మళ్లీ ఓట్ల ‘పంచాయితీ’! | Sakshi
Sakshi News home page

మళ్లీ ఓట్ల ‘పంచాయితీ’!

Published Tue, Jan 15 2019 2:43 AM

Votes Missing Heavily also In Sarpanch Election - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వివాదానికి కారణమైన 22 లక్షల ఓట్ల గల్లంతుపై రచ్చ జరుగుతుండగానే.. పంచాయతీ ఎన్నికల్లోనూ ఈ గల్లంతు వ్యవహారం వివాదాస్పదమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల జాబితాతో అభాసుపాలైనా తీరుమార్చుకోని ఎన్నికల సంఘం.. ఈ జాబితా ఆధారంగానే పంచాయతీ ఓటర్ల జాబితాను రూపొందిస్తుండటమే ఇందుకు కారణం. శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం షెడ్యూల్‌ను ప్రకటించింది. డిసెంబర్‌ 26 నుంచి జనవరి 25 వరకు కొత్త ఓటర్ల నమోదు కోసం దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. ఈ నెల 9వరకు కొత్త ఓటర్ల నమోదు కోసం ఏకంగా 8,64,128 దరఖాస్తులొచ్చాయి.

2019 జనవరి 1నాటికి 18 ఏళ్లు నిండిన వ్యక్తులకు అవకాశం కల్పిస్తూ ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరిస్తుండగా, ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్లో 18–19 ఏళ్ల వయస్సు గల కొత్త ఓటర్ల దరఖాస్తుల సంఖ్య వేలల్లోనే ఉండనుంది. మిగిలిన వారిలో అత్యధికులు గతంలో ఓటుండి.. ఆ తర్వాత జాబితాలో పేర్లు గల్లంతైనవారే. ఇప్పటికే ఓటర్ల నమోదుకు 8.6లక్షల దరఖాస్తులు రాగా, ఈ నెల 25తో గడువు ముగిసే నాటికి ఈ సంఖ్య 20 లక్షలకు మించే అవకాశముందని ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది. ఇందులో సగానికిపైగా గ్రామీణ ఓటర్లే ఉండనున్నారు. ఫిబ్రవరి 22న ప్రచురించనున్న కొత్త ఓటర్ల జాబితాలో వీరికి చోటు లభించనుంది. అయితే.. ఈ నెల 21, 25, 30 తేదీల్లో మూడు దశల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం వీరికి ఉండదు. 

అసెంబ్లీ జాబితాతోనే.. 
శాసనసభ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలను విభజించి గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా తయారు చేసిన ఓటర్ల జాబితాలను పంచాయతీ ఎన్నికల్లో వినియోగిస్తున్నారు. డిసెంబర్‌ 19న తొలి అనుబంధ ఓటర్ల జాబితా ప్రచురించగా, గ్రామ పంచాయతీల్లో 1,49,52,058 మంది ఓటర్లున్నట్లు వెల్లడైంది. ఈ నెల 7న రెండో అనుబంధ ఓటర్ల జాబితాను ప్రచురించిన ఓటర్ల సంఖ్యగా స్వల్పంగా పెరిగి 1.50 కోట్లకు చేరింది. శాసనసభ ఎన్నికల్లో ఓట్లు గల్లంతైన వారు ఆ తర్వాత పెద్ద సంఖ్యలో మళ్లీ ఓటరుగా నమోదు కావడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను సకాలంలో పరిష్కరించకుండా పెండింగ్‌లో ఉంచడంతో రెండో అనుబంధ ఓటర్ల జాబితాలో కొద్ది మంది కొత్త ఓటర్లకు మాత్రమే చోటు లభించింది. అదే విధంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కింద వచ్చిన 8.5లక్షల కొత్త ఓటరు నమోదు దరఖాస్తులను సైతం ఇంకా పరిష్కరించలేదు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించిన ఓటర్ల జాబితానే కాస్త.. అటు ఇటుగా మార్చి పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వినియోగించాల్సిన దుస్థితి ఏర్పడింది.  

ఆ రెండు కార్యక్రమాలతోనే..
2015లో చేపట్టిన నేషనల్‌ ఎలక్ట్రోల్‌ రోల్‌ ప్యూరిఫికేషన్‌ అండ్‌ అథెంటిఫికేషన్‌ ప్రొగ్రాం (నెర్పార్‌) కింద 35,00,700 ఓటర్లను, ఆ తర్వాత 2016లో ఇంటెన్సివ్‌ రివిజన్‌ ఆఫ్‌ ఎలక్ట్రోల్‌ రోల్‌ (ఐఆర్‌ఈఆర్‌) కార్యక్రమం కింద మరో 24,20,244 ఓటర్లు కలిపి మొత్తం 59,20, 944 ఓటర్లను తొలగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో లక్షల సంఖ్యలో ఓట్ల గల్లంతుకు ఈ రెండు కార్యక్రమాలే కారణమని విమర్శలున్నాయి. ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైన కారణంగా.. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయామని.. చాలా మంది ఔత్సాహిక అభ్యర్థుల నుంచి ఫిర్యాదులొచ్చాయి. ఈ క్రమంలో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో సైతం పెద్ద మొత్తంలో ఓట్లు గల్లంతు కావడానికి అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది.   

Advertisement
Advertisement