అర్హులందరికీ ఆసరా | villagers angry on pensions | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ ఆసరా

Nov 8 2014 11:45 PM | Updated on Oct 16 2018 3:12 PM

అర్హులెవరికీ అన్యాయం జరగవద్దని, అనర్హులకు పింఛన్ పథకాన్ని.....

మెదక్:  వయసు మళ్లిన నిరుపేద వృద్ధులు...వితంతువులు, వికలాంగులకు భారీ మొత్తంలో పింఛన్లు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అర్హులెవరికీ అన్యాయం జరగవద్దని, అనర్హులకు పింఛన్ పథకాన్ని కట్టబెట్టొద్దని ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ, అధికారులు తమ ఇష్టారీతిగా సర్వే చేయడంతో పింఛన్ పథకం పల్లెల్లో చిచ్చు రేపుతోంది. పాపన్నపేట మండలంలో గతంలో 7,700 పింఛన్‌దారులు ఉండేవారు.

 తెలంగాణ ప్రభుత్వం సూచన మేరకు 11 వేల మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో 4,303 మందిని అధికారులు అర్హులుగా గుర్తించి కంప్యూటర్‌లో అప్‌లోడ్ చేశారు. ఇందులోనూ ఎన్‌ఐసీ వారు అందించిన జాబితా ఆధారంగా 4,296 మంది లబ్ధిదారులను ఖరారు చేశారు. దరఖాస్తుల పరిశీలనలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలు లేని కొన్ని వందల  దరఖాస్తులు పక్కన బెట్టారు.

దీంతో చాలామంది అర్హులైన వారు పేర్లు కూడా పింఛన్ల ఎంపికకు నోచుకోలేదు. శనివారం ఉదయం 3,200 మంది లబ్ధిదారుల పేర్లతో మండలంలోనిఅర్హుల జాబితా విడుదలైంది. దీంతో పింఛన్లు నోచుకోని వందలాది మంది బాధితులు మండల పరిషత్ కార్యాలయం, గ్రామ పంచాయతీల వద్ద ఆందోళనకు దిగారు. పింఛన్లు రాకుంటే తామెట్ల బతకాలని అధికారులను నిలదీశారు. చావు దగ్గరకు వచ్చిన తనకు పింఛన్ రాలేదని పాపన్నపేటకు చెందిన చిల్వర దుర్గమ్మ ఆందోళన వ్యక్తం చేశారు. కాలులేక పోవడంతో మంచంపైనే ఉన్నానని దోమకొండ కిష్టారెడ్డి అనే వికలాంగుడు కన్నీరు పెట్టారు.

 తప్పుల తడకగా అర్హుల జాబితా
 అధికారులు విడుదల చేసిన అర్హుల జాబితాలోనూ అనేక తప్పులు దొర్లాయి. 23 ఏళ్ల వయస్సు కలిగి, భర్త జీవించి ఉన్న మహిళలను అధికారులు వితంతువు పింఛన్‌కు అర్హురాలిగా గుర్తించారు. అలాగే ఆర్థికంగా ఉన్నవారిని కూడా అర్హుల జాబితాలో చేర్చారు. జాబితాలో లబ్ధిదారుల తండ్రి పేర్లే లేవు. ఆ కాలంలో కేవలం ‘ఎన్’ అనే అక్షరం ఉంది. మరికొన్ని చోట్ల లబ్ధిదారుల పేరు ఉండాల్సిన చోట వారి ఇంటి పేరు ఉంది. అధికారుల నిర్లక్ష్యానికి ఈ జాబితా అద్దం పడుతోంది.

 సాయంత్రానికి పెరిగిన అర్హులు
 శనివారం సాయంత్రానికి నేషనల్ ఇన్‌ఫర్మేషన్ సర్వే వారు విడుదల చేసిన జాబితాలో మరో 1,096 మంది పేర్లు వచ్చాయని పాపన్నపేట ఎంపీడీఓ చంద్రశేఖర్ తెలిపారు. అలాగే రామాయంపేట మండలంలో గతంలో 7 వేల పింఛన్లు ఉండగా, ఈసారి 5,560 మందిని మాత్రమే అర్హులుగా అధికారులు గుర్తించారు.

ఇక చిన్నశంకరంపేట మండలంలో గతంలో 4,450 పింఛన్లు ఉండగా, ఈసారి 4,590 మందిని, మెదక్ మండలంలో 8,255 పింఛన్లు ఉండగా, ఈసారి 6,533 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు. అయితే అర్హులైన వారందరికీ పింఛన్లు వస్తాయని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పాపన్నపేట ఎంపీపీ పవిత్ర, ఎంపీడీఓ చంద్రశేఖర్ తెలిపారు. కాగా తమ గ్రామాల్లో చాలా మంది అర్హులకు పింఛన్లు రాలేదని కొడుపాక ఎంపీటీసీ కిష్టమ్మ భూమయ్య, నాగ్సాన్‌పల్లి సర్పంచ్ ఇందిరలు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement