగ్‌ యంత్రాలను అదనంగా కొనుగోలు చేశామని పేర్కొంది.

శుభ్రతను పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. రాష్ట్రంలో డెంగీ విస్తృతంగా ప్రబలుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందంటూ డాక్టర్‌ కరుణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. అలాగే న్యాయవాది రాపోలు భాస్కర్‌ రాసిన లేఖను కూడా హైకోర్టు పిల్‌గా పరిగణించింది. ఈ వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ అభిషేక్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. డెంగీ నివారణకు తీసుకుంటున్న చర్యలను వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కౌంటర్‌ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదికల్లో అలా చేస్తున్నాం.. ఇలా చేస్తున్నాం అని చెప్పడమే తప్ప, క్షేత్రస్థాయిలో అవి అమలవుతున్నట్లు కనిపించడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. క్షేత్రస్థాయిలో తీసుకున్న చర్యలు, వాటి ఫలితాలతో నివేదిక సమరి్పంచాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top