అంతుచిక్కని మున్సి‘పల్స్’


సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని పట్టణ ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. సోమవారం వెలువడిన ఫలితాలను చూస్తే....నాలుగు మున్సిపాలిటీలకు గాను   ఒక్క సత్తుపల్లి మినహా మిగిలిన మూడు చోట్ల ఏ పార్టీకీ మున్సిపల్ పీఠంపై కొలువుతీరేన్ని స్థానాలు రాలేదు.సత్తుపల్లిలో తెలుగుదేశం పార్టీ స్పష్టమైన ఆధిక్యం కనపర్చగా, కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. ఇక్కడ స్వతంత్రుల మద్దతు అనివార్యం కానుంది. ఇల్లెందులో కాంగ్రెస్, సీపీఐ కూటమి అధికారానికి దగ్గరగా రాగా, మధిరలో మాత్రం హంగ్ ఫలితం వచ్చింది. ఇక్కడ వైఎస్సార్‌సీపీ, సీపీఎంల మద్దతు కీలకం కానుంది. ఈ రెండు పార్టీల నిర్ణయం మేరకే ఇక్కడ మున్సిపాలకవర్గం ఏర్పాటు కానుందని ఫలితాలు చెబుతున్నాయి. ఈ ఫలితాలను బట్టి చూస్తే జిల్లాలోని పట్టణ ప్రజల నాడి రాజకీయ పార్టీలకు అంతుచిక్కలేదని స్పష్టమవుతోంది. అభ్యర్థుల గుణగణాలతో పాటు పార్టీల ప్రభావం కూడా కొంత మేర ఉండే మున్సిపల్ ఎన్నికలలో ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో ఇప్పుడు దృష్టంతా ఎంపీటీసీ, జడ్పీటీసీ, సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై పడనుంది. అయితే, జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల ఫలితాన్ని బట్టి సార్వత్రిక ఫలితాలను అంచనా వేయలేమని, ఈ ప్రభావం సార్వత్రికంపై ఉండదనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇల్లెందులో ఆ ‘ఇద్దరే’ కీలకం

 మున్సిపాలిటీల వారీగా పరిశీలిస్తే... ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్, సీపీఐ కూటమికి అత్యధిక స్థానాలు లభించాయి. ఇక్కడ

 మొత్తం 24 వార్డులుండగా, ఈ రెండు పార్టీలకు కలిపి 11 స్థానాలు వచ్చాయి. పాలకవర్గాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మరో ఇద్దరు స్వతంత్రులే ఇక్కడ కీలకపాత్ర పోషించనున్నారు. అయితే, ఇండిపెండెంట్లుగా గెలిచిన వారిలో ఒకరు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్‌పర్సన్ శిబిరంలో ఉన్నారు. సదరు అభ్యర్థి ఎన్నికల ఖర్చు కూడా వారే భరించినట్టు సమాచారం. ఇక మరో ఇండిపెండెంట్ మద్దతు కూడా కాంగ్రెస్, సీపీఐ కూటమికి సునాయాసంగా లభించవచ్చు. మిగిలిన పార్టీలకు వచ్చిన స్థానాలను బట్టి చూస్తే అన్నీ కలిసినా ఇక్కడ కొలువుతీరే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్, సీపీఐ కూటమి అధికారం దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధిరలో రసకందాయం

 కొత్తగా ఏర్పడిన మధిర నగరపంచాయతీ ఎన్నికలు తొలిసారే రసకందాయంలో పడ్డాయి. ఇక్కడ ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాలేదు. మొత్తం 20 స్థానాలకు గాను ఏడు చోట్ల వైఎస్సార్ సీపీ, సీపీఎం కూటమి అభ్యర్థులు గెలవగా, కాంగ్రెస్ నాలుగు, టీడీపీ ఆరు చోట్ల గెలిచింది. వైఎస్సార్ సీపీ, సీపీఎం కూటమికి చెందిన రెబల్ అభ్యర్థి కూడా విజయం సాధించారు. కాంగ్రెస్, టీడీపీలకు కలిపి 10 స్థానాలు రావడంతో ఇక్కడ ఈ రెండు పార్టీలు అవగాహనకు వస్తాయని, చెరి రెండున్నరేళ్ల పాటు చైర్మన్‌గిరీ దక్కేలా అధికారాన్ని పంచుకుంటారని ప్రచారం జరుగుతోంది. అయితే రెండు పార్టీలు కలిసినా వైఎస్సార్‌సీపీ, సీపీఎం ఇక్కడ కీలకం కానున్నాయి. ఈ పరిస్థితుల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత మధిర రాజకీయం మరింత వేడెక్కుతుందని, ఇక్కడ క్యాంపు రాజకీయాలకు కూడా ఆస్కారం ఉందని, కాంగ్రెస్, టీడీపీలు ఇందుకు సిద్ధం కావచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొత్తగూడెం  పద్ద కష్టమేమీ కాదు

 కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో కూడా ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోయినా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చైర్‌పర్సన్ గిరీని దక్కించుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మొత్తం 33 వార్డులకు గాను 12 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. మెజార్టీకి మరో ఐదు స్థానాలు అవసరం కాగా, వైఎస్సార్‌సీపీ,  ఇండిపెండెంట్ల మద్దతు కూడగట్టుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చైర్‌పర్సన్‌ను దక్కించుకునే అవకాశం  ఉంది. అయితే, కాంగ్రెస్‌లో కూడా చైర్మన్‌గిరీ కోసం పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. సత్తుపల్లిలో గెలిచి ఓడిన టీడీపీ

 ఇక సత్తుపల్లిలో మాత్రం తెలుగుదేశం పార్టీకి స్పష్టమైన మెజార్టీ లభించింది. మొత్తం 20 స్థానాలకు గాను 17 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక్కడ మూడు చోట్ల వైఎస్సార్‌సీపీ గెలుపొందింది. అయితే, ఇక్కడ టీడీపీ మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా ప్రకటించిన కందిమళ్ల నాగేశ్వరమ్మ ఓటమిపాలు కావడం ఆ పార్టీ శ్రేణులను నైరాశ్యంలో ముంచింది. మొత్తంమీద ఇక్కడ తెలుగుదేశం పార్టీ పాలకవర్గం ఏర్పాటు లాంఛనమే కానుంది. ఓట్ల కోసం పోటాపోటీ

 జిల్లాలోని పట్టణ ఓటర్ల ప్రసన్నం కోసం రాజకీయ పార్టీలు విపరీతంగా శ్రమించాయి. అయితే,  ఈ పోటీలో జిల్లా వ్యాప్తంగా చూస్తే టీడీపీ, కాంగ్రెస్‌లు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. మొత్తం దాదాపు లక్ష ఓట్లకు గాను 26వేలకు పైగా టీడీపీ, 23వేలకు పైగా కాంగ్రెస్‌లు సాధించాయి. అయితే, టీడీపీకి ఒక్క సత్తుపల్లిలోనే 12వేలకు పైగా పోలయ్యాయి. వైఎస్సార్‌సీపీ, సీపీఎం కూటమికి కూడా గణనీయంగానే ఓట్లు లభించాయి.ఈ రెండు పార్టీలకు కలిపి దాదాపు 14వేల ఓట్లు లభించాయి. సీపీఐకి 11వేలకుపైగా, టీఆర్‌ఎస్‌కు ఆరువేల వరకు ఓట్లు లభించాయి. అయితే, ఈ ఫలితాలు సార్వత్రిక ఎన్నికల ఫలితంపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదని రాజకీయ వర్గాలంటున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు నెలరోజుల ముందు మున్సిపల్ ఎన్నికలు అకస్మాత్తుగా జరగడం, ఆ సమయంలో కనీసం సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రాకపోవడం, పొత్తులు, ఎత్తులు ఖరారు కాకపోవడం లాంటి అంశాలు పరిగణనలోనికి తీసుకుంటే సార్వత్రిక ఫలితాలు భిన్నంగా రావచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కాగా,  మున్సిపల్ నూతన పాలక వర్గాలు జూన్ 5వ తేదీలోగా కొలువుదీరనున్నాయి.


 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top