ఆర్‌ఐపై టీఆర్‌ఎస్ కార్యకర్తల దాడి


పాల్వంచ, న్యూస్‌లైన్:  ఎన్నికల విధుల్లో ఉన్న రెవెన్యూ అధికారిపై పాల్వంచలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు దాడి చేశారు. కొత్తగూడెం నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావ్ ప్రచార కార్యక్రమం ఆదివార ం మధ్యాహ్నం పాల్వంచలోని ఇందిరా కాలనీలో ఏర్పాటైంది. దీనికి ముందస్తుగా ఆ పార్టీ కార్యకర్తలను స్థానిక నాయకుడు, న్యాయవాది గంగాధర్ సమాయత్తపరుస్తున్నారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎన్నికల నియామవళిని అతిక్రమించి, ఇందిరా కాలనీలో పార్టీ జెండాలు కడుతున్నారని తహశీల్దార్ సమ్మిరెడ్డికి సమాచారమందింది.



ఆయన ఆదేశాలతో వీడియో సర్వేలైన్ టీం అధికారి, ఆర్‌ఐ ప్రసాద్ బాబ్జి, వీఆర్వో రాములు అక్కడి చేరుకుని, టీఆర్‌ఎస్ ప్రచార సరళిని వీడియోలో చిత్రీకరిస్తున్నారు. అదే సమయంలో అటుగా గంగాధ ర్ కారు వచ్చింది. అందులో పార్టీ జెండాలు ఉన్నాయన్న సమాచారంతో తనిఖీ చేసేందుకు దానిని ఆర్‌ఐ ఆపబోయారు. కారు ఆగకుండా వెళ్లడంతో ఆయన వెంబడించి నిలిపేశారు. కారులోంచి గంగాధర్, కొందరు కార్యకర్తలు దిగి ఆర్‌ఐపై దాడి చేసి దుర్భాషలాడారు. ‘ఓ పార్టీకి కోవర్టులుగా పనిచేస్తున్నారు’ అని ఆరోపించారు. దీనిపై ఆర్డీవో సత్యనారాయణకు, తహశీల్దార్ సమ్మిరెడ్డికి, పోలీసులకు ఆర్‌ఐ ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ ఆనంద్ వెంటనే అక్కడికి చేరుకుని గంగాధర్‌ను జీప్‌లో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జీపుకు అడ్డుపడిన టీఆర్‌ఎస్ కార్యకర్తలను పోలీసులు పక్కకు లాగేశారు. ఇంతలో అక్కడికి చేరుకున్న టీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్రావ్‌కు కార్యకర్తలు విషయం తెలిపారు. అధికారులతో మాట్లాడతానని చెప్పి ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్లారు.



 పోలీసులకు ఆర్‌ఐ ఫిర్యాదు

 ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న తనపై దాడి చేసి దుర్భాషలాడారని, విధులను అడ్డుకున్నారని పాల్వంచ పోలీసులకు ఆర్‌ఐ ప్రసాద్ బాబ్జి ఆదివారం ఫిర్యాదు చేశారు. దీనిపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కొత్తగూడెం ఆర్డీవో అమయ్‌కుమార్‌కు, డీఎస్‌పీకి కూడా ఫిర్యాదు చేయనున్నట్టు ఆర్‌ఐ బాబ్జి చెప్పారు.



 నాన్ బెయిలబుల్ కేసు నమోదు..

 ఆర్‌ఐ బాబ్జీ ఫిర్యాదు మేరకు గంగాధర్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ షణ్ముఖాచారి తెలిపారు. మరో 20 మందిపై కూడా కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top