‘అడ్డు’పడ్డారో బుక్కయ్యారే!

Traffic Police Collapsed Footpath Shops In Hyderabad - Sakshi

ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై ఉక్కుపాదం

చిరు వ్యాపారులకుఅద్దెకిస్తున్న యజమానులు

అలాంటి వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు

సైబరాబాద్‌లో ఆక్రమణల తొలగింపు షురూ

సాక్షి,సిటీబ్యూరో: నగరంలో పాదచారులకు ఉద్దేశించిన ఫుట్‌పాత్‌లపై నడవాలంటే చాలా కష్టం. ఎందుకంటే అసలు ఫుట్‌పాత్‌లనేవి ఉండాలి కదా! గ్రేటర్‌లో ప్రధాన రోడ్ల వెంబడి ఉన్న కాలిబాటలను వ్యాపారులు, దుకాణదారులు ఆక్రమించుకున్నారు. మరికొందరు తమ ఆస్తి అన్నట్టు చిరు వ్యాపారులకు అద్దెకు కూడా ఇచ్చేస్తున్నారు. ఇలాంటి వారికి చెక్‌ పెట్టేందుకు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు సిద్ధమయ్యారు. పాదచారులతో పాటు వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించేలా ఫుట్‌పాత్‌లను వీధి వ్యాపారాలకు అద్దెకిస్తూ అక్రమార్జన పొందుతున్న వాణిజ్య సముదాయాల యజమానులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు. ప్రధాన రహదారి వెంట ఉన్న వాణిజ్య సముదాయాల ముందున్న ప్రభుత్వ భూమిని, ఫుట్‌పాత్‌ను హాకర్లకు కిరాయికి ఇస్తుండడంటో చాలా ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతోంది. ఐటీ కారిడార్‌లో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంది.

దీంతోఇక్కడ ప్రయాణికులు నడిచే దారిలేక నిత్యం నరకం చూస్తున్నారు. ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై నిత్యం సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులకు ఫిర్యాదులు వస్తుండడంతో చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి గచ్చిబౌలిలోని ఇందిరానగర్‌లో ఫుట్‌పాత్‌లు, రోడ్ల ఆక్రమణలను జేసీబీ యంత్రాలతో శని,ఆదివారాల్లో కూల్చివేశారు. రోజూ అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో భద్రతా చర్యల్లో భాగంగా ఈ కూల్చివేతలు చేపట్టామని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. గచ్చిబౌలి జంక్షన్‌ నుంచి ఐఐటీ కూడలి వరకు ఫుట్‌పాత్‌ల అక్రమణతో రోజూ కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. దీంతోపాటు వాహన ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి. అందుకే ఆక్రమణలను తొలగిస్తున్నామని చెప్పారు. ఇందిరానగర్‌లో చాలా మంది వాణిజ్య సముదాయాల యజమానులు తమ భవనం ముందున్న ఉన్న ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలాన్ని వీధి వ్యాపారులకు అద్దెకు ఇస్తున్నారని, దీంతో ఆక్రమణలు మితిమీరాయని గుర్తించామన్నారు. ఇలాంటి వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఇతర ప్రాంతాల్లోనూ చర్యలు
సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో ఏ ప్రాంతంలోనైనా రహదారులు, ఫుట్‌పాత్‌లు అక్రమిస్తే ట్రాఫిక్‌ పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. తమ దృష్టికి వచ్చిన వాటితో పాటు స్థానికులు, వాహనచోదకుల నుంచి అందే ఫిర్యాదులతో ఆయా ప్రాంతాల్లో కూల్చివేతలు చేపడతామన్నారు. వాహనదారులతో పాటు పాదచారుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా రహదారుల వెంట వీధి వ్యాపారాలు చేసే వారు పద్ధతి మార్చుకోవాలని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ సూచించారు. ఐటీ ప్రాంతంలోనే ఎక్కువగా ట్రాఫిక్‌ సమస్య ఉండడంతో తొలుత ఈ ప్రాంతంపై దృష్టి పెట్టామన్నారు. శంషాబాద్, బాలానగర్‌ జోన్లలోనూ సాఫీ ట్రాపిక్‌కు పక్కా వ్యూహంతో ముందుకెళుతున్నామని వివరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top