వికారాబాద్‌ కలెక్టర్‌పై సస్పెన్షన్‌ వేటు..

Vikarabad District Collector Syed Omer Jaleel Suspended - Sakshi

కోర్టు పరిధిలో ఉన్న ‘వికారాబాద్‌’ ఈవీఎంలను తెరవడంతో వివాదం  

కోర్టులో కాంగ్రెస్‌ అభ్యర్థి ఈపీ కేసు..

కలెక్టర్‌ను సస్పెండ్‌ చేయాలంటూ కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు..

విచారణ తర్వాత ఈసీ ఆదేశంతో సర్కార్‌ చర్యలు 

సాక్షి, వికారాబాద్‌: వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. వికారాబాద్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌కు చెందిన ఈవీఎంలను భద్రపరిచిన గది(స్ట్రాంగ్‌ రూం)ని నిబంధనలను అతిక్రమించి తెరిచిన సంఘ టనలో ఆయన సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం రాష్ట్ర అదనపు కార్యదర్శి జ్యోతి బుద్ధప్రకాశ్‌ వికారాబాద్‌ కలెక్టర్‌ జలీల్‌తో భేటీ అయి స్ట్రాంగ్‌రూం, ఈవీఎంలను పరిశీలించి వెళ్లిన మరుసటిరోజే ఆయనపై చర్యలు తీసుకోవడం గమనార్హం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా గడ్డం ప్రసాద్‌కుమార్‌ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కేవలం 2 వేల ఓట్ల తేడాతో ఓడిపోవడంతో ఓట్ల లెక్కింపుపై ఆయన అనుమానం వ్యక్తం చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

న్యాయస్థానం ఈపీ(ఎలక్షన్‌ పిటిషన్‌)గా ఈ కేసును స్వీకరించింది. న్యాయస్థానంలో ఎన్నికల కేసు దాఖలైన నియోజకవర్గాల ఈవీఎంలు భద్రపరిచిన గదులను తెరవకూడదనేది నిబంధన. అయితే, కలెక్టర్‌ ఈ నిబంధనను ఉల్లంఘించి ఈ నెల 1వ తేదీన స్ట్రాంగ్‌రూం తెరిచి వికారాబాద్‌ సెగ్మెంట్‌కు చెందిన 100కుపైగా ఈవీఎంల సీళ్లను సాంకేతిక నిపుణులతో కలసి పరిశీలించారు. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికలకుగాను ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలనే వినియోగించాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయా ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న ఓట్లను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టాలని గత నెల 31న రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లకు సూచించింది. అయితే, న్యాయస్థానంలో దాఖలైన కేసులకు సంబంధించిన నియోజకవర్గాల ఈవీఎంలను పరిగణనలోకి తీసుకోరాదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కలెక్టర్‌ గమనించలేదు. ఆ సమాచారం ఆయన వరకు చేరలేదు. దీంతో ఆయన వికారాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఈవీఎంల సీళ్లను తొలగించే కార్యక్రమం చేపట్టారు. దీంతో కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క, వికారాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం ప్రసాద్‌కుమార్, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి తదితర నేతలు జిల్లా కలెక్టర్‌పై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌కు ఈ నెల 2న ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి రజత్‌కుమార్‌ లేఖ రాశారు. కలెక్టర్‌కు నోటీసులు జారీ చేశారు. అయితే, ‘వికారాబాద్‌ నియోజకవర్గ ఈవీఎంలపై హైకోర్టులో ఎన్నికల పిటిషన్‌ దాఖలైన విషయం నా దృష్టికి రాలేదు, అందువల్లే స్ట్రాంగ్‌రూం తెరిచి ఈవీఎంల మొదటి దశ తనిఖీ ప్రక్రియ చేపట్టాన’ని ఎన్నికల సంఘానికి కలెక్టర్‌ వివరణ ఇచ్చినట్లు తెలిసింది.
 
సస్పెన్షన్‌ సమయంలో కేంద్ర బృందంతో కలెక్టర్‌... 
సస్పెండ్‌ చేసిన సమయంలో కలెక్టర్‌ జలీల్‌ కేంద్ర అధికారుల బృందంతో కలసి మోమిన్‌పేట మండలంలో పర్యటిస్తున్నారు. సస్పెన్షన్‌ విషయమై టీవీ చానళ్లలో బ్రేక్‌.. ఫ్లాష్‌న్యూస్‌లు రావడంతో పలువురు ఆయనకు సమాచారం అందించారు. కాగా, అప్పటికే కలెక్టర్‌కు ఈ విషయం తెలిసింది.  

13 నెలలపాటు సేవలు... 
వికారాబాద్‌ జిల్లా ఆవిర్భావం తర్వాత దానికి మొదటి కలెక్టర్‌గా దివ్యదేవరాజన్‌ను ప్రభుత్వం 2016, అక్టోబర్‌ 11న నియమించింది. 2017 డిసెంబర్‌లో ఆమె ఆదిలాబాద్‌ కలెక్టర్‌గా బదిలీ కావడంతో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ రఘునందన్‌రావును ఇన్‌చార్జి కలెక్టర్‌గా నియమించింది. 2018 జనవరి 2న ప్రభుత్వం రెగ్యులర్‌ కలెక్టర్‌గా ఉమర్‌ జలీల్‌ను నియమించడంతో జనవరి 6న ఆయన బాధ్యతలు స్వీకరించారు. సమర్థవంతమైన, కలుపుగోలుగా ఉండి అందరి మన్ననలు పొందిన ఆయన అనూహ్యంగా సస్పెషన్‌కు గురయ్యారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top