‘భారతీయులకు అమెరికా క్షమాపణ చెప్పాలి’

VHP Demands Apology From America - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తమ నేతలను అరెస్ట్‌ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని విశ్వహిందూ పరిషత్‌(వీహెచ్‌పీ) పేర్కొంది. అరెస్ట్‌ చేసిన వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షులు రామరాజు, భజరంగ్‌దళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్‌ చందర్‌తో పాటు ఇతర నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. అమెరికన్‌ ఇంటిలిజెన్స్‌ సంస్థ సీఐఏ రిపోర్టును నిరసిస్తూ బేగంపేటలోని అమెరికా రాయబార కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపిన తమ నేతలను అరెస్ట్‌ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధం అని విమర్శించింది.

హిందూ ధార్మిక సంస్థలైన వీహెచ్‌పీ, భజరంగ్‌ దళ్‌లను మతపరమైన ఉగ్రవాద సంస్థలుగా సీఐఏ పేర్కొనందుకు భారత సమాజానికి అమెరికా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది. సామాజిక ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, జాతీయ పున:నిర్మాణం కోసం సేవ చేస్తున్న సంస్థలపై తీవ్ర ఆరోపణలు చేయడం అమెరికా కుటిలనీతికి నిదర్శనమని పేర్కొంది. విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌ దళ్‌లను మతపరమైన ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించడం ద్వారా సీఐఏ తన అజ్ఞానాన్ని ప్రదర్శించిందని విమర్శించింది. సీఐఏ తన తప్పును సరిదిద్దుకొని భారతీయులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది.

అమెరికాకు చెందిన సెంట్రల్‌ ఇంటిలిజెన్స్‌ ఏజన్సీ(సీఐఏ) ప్రతి సంవత్సరం వరల్డ్‌ ఫ్యాక్ట్‌బుక్‌ పేరిట ప్రపంచంలోని వివిధ దేశాలకు సంబంధించిన ఆర్థిక, సామాజిక, రాజకీయ తదితర విషయాలపై తమ అభిప్రాయాలను పుస్తక రూపంలో విడుదల చేస్తుంటుంది. ఈ సంవత్సరం విడుదల చేసిన పుస్తకంలో హిందూ ధార్మిక సంస్థలైన విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌ దళ్‌లను మతపరమైన ఉగ్రవాద సంస్థలుగా పేర్కొంది. వాటిని రాజకీయ ఒత్తిడులకు పాల‍్పడే సంస్థలుగానూ, ఆర్‌ఎస్‌ఎస్‌ను జాతీయ సంస్థగా ప్రకటించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top