గులాబీ గెలుపే లక్ష్యంగా

TRS Party Target Is To Clean Sweep - Sakshi

ఉమ్మడి జిల్లా గెలుపు బాధ్యతలు మహేందర్‌రెడ్డిపైనే 

హరీశ్‌రావు వెంట కొడంగల్‌లో పోరుబాట

తాండూరును అభివృద్ధి పథంలో నడిపిస్తున్న గులాబీ నేత 

మరోసారి అవకాశం ఇవ్వాలంటూ ప్రజల్లోకి 

జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మంత్రి మహేందర్‌రెడ్డి.. 6వ సారి గెలుపే లక్ష్యంగా తాండూరులో ప్రచారం చేస్తున్నారు. 24 ఏళ్లుగా నిత్యం ప్రజల మధ్యే ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్నారు. పదవులు, కుర్చీలు శాశ్వతం కాదని, పేరు, ప్రఖ్యాతలే శాశ్వతమనే సిద్ధాంతాన్ని నమ్మి.. కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి చేరువయ్యారు. నియోజవర్గంలోని ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు ఈయనకు బ్రహ్మరథం పడుతున్నారు.   

సాక్షి, తాండూరు: మూడు దశాబ్దాల పాటు మహరాజుల కంచుకోటగా ఉన్న తాండూరులో 1994 నుంచి పట్నం మహేందర్‌రెడ్డి పాగా వేశారు. అంతకు ముందు రాష్ట్ర రాజకీయాలను తమ గుప్పిట్లో పెట్టుకున్న మహరాజుల రాజధానిఈ నియోజకవర్గం. కొమ్ములు తిరిగిన నేతలు సైతం ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు సాహసించలేదు. తొలిసారిగా ఓ 27 ఏళ్ల యువకుడు టీడీపీ తరఫున తాండూరులో బరిలో నిలిచారు.

అనూహ్య రీతిలో మహరాజులను ఓడించి విజయ దుందుబి మోగించారు. ఆనాటి నుంచి ఈ రోజు వరకు తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆహర్నిశలు కృషి చేశారు. 1999లో జరిగిన ఎన్నికల్లోనూ రెండోసారి గెలుపొందారు. 2004లో మహానేత వైఎస్సార్‌ అనుకూల పవనాలు వీయడంతో ఓటమి పాలయ్యారు. అయినా 5 ఏళ్ల పాటు తాండూరు ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చారు. 2009లో తిరిగి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి మరోసారి విజయం సాధించారు. సీఎం కేసీఆర్‌ కేబినెట్‌లో రవాణాశాఖ మంత్రిగా సేవలందించారు. కోట్లాది రూపాయల నిధులు తీసుకువచ్చి తాండూరును అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ప్రత్యర్థి ఎవరైనా మహేందర్‌రెడ్డి జనాదరణ ముందు తలవంచాల్సిందేననేలా దూసుకుపోతున్నారు.    

ఉమ్మడి జిల్లా బాధ్యతలు.. 
తాండూరులో నిర్విరామంగా ఎన్నికల ప్రచారం చేస్తున్న ఆపద్ధర్మ మంత్రి మహేందర్‌రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను తన భుజస్కందాలపై వేసుకున్నారు.
కొడంగల్‌ నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డిని ఓడించేందుకు మంత్రి హరీశ్‌రావు నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపుకోసం మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేసుకున్నారు. ఈసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అన్ని స్థానాల్లోనూ గులాబీ జెండా ఎగురవేసి సీఎం కేసీఆర్‌కు కానుక ఇస్తామని ధీమా వ్యక్తంచేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top