25 నుంచి 29 వరకు విశ్వ సమ్మేళనం | Sakshi
Sakshi News home page

25 నుంచి 29 వరకు విశ్వ సమ్మేళనం

Published Fri, Nov 28 2014 3:20 AM

University of compound 25 to 29

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రాయదుర్గంలోని నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో డిసెంబర్ 25 నుంచి 29వ తేదీ వరకు విశ్వ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ (పశ్చిమ) ప్రాంత అధ్యక్షుడు ఎం.రామారాజు, ప్రాంత పీఠ మందిర ప్రముఖ్ కిష్టంపల్లి నర్సింహారావు తెలిపారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో రామరాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న మఠాధిపతులు, పీఠాధిపతులు, విశ్వహిందూ పరిషత్ జాతీయ నాయకులు విశ్వసమ్మేళనానికి హాజరుకానున్నారని తెలిపారు.

డిసెంబర్ 28వ తేదీన ఎన్‌టీఆర్ స్టేడియంలో భారీ బహిరంగసభ ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా రామ్‌దేవ్‌బాబా హాజరవుతారని తెలిపారు. ఈనెల 29న(శనివారం) నల్లకుంట శివంరోడ్‌లోని షిర్డీ సాయిబాబా మందిరంలో ఆలయ ధర్మకర్తల పాలక మండలి సమ్మేళనం, మధ్యాహ్నం 2 గంటలకు ఆలయ అర్చకులు, పురోహితుల సమావేశం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో అర్చక పురోహితులకు జీతాలు సక్రమంగా అందడంలేదని, లక్షలాది ఎకరాల దేవుడి మాన్యాలు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

దేవాలయాల పరిరక్షణకు ధార్మిక పురోహిత చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్రిస్టియన్, ముస్లిం మైనారిటీ సంస్థలకు ఇస్తున్న ప్రాధాన్యం హిందూ సంస్థలకు ఇవ్వడం లేదని విమర్శించారు. సమావేశంలో ప్రాంత ధర్మాచార్య, సంపర్క ప్రముఖ్ నారాయణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement