అగ్నిమాపక శాఖలో 325 పోస్టులకు గ్రీన్‌సిగ్నల్‌

TSPSC Released Notification For 325 Posts - Sakshi

ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థికశాఖ

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర అగ్నిమాపకశాఖలో ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న తరుణంలో వాటికి సంబంధించిన పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పోస్టుల మంజూరుకు అనుమతినిస్తూ ఆర్థికశాఖ జీవో విడుదల చేసింది. అగ్నిమాపకశాఖలో స్టేషన్‌ ఆఫీసర్, ఫైర్‌మెన్, డ్రైవింగ్‌ ఆపరేటర్లు, టైపిస్టులు, జూనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ స్టెనోలు మొత్తం కలిపి 325 పోస్టులు భర్తీ చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శివశంకర్‌ సోమవారం విడుదల చేసిన జీవోలో పేర్కొన్నారు. ఆపరేషన్స్‌ విభాగం కింద ఉన్న పోస్టులను రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు, పరిపాలనా వ్యవహారాల్లో ఉన్న పోస్టులను రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

వాటితో కలిపే నోటిఫికేషనా? 
రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా త్వరలో 22 వేల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. అయితే అదే నోటిఫికేషన్‌తోపాటు అగ్నిమాపకశాఖలోని ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇస్తారా లేక ఆ నియామక ప్రక్రియ పూర్తయ్యాక విడిగా నోటిఫికేషన్‌ చేస్తారా అనే అంశంపై నియామక ఏజెన్సీలు స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం పోలీస్‌ నోటిఫికేషన్‌ వ్యవహారాల్లో రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిమగ్నమై ఉండగా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పలు పరీక్షల నిర్వహణలో తలమునకలై ఉంది. అయితే టైపిస్టు, జూనియర్‌ అసిస్టెంట్, జూనియర్‌ స్టెనో పోస్టులు మొత్తం ఏడే ఉండటంతో త్వరలోనే ఆ నియామక ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వర్గాల ద్వారా తెలిసింది.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top