అడ్డాకూలీలుగా టీఎస్‌ఎస్‌పీ అభ్యర్థులు

TSSP Candidates Becoming Adda Coolies In Telangana - Sakshi

శిక్షణకు ఎంపికైనా 9 నెలలుగా అందని పిలుపు

ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఎదురుచూపులు

సివిల్, ఏఆర్‌ కానిస్టేబుళ్ల శిక్షణ ముగిసేదాకా అవకాశం లేనట్టే!

సూర్యాపేట జిల్లా నూతన్‌కల్‌ మండలం తాళ్లసింగారానికి చెందిన జటంగి వెంకన్న (27) పంతంగి నరేశ్‌ (22) ఇటీవల టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. పనిమీద బైకుపై వెళ్తుండగా.. కారు ఢీకొట్టడంతో ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు. టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్‌గా ఎంపికైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి.. శిక్షణ కోసం ఎంతకీ పిలుపు రాకపోవడంతో జీవనోపాధి కోసం కూలీగా మారాడు.

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ స్పెషల్‌ పోలీస్‌ (టీఎస్‌ఎస్‌పీ) కానిస్టేబుళ్లుగా ఎన్నికైన పలువురు అభ్యర్థుల పరిస్థితి దయనీయంగా మారింది. వేలాదిమంది తాము చేస్తోన్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు రాజీనామాచేసి శిక్షణ కోసం తొమ్మిది నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఎంతకీ పిలుపు రాక.. ఆర్థిక ఇబ్బందులు పెరిగి, పలువురు అడ్డాకూలీలుగా మారుతున్నారు. ఇంకొందరు వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. వీరిలో ఇద్దరు కానిస్టేబుల్‌ అభ్యర్థులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. మరి కొందరు అభ్యర్థులు గాయాలు, అనారోగ్యాల బారినపడి శిక్షణకు పనికిరాకుండా మారా రు. అధికారులు సివిల్, ఏఆర్‌ కానిస్టేబుళ్లతోపాటు టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుళ్లకూ శిక్షణ ప్రారం భించి ఉంటే అంతా సురక్షితంగా ఉండేవారని అభ్యర్థులు, వారి కుటుంబసభ్యులు వాపోతున్నారు.

వ్యవసాయ, అడ్డా కూలీలుగా..
రాష్ట్రవ్యాప్తంగా 17వేలకుపైగా సివిల్, ఏఆర్, టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్‌ పోస్టులకు రాతపరీక్షల అనంతరం 2019 సెప్టెంబరు 24న ఫలితాలు విడుదలయ్యాయి. ఎంపికైనవారిలో దాదాపు 4,200 మంది అభ్యర్థులు టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్‌ అభ్యర్థులు. ఈ ఏడాది జనవరి 17న దాదాపు 12వేల మంది సివిల్, ఏఆర్‌ అభ్యర్థులకు కానిస్టేబుల్‌ శిక్షణ మొదలైంది. వీరికి మొదటి సెమిస్టర్‌ పూర్తయి, రెండో సెమిస్టర్‌ పాఠాలూ నడుస్తున్నాయి. కానీ, టీఎస్‌ఎస్‌పీ అభ్యర్థులకు 6నెలలుగా ఎలాంటి పిలుపూలేదు.

అక్టోబరు 12 తరువాతే అవకాశం?
రాతపరీక్షల్లో ఎంపికైన మొత్తం 17వేల మంది అభ్యర్థులుకు ఏకకాలంలో శిక్షణ ప్రారంభించాలని పోలీసుశాఖ భావించింది. వీరిలో 12వేల మంది సివిల్, ఏఆర్‌ కానిస్టేబుళ్లకు రాష్ట్రంలో, మిగిలిన 4,200 మంది టీఎస్‌ఎస్‌పీ పీసీ కేడెట్లకు ఆంధ్రపదేశ్‌లో శిక్షణ ఇద్దామనుకున్నారు. సాంకేతిక కారణాలతో వీరిని ఏపీకి పంపడం కుదరలేదు. దీంతో కర్ణాటక, మధ్యప్రదేశ్‌కు పంపే ప్రయత్నాలు మొదలుపెట్టగానే.. కరోనా కలకలం రేగింది. ఇప్పుడు జూన్‌ కూడా గడిచిపోతోంది. మరోవైపు సివిల్, ఏఆర్‌ కానిస్టేబుళ్లుకు మొదటి సెమిస్టర్‌ పూర్తయింది. అక్టోబరు తొలి వారంలో వీరి శిక్షణ పూర్తయి పాసిం గ్‌ ఔట్‌ పరేడ్‌ జరగనుంది. ఆ తరువాత టీఎస్‌ఎస్‌పీ అభ్యర్థులకు శిక్షణ మొదలు కానుందని సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top