జల దోపిడీల

Underground Water Levels Decreased In Telangana - Sakshi

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఓవైపు భూగర్భ జలాలు అడుగంటిపోతుండగా మరోవైపు కొద్దోగొప్పో బోరుబావుల నుంచి వస్తున్న నీటితో అక్రమార్కులు నీటి వ్యాపారం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఉచిత కరెంట్‌ను దుర్వినియోగం చేస్తూ.. వ్యవసాయ బావుల నుంచి అడ్డగోలుగా నీటిని తోడేస్తూ యథేచ్ఛగా జలదోపిడీకి పాల్పడుతున్నారు. ట్యాంకర్లలో పారిశ్రామిక ప్రాంతాలకు తరలిస్తూ లక్షలాది రూపాయలు గడిస్తున్నారు. వీరి వ్యాపారం మూడు ట్యాంకర్లు.. ఆరు పరిశ్రమలు అన్న చందంగా జోరుగా సాగుతోంది. 

తూప్రాన్‌: తూప్రాన్‌ డివిజన్‌ కేంద్రం హైదరాబాద్‌ నగరానికి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేషనల్‌హైవే, రైల్వే స్టేషన్ల లాంటి చక్కటి రవాణా సౌకర్యంతోపాటు ఈ ప్రాంతం అనేక పరిశ్రమలకు నెలవైంది. డివిజన్‌ పరిధిలోని కాళ్లకల్, ముప్పిరెడ్డిపల్లి, కూచారం, జీడిపల్లి తదితర ప్రాంతాలు పారిశ్రామిక ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంతో ఆయా గ్రామాల్లో ఇబ్బడి ముబ్బడిగా పరిశ్రమలు  వెలిశాయి. వీటిలో రసాయనిక,  విత్తన, ఐరన్, లిక్కర్‌ తదితర    పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమలే ఆసరాగా అనేక పారిశ్రామికవాడలు నెలకొన్నాయి. వేలాది కుటుంబాలు ఉపాధి పొందుతున్న ఈ పరిశ్రమల్లోని కార్మిక కుటుంబాల అవసరాలను  ఆసరా చేసుకొని అక్రమ వ్యాపారులు నీటి వ్యాపారానికి తెరలేపారు.

బోరుబావులను లీజుకు తీసుకొని..
వ్యాపారులు రైతుల వ్యవసాయ పొలాల్లోని బోరుబావులను లీజుకు తీసుకొని వాటి నుంచి ట్యాంకర్ల ద్వారా రేయింబవళ్లు నీటిని పరిశ్రమలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో సుమారు 40కిపైగా ట్యాంకర్లు, 10 లారీలు, 15 మినరల్‌ వాటార్‌ ప్లాంట్లు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఒక్కో ట్యాంకర్‌ రోజుకు 10 నుంచి 15 ట్రిప్పుల వరకు తిరుగుతుంది. ట్రాక్టర్‌ ట్యాంకర్లకు రైతుకు కేవలం రూ.200 చెల్లించి పరిశ్రమలకు రూ.500 నుంచి అవసరాలకు అనుగుణంగా రూ.800 వరకు విక్రయిస్తూ లక్షలు గడిస్తున్నారు. 24 గంటల ఉచిత కరెంట్‌ పుణ్యమా అని వ్యాపారుల పంట పండింది. ఇదంతా రెవెన్యూ, విద్యుత్‌ అధికారుల కనుసన్నల్లో సాగుతోందన్న విమర్శలు ఉన్నాయి. విద్యుత్‌ లైన్‌మన్, లైన్‌ ఇన్‌స్పెక్టర్లకు ఒక్కో ట్రాక్టర్‌ ట్యాంకర్‌కు నెలకు రూ.వెయ్యి చొప్పున ట్యాంకర్ల యజమానులు ముట్టజెప్తున్నట్లు సమాచారం.

మినరల్‌ పేరుతో దోపిడీ..
ఉమ్మడి మండలంలోని గ్రామాల్లో 40 వరకు కొనసాగుతున్న మినరల్‌ వాటర్‌ ప్లాంట్ల యజమానులు మినరల్‌ పేరుతో రసాయనాలు కలుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఏ ఓక్క ప్లాంటుకు ఐఎస్‌ఐ లేదు. ప్రతీ నెల అధికారులు మామూళ్లు తీసుకొని చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ గోదావరి జలాలను అందిస్తున్నా గ్రామాల్లో మినరల్‌ వాటర్‌ప్లాంట్ల హవా కొనసాగుతోంది. 20 లీటర్ల క్యాన్‌కు రూ.15 నుంచి రూ.30 వరకు వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క ప్లాంటును సీజ్‌ చేసిన దాఖలాలు లేకపోవడం గమనార్హం.
 
అడుగంటుతున్న భూగర్భ జలాలు..
తూప్రాన్‌ డివిజన్‌ పరిధిలోని మనోహరాబాద్‌ మండలంలో పరిశ్రమలు వెలుస్తుండడంతో ఈ ప్రాంతంలో భూగర్భజలాలు అడుగంటాయి. ప్రస్తుత వేసవి తీవ్రత కారణంగా నీటిమట్టం రోజురోజుకూ పడిపోతోంది. బోరుబావుల్లో కొద్దిపాటి నీటితో పంటలు పండించి నష్టాలపాలయ్యే బదులు నీటిని అమ్ముకుని లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామాల్లో 700 అడుగుల లోతు బోరుబావులు తవ్వించినా చుక్కనీరు లభించని పరిస్థితి నెలకొంది. అయినా రైతులు భగీరథ ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. అప్పు తెచ్చి బోరుబావులు తవ్వుతున్నారు. మండలంలోని 22 గ్రామ పంచాయతీల్లో 8 వేలకు పైగా బోరుబావులున్నాయి. వీటిలో 1,300 పైగా మాత్రమే కాస్త నీళ్లు పోస్తున్నాయి. దీంతో పరిశ్రమ నిర్వాహకుల నీటి అవసరాలను గుర్తించిన అక్రమ వ్యాపారులు ట్యాంకర్ల ద్వారా నీటిని తరలిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి  జలదోపిడీకి అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. 

చట్టపరమైన చర్యలు తీసుకుంటాం
చట్టవ్యతిరేకంగా నీటిని అక్రమంగా ట్యాంకర్ల ద్వారా తరలించి విక్రయించినట్‌లైతే కేసులు నమోదు చేస్తాం. వ్యవసాయ రంగానికి వినియోగించాల్సిన బోరుబావులను వ్యాపారంగా మార్చడం చట్టరీత్యానేరం. భూగర్భ జలాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. – శ్యాంప్రకాశ్, ఆర్డీఓ, తూప్రాన్‌

దుర్వినియోగం చేయొద్దు 
వ్యవసాయ బోరుబావుల నుంచి ఉచిత కరెంట్‌ ద్వారా ట్యాంకర్లలో నీటిని వ్యాపారానికి వినియోగిస్తే విద్యుత్‌ కనెక్షన్లు తొలగిస్తాం. వ్యాపార రంగానికి కమర్షియల్‌ మీటర్లను తప్పనిసరిగా వినియోగించాలి. ఇలా వినియోగించని వారిని గుర్తించి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. – వీరారెడ్డి, ట్రాన్స్‌కో ఏడీఈ, తూప్రాన్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top