బంద్‌ ప్రకటనపై గవర్నర్‌ను కలవనున్న ఆర్టీసీ జేఏసీ

TSRTC Strike High Court Hearing The Petition Today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై దాఖలైన హౌస్‌ మోషన్ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరగనుంది. సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం కౌంటర్‌ దాఖలు చేయాలంటూ గత విచారణలో కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బస్సుల బంద్‌ ప్రభావంపై అన్ని డిపోల మేనేజర్లు ఇచ్చిన రిపోర్ట్‌ను ప్రభుత్వం నేడు కోర్టుకు సమర్పించి, పిటిషన్‌ దాఖలు చేయనుంది. సమ్మె చట్టబద్ధం కాదని అటు ప్రభుత్వం.. తమ డిమాండ్ల సాధనకే సమ్మె అంటూ ఇటు కార్మికులు వాదిస్తున్న నేపథ్యంలో న్యాయస్థానం ఇచ్చే తీర్పు కీలకంగా మారనుంది. సమ్మె నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 3గంటలకు ఆర్టీసీ జేఏసీ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. అనంతరం తెలంగాణ బంద్‌ ప్రకటనపై గవర్నర్‌ను కలవనుంది.

ఆరో రోజుకు చేరిన సమ్మె..
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆరో రోజుకు చేరుకుంది. నేడు రాజకీయ పక్షాలతో  కలిసి ఆర్టీసీ కార్మికులు డిపోల ముందు ధర్నాలు నిర్వహిస్తున్నారు. సమ్మె విషయంలో ఇటు ఆర్టీసీ కార్మికులు, అటు ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోవడం లేదు. సమ్మె ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ రోజువారీ కండక్టర్లు, డ్రైవర్లతో బస్సులు నడుపుతుంది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా దాదాపు 5 వేల బస్సులును నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఇదిలా ఉండగా సమ్మె నేపథ్యంలో అద్దె బస్సుల్లో బస్సు పాసులను అనుమతించడం లేదు. ఫలితంగా ప్రైవేటు వాహనదారులు ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. ఆర్టీసీ బస్సుల్లో కూడా అధిక చార్జీలు వసూలు చేస్తూ.. ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా చర్యలు తప్పవంటూ ప్రభుత్వం హెచ్చరించినప్పటికి దోపిడీ మాత్రం ఆగడం లేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top