ఇష్టారాజ్యంగా కెమికల్‌ వ్యర్థాలను వదులుతున్న పరిశ్రమలు | Toxic Chemicals Generated By Industries Released Into Canals In Narsapur | Sakshi
Sakshi News home page

ఇష్టారాజ్యంగా కెమికల్‌ వ్యర్థాలను వదులుతున్న పరిశ్రమలు

Aug 30 2019 10:29 AM | Updated on Aug 30 2019 11:43 AM

Toxic Chemicals Generated By Industries Released Into Canals In Narsapur - Sakshi

ఓ పరిశ్రమలో నిల్వ ఉన్న వ్యర్థ జలాలు, కాలువ గుండా చెరువులోకి వస్తున్న వ్యర్థాలను చూపుతున్న రైతులు

సాక్షి, నర్సాపూర్‌: నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమలు కాలుష్య జలాలను ఇష్టారాజ్యంగా వదులుతుండటంతో రైతులు తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యర్థాలను వ దులుతున్న కెమికల్‌ పరిశ్రమలపై చర్యలు తీసుకోవాల్సిన పీసీబీ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మండలంలోని నవాబుపేట గ్రామ శివారులో పలు కెమికల్‌ పరిశ్రమలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం అందులోని వ్యర్థ రసాయనాలను ట్యాంకర్ల ద్వారా డంపింగ్‌ కేంద్రానికి తరలించాల్సి ఉండగా అలా కాకుండా బహిరంగంగా కాలువల ద్వారా బయటకు వదిలేస్తున్నారు. డంపింగ్‌ కేంద్రాలకు వ్యర్థాలను తరలిస్తే భారీ ఖర్చు అవుతుందనే ఉద్ధేశంతో పరిశ్రమ ఆవరణ నుంచే బయటకు వదిలేస్తున్నారు.

వ్యర్థాలు పారిన ప్రదేశంలో పచ్చని గడ్డితో పాటు భూగర్భజలాలు సైతం కలుషితమవుతున్నాయి. దీంతో సమీప పంటలు దెబ్బతింటున్నాయి. కాలువ ద్వారా వస్తున్న కెమికల్‌ నీటిని తాగి మూగజీవాలు సైతం మృత్యువాత పడిన సంఘటన లు ఉన్నాయి. వర్షాకాలంలోనైతే నేరుగా కాలువల ద్వారా గ్రామ చెరువులోకి చేరుతున్నాయి. వ్యర్థాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలుమార్లు పరిశ్రమ యాజమాన్యానికి చెప్పిన పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. బిజ్లిపూర్‌ గ్రామ శివారులో ఉన్న పరిశ్రమ వ్యర్థాలను ఇష్టారాజ్యంగా బయటకు వదులుతుండడంతో పలువురు రైతులు పంటలు వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది.

ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం..
నవాబుపేటలోని పలు కెమికల్‌ పరిశ్రమలు వదులుతున్న వ్యర్థ రసాయనాలతో పంటలు పాడైపోతున్న విషయం గురించి గతంలో రైతులు పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడికి వచ్చిన అధికారులు వ్యర్థ రసాయనాల శాంపిల్స్‌ను సేకరించి చేతులు దులుపుకున్నారు. సంబంధిత పరిశ్రమలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు. 

పంటలు పాడైపోతున్నాయి..
గ్రామ శివారులో ఉన్న పరిశ్రమలోని వ్యర్థాలను బయటకు వదులుతుండడంతో పంటలు పాడైపోతున్నాయి. దీంతో పాటు బోరుబావుల నీరు సైతం కలుషితమయ్యాయి. పలుమార్లు కంపెనీ యాజమాన్యానికి చెప్పిన పట్టించుకోవడం లేదు. కాలువ ద్వారా వస్తున్న వ్యర్థ రసాయనాల నీరు తాగి మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. 
– మహిపాల్‌రెడ్డి, రైతు నవాబుపేట

చర్యలు తీసుకుంటాం..
నిబంధనలకు విరుద్ధంగా వ్యర్థాలను వదులుతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకుంటాం. రైతుల ఫిర్యాదు మేరకు నవాబుపేట గ్రామ పరిధిలో వస్తున్న కెమికల్‌ వ్యర్థాల నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించాం. గతంలో ఫిర్యాదులు అందడంతో సంబంధిత పరిశ్రమలకు నోటీసులు జారీ చేశాం. 
 – రవీందర్, పీసీబీ ఈఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement