నిరుద్యోగ భృతి వద్దు..

Unemployed Youth against to the Government Warangal - Sakshi

ఎన్నికల వేళ రాజకీయ పార్టీల హామీలు

ఖాళీలను భర్తీచేయాలంటున్న నిరుద్యోగులు

సాక్షి, వరంగల్‌: నీళ్లు, నిధులు, నియామకాల డిమాండ్‌తోనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ ఉద్యోగ నియామకాల హామీపై దృష్టి సారించాయి. నిరుగ్యోగుల ఓట్లకు గాలం వేసేందుకు ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీ ఇస్తున్నాయి. ఉద్యోగావకాశాలు కల్పించిన పార్టీలనే ఆదరిస్తామని నిరుద్యోగులు అంటున్నారు. దీనిపై నిరుద్యోగుల అభిప్రాయాలు.

ఉద్యోగ అవకాశాలు  కల్పించాలి
ములుగు: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చే పార్టీలకు వచ్చే ఎన్నికల్లో  అండగా ఉంటాం. నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక తాత్సారం చేయకుండా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయాలి. అలాంటి వారికే ఓటేస్తాం. నిరుద్యోగ భృతి కాకుండా తగిన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది. డిగ్రీ, ఆ పైన విద్యనభ్యసించి వేలాదిమంది అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు.  
–ఒజ్జల కుమారస్వామి యాదవ్‌

ఉద్యోగాలు లేనట్టే.. 
టేకుమట్ల: ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగ భృతితోనే సరిపెట్టుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి పనికి తగ్గ వేతనాన్ని కల్పిస్తే ప్రభుత్వ పథకాలపై ఆధారపడాల్సిన అవసరమే ఉండదు. నిరుద్యోగులు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  నిరుద్యోగులను ఆదుకునేందుకు రాష్ట్రంలో ఉన్న మొత్తం ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తే సరిపోతుంది.
–రాం సుమన్, బీటెక్, పంగిడిపల్లి, మొగుళ్లపల్లి

మేనిఫెస్టోలో ప్రకటించాలి
నిరుద్యోగ భృతికి సంబంధించిన అంశాలను రాజకీయ పార్టీలు ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టాలి. తప్పనిసరిగా అమలయ్యేలా చూడాలి. ఇది నిరుద్యోగులకు వెసులుబాటు కల్పించేదిగా ఉండాలి. 
–కల్లూరి పవన్‌ (కేయూ విద్యార్థి నాయకుడు)

బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి
నిరుద్యోగ యువతకు ఇచ్చే భృతిని ప్రతినెలా బ్యాంకు ఖాతాల్లో జమచేయాలి. నేరుగా ఇవ్వడం వల్ల అవినీతి జరిగే అవకాశాలు ఉన్నాయి. బ్యాంకుల్లో వేయడం వల్ల యువత తన అవసరాలకు డబ్బులను వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. 
పి.సురేష్‌ బాబు , కాజిపేట

నిరుద్యోగ భృతి అవసరమే
కాజీపేట: ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు దొరకక నిరుద్యోగులు బాధపడుతున్నారు. వారిని ఆదుకోవడానికి రాజకీయ పార్టీలు ముందుకు రావడం మంచి పరిణామం. నిరుద్యోగ యువతకు భృతి అవసరం. 
–దామెరుప్పుల సతీష్‌ (కేయూ విద్యార్ధి సంఘం)

ఎన్నికలకు ముందే అర్హతలు ప్రకటించాలి
ప్రభుత్వం నుంచి ఆశించిన నోటిఫికేషన్‌ రాకపోవడం నిరాశ కలిగించింది.  స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న రుణాలు కూడా ఎన్నికల కోడ్‌ వల్ల ఆగిపోయాయి. ఏ పార్టీ అయినా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం కాదు. ముందే పథకానికి సంబంధించిన అన్ని అర్హతలను స్పష్టంగా ప్రకటించాలి. నిరుద్యోగ భృతి ఇవ్వడం కంటే నోటిఫికేషన్‌ ఇవ్వడం మేలు.
–ఏల్పుకొండ ప్రవీణ్‌కుమార్, పత్తిపాక, మానుకోట 

ఉద్యోగాల కోసం ఉద్యమించాం..
తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఉద్యమించాం. కానీ పాలకులు విస్మరించారు. లబ్దికోసమే నిరుద్యోగ భృతిపేరుతో మరోమారు మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.నిరుద్యోగ భృతి ప్రకటిస్తే ఇక ఉద్యోగాలు లేనట్టే.  ఎన్నో కష్టాలను అనుభవించి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో చదివి ఉద్యోగావకాశాలు కల్పించమంటే నిరుద్యోగ భృతి అనడం దారుణం. 
సీహెచ్‌ నరేష్, డిగ్రీ విద్యార్థి మొగుళ్లపల్లి

భృతి అక్కర్లేదు  
టేకుమట్ల: రాష్ట్రంలో నిరుద్యోగులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోసం చేసేందుకే  నిరుద్యోగ భృతిని తెరపైకి తెస్తున్నారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని అప్పులు చేసి ఉన్నత చదువులు చదివింది నిరుద్యోగ భృతి కోసం కాదు. నిరుద్యోగ భృతి కావాలని ఎవరూ అడగలేదు. ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగులను ఆదుకోవాలి.  

–గడ్డం సుమ, ఎంఏ బీఈడీ టేకుమట్ల

ఓట్ల కోసమే..
స్టేషన్‌ఘన్‌పూర్‌: కేవలం ఎన్నికల్లో ఓట్లు పొందడానికే నిరుద్యోగ భృతి ఆశ చూపుతున్నాయి. నిరుద్యోగ భృతి కన్నా ఉపాధి కల్పించే దిశగా కృషి చేయాలి. గత ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం, నీళ్లు, నిధులు, నియామకాలతో టీఆర్‌ఎస్‌ నిరుద్యోగులను మోసం చేసింది. కనీసం ఒక్క డీఎస్సీ కూడా వేయలేదు.
–వేళ్ల సురేందర్, నిరుద్యోగి

నిరుద్యోగ భృతి వద్దు.. 
ఏటూరునాగారం:  నిరుద్యోగ భృతి వద్దు..ఉద్యోగమే ముద్దు. ఈ రోజుల్లో చదువుకొని ఉద్యోగం చేసేవాళ్లు ఉన్నారు గానీ నిరుద్యోగ భృతి తీసుకొని మరింత సోమరితనంగా మారే పరిస్థితిలో యువత లేదనే విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాలి.  అర్హులకు ఉద్యోగం కల్పిస్తే బాగుంటుంది. 
–వెల్దండి రచన, ఏటూరునాగారం, నిరుద్యోగిని

నోటిఫికేషన్లు వేయాలి
పాలకుర్తిటౌన్‌: పలు పార్టీలు మ్యానిఫెస్టోలో నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామని ప్రకటిస్తున్నాయి. నోటిఫికేషన్లు వేయకుండా నిరుద్యోగభృతి ఇచ్చి ఏం లాభం. ఉపాధి కోసమే  నిరుద్యోగులు, విద్యార్థులు పోరాటాలు చేశారు. నిరుద్యోగ భృతితో యువతకు లాభం లేదు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు వారి మ్యానిఫెస్టోలో  ఉద్యోగాలపై స్పష్టమైన ప్రకటన చేయాలి.
–కోతి సుధాకర్, నిరుద్యోగి, మల్లంపల్లి, పాలకుర్తి మండలం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top