అభివృద్ధి పనుల ప్రతిపాదనలు సిద్ధం | To prepare proposals for the development works | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనుల ప్రతిపాదనలు సిద్ధం

Jun 15 2014 2:55 AM | Updated on Jun 2 2018 8:29 PM

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు(బీఆర్‌జీఎఫ్) ఏయే అభివృద్ధి పనులకు ఖర్చు చేయాలనేది గ్రామాల్లో సర్పంచులు నిర్ణయిస్తున్నారు.

కలెక్టరేట్ : వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు(బీఆర్‌జీఎఫ్) ఏయే అభివృద్ధి పనులకు ఖర్చు చేయాలనేది గ్రామాల్లో సర్పంచులు నిర్ణయిస్తున్నారు. పంచాయతీ కార్యాలయాల్లో పనుల ప్రతిపాదనలపై ప్రజల సమక్షంలో తీర్మానం చేసి జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో పది రోజులుగా గ్రామసభలు కొనసాగుతున్నాయి. పంచాయతీకి కేటాయించిన బీఆర్‌జీ నిధులు ఎన్ని, వాటితో ఎన్ని పనులు అవుతాయని లెక్కేస్తున్నారు.
 
గ్రామాల్లో సర్పంచులు ఉన్నప్పటికీ మండల స్థాయిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టలేదు. దీంతో మండల స్థాయిలో పనుల ఆమోదానికి కొంత సమయం పడుతుంది. కాగా, పనుల ప్రతిపాదనలు ఈ నెల 25లోగా పంపించాలని ప్రభుత్వం ఆదేశించింది. మండలాల్లో ప్రజాప్రతినిధులు కొలువుదీరకపోవడం, జెడ్పీ చైర్మన్ ఎన్నికల నోటిఫికేషన్ తదితర పరిణామాల నేపథ్యంలో గడువు పెంచే అవకాశాలు ఉన్నాయి.
 
ప్రతిపాదనలు ఇలా..
జిల్లాకు కేటాయించిన బీఆర్‌జీఎఫ్ బడ్జెట్‌లో పంచాయతీలకు 50శాతం నిధులు కేటాయిస్తారు. వీటిని అభివృ ద్ధి పనులకు వినియోగించాల్సి ఉంటుంది. గ్రామాల్లో  స ర్పంచు, ఈవోపీఆర్డీ, పంచాయతీ కార్యదర్శులు ప్రజల సమక్షంలో సభ నిర్వహించి పనుల ప్రతిపాదనకు ఆమో దం పొందాలి. తాగునీరు, రోడ్డు, గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ భవనాలు, ప్రహరీలు, పైపులైన్లు ఇతరత్రా పనులు ప్రతిపాదించాలి. ఆమోదం తెలిపిన జాబితాను ఎంపీడీవోలకు పంపిస్తారు. మండల స్థాయిలో సెక్టార్ జాబితాకు ఆమోదం పొందుతారు.
 
ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ నుంచి 30శాతం నిధులు మండల సెక్టార్‌కు, 18శాతం మున్సిపల్ సెక్టార్‌కు కేటాయిస్తారు. మం  డల, గ్రామ పనుల జాబితాను ఎంపీడీవో జిల్లా పరిషత్‌కు పంపిస్తారు. మున్సిపల్‌కు నిధులు కేటాయించిన తర్వాతే మండల, గ్రామ, జిల్లా పరిషత్ సెక్టార్లకు కేటాయిస్తారు. మున్సిపాల్టీల్లో ప్రతీ వార్డులో సభ నిర్వహిం చి పనులకు ఆమోదం పొందాలి. ఆ జాబితాను కమిషనర్లు జిల్లా పరిషత్‌కు పంపిస్తారు. జిల్లా స్థాయిలో సాధారణ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి పనుల ప్రతిపాదనల జాబితాను ఆమోదిస్తారు. జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ అధ్యక్షులు, చైర్మన్ ఉండాల్సి ఉంటుంది. జిల్లా ప్రణాళిక కమిటీ ఆమోదం పొందిన పనుల జాబితాను ప్రభుత్వానికి పంపిస్తారు. ఇదంతా జరిగేసరికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశాలున్నాయి.
 
గతంలో దుర్వినియోగం
2012-13 సంవత్సరానికి సంబంధించిన బీఆర్‌జీ నిధుల దుర్వినియోగం అయ్యాయి. పనులు చేయకుండానే రూ.20 లక్షలు డ్రా చేసుకున్నారని 2013-14లో నిర్వహించిన ఆడిట్‌లో వెల్లడైంది. అప్పుడు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగింది. 12 మండలాల అధికారులు డబ్బులు డ్రా చేశారని గుర్తించారు. రూ.10 లక్షల వరకు రికవరీ చేశారు. మిగతా రూ.10 లక్షలు రికవరీ చేయాల్సి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పనుల ప్రతిపాదనలకు ఆమోదం తెలపాలని అధికారులు చర్చించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement