ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు కమిషనర్ నియామకంపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు.
- ఇన్‌చార్జి పాలనలో కార్పొరేషన్
- రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో భర్తీ
- ఖమ్మానికి మాత్రం గ్రహణం
సాక్షి, ఖమ్మం: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు కమిషనర్ నియూమకంపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. ఒక్క ఖమ్మం మినహా రాష్ట్రంలో అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు కమిషనర్లు నియమితులయ్యారు. ఖమ్మం అర్బన్ మండలంలోని తొమ్మిది పంచాయతీలతో కార్పొరేషన్‌గా అవతరించినప్పటికీ పూర్తిస్థాయి కమిషనర్ నియామకంపై ప్రభుత్వం దృష్టిపెట్టకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పురపాలకాలపై మంగళవారం జరిగిన మంత్రివర్గ ఉప సంఘం భేటీలో కూడా ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ నియామక విషయం చర్చకు రాలేదని తెలిసింది.
కార్పొరేషన్ స్థాయికి తగినట్టుగా ఐఏఎస్ అధికారిని కమిషనర్‌గా నియమించాల్సుంది. నూతన ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలైనా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. కమిషనర్ లేకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు నగర ప్రజలకు సక్రమంగా అందడం లేదు. నగరంలో ఆసరా పింఛన్ల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. ఇంకా వేలమంది లబ్ధిదారులు పింఛన్ కోసం కార్పొరేషన్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు. ఆహార భద్రత కార్డుల ప్రక్రియ ప్రహసనంగా మారే పరిస్థితుంది. ఇన్‌చార్జి కమిషనర్ పాలనలో కిందిస్థాయి అధికారులు, సిబ్బంది మధ్య సఖ్యత లేకపోవడంతో పాలన గాడి తప్పింది.
ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వివిధ పనులపై కార్పొరేషన్ కార్యాలయూనికి వస్తున్న ప్రజలను ఎవరూ పట్టించుకోవడం లేదు. నగరంలోని రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత కొరవడింది. త్వరలో జీహెచ్‌ఎంసీ, వరంగల్‌తోపాటు ఖమ్మం కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా.., ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటనకు వస్తారని ప్రచారం జరుగుతున్నా.. కమిషనర్ నియామకం దిశగా మాత్రం అడుగులు ముందుకు పడడం లేదు.
ప్రస్తుతం ఈ వేసవిలో ఖమ్మం నగరానికి మంచినీటి ఎద్దడి పొంచి ఉంది. ఆ దిశగా ఇప్పటి వరకు కార్పొరేషన్ అధికారులు ప్రణాళిక సిద్ధం చేయలేదు. ఈ అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకొనైనా ఐఏఎస్ స్థాయి అధికారిని కమిషనర్‌గా నియమిస్తే పాలన గాడిలో పడడంతోపాటు నగర ప్రజల సమస్యలకు మోక్షం కలుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.