చర్చలపై సర్కారు తర్జనభర్జన

TS RTC Strike: CM KCR Talks With Officials Over High Court Comments - Sakshi

ఆర్టీసీ సమ్మె, రవాణాపై సీఎం సుదీర్ఘ సమీక్ష

హైకోర్టు వ్యాఖ్యలపై సమాలోచనలు

చర్చల కోసం మంత్రుల కమిటీ ఏర్పాటుకు మొగ్గు 

ఎండీ నియామకంపైనా చర్చ 

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ జేఏసీతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుని, కార్మికులు సమ్మె విరమించేలా చేయాలన్న హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో చర్చల పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. చర్చల ప్రసక్తే లేదని సీఎం కరాఖండిగా చెప్పడం, ఆ తర్వాత చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని హైకోర్టు సూచించడంతో ఏం చేయాలన్న దానిపై సీఎం కేసీఆర్‌ బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు 4 గంటలకు పైగా చర్చించారు. ఆర్టీసీ నేతలతో ఇప్పటికే ముగ్గురు అధికారులతో కూడిన బృందం తొలి దఫా చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణపై సమావేశంలో చర్చించారు. ప్రధానంగా ఆర్టీసీ కార్మిక జేఏసీ, రాష్ట్ర ప్రభు త్వం చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో చర్చల పునరుద్ధరణపై సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. చర్చలు జరపాల్సి వస్తే తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఆర్టీసీ ఎండీ పోస్టును సైతం తక్షణమే భర్తీ చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అందుకోసం సమర్థులైన అధికారిని నియమించేందుకు సమావేశంలో కసరత్తు చేశారు.

సీనియర్‌ ఐపీఎస్‌లైన అకున్‌ సబర్వాల్, స్టీఫెన్‌ రవీంద్ర, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, శివధర్‌రెడ్డి పేర్లను ఆ పోస్టు కోసం పరిశీలించినట్లు సమాచారం. శుక్రవారం కొత్త ఎండీ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. కొత్త ఎండీ ఆధ్వర్యంలో చర్చలు జరపాలా.. లేదా మంత్రుల కమిటీ ఏర్పాటు చేసి చర్చలు నిర్వహించాలా అన్న దానిపై చర్చ జరిగింది. అయితే చివరికి మంత్రుల కమిటీకే ప్రభుత్వం మొగ్గి చూపినట్లు తెలిసింది. హైకోర్టు ఆదేశిస్తే చర్చలకు సంసిద్ధత వ్యక్తం చేయాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. సమ్మె నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో రవాణా పరిస్థితిని సీఎం సమీక్షించారు. బస్సులను నూటికి నూరు శాతం తిప్పేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. సమావేశానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ తదితరులు హాజరయ్యారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top