
కేంద్రం ఇచ్చిన రూ.1,121 కోట్ల నిధులు ఎనిమిది నెలల తర్వాత జమ
నిధుల మళ్లింపుపై 20 రోజుల క్రితం రాష్ట్రాన్ని తీవ్రంగా ఆక్షేపించిన కేంద్రం
‘సాక్షి’ వరుస కథనాలతో తాజాగా పంచాయతీరాజ్ శాఖకు విడుదల
సాక్షి, అమరావతి: ‘‘మీకు చేరిన ఈ నిధులను పది పని దినాల్లోగా గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ల బ్యాంకు ఖాతాల్లో జమ చేయండి..’’ అంటూ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులకు ఎనిమిది నెలల తర్వాత కానీ మోక్షం లభించలేదు. 15వ ఆర్థిక సంఘం నుంచి కేటాయించిన ఈ నిధులను కూటమి ప్రభుత్వం ఇన్నాళ్లూ దారిమళి్లంచింది. అయితే, ‘సాక్షి’ వరుస కథనాలు, కేంద్ర ప్రభుత్వం ఆక్షేపణతో ఎట్టకేలకు మంగళవారం గ్రామీణ స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేసేందుకు సిద్ధపడింది.
గత ఏడాది డిసెంబరులో రూ.1,121 కోట్లను కేంద్రం రాష్ట్రానికి విడుదల చేసింది. నిబంధనల ప్రకారం పంచాయతీలకు 70 శాతం, మండల పరిషత్‌లకు 20, జిల్లా పరిషత్‌లకు 10 శాతం చొప్పున వాటి బ్యాంకు ఖాతాల్లో వేయాలి. కానీ, రాష్ట్ర ఖజానాలోనే ఉంచేసి, వివిధ అవసరాలకు వాడేసింది కూటమి సర్కారు. నిధులను విడుదల చేసినట్లు చెప్పుకోవడానికి అన్నట్లు... నాలుగు నెలల తర్వాత ఏప్రిల్ 25న పంచాయతీరాజ్ శాఖ నుంచి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ల (బీఆర్వో) పేరుతో రెండు జీవోలను విడుదల చేసింది. మళ్లీ నాలుగు నెలలు గడిపేసి, మంగళవారం రాత్రి ఆర్థిక సంఘం నిధులను పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ల ఖాతాలో వేసింది.
‘సాక్షి’ ఎండగట్టింది.. కేంద్రం తలంటింది
ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేయకుండా ఇతర అవసరాలకు వాడుకుంటున్న తీరుపై గత ఎనిమిది నెలల వ్యవధిలో ‘సాక్షి’ పలుసార్లు కథనాలు ప్రచురించింది. నెలల తరబడి కాలయాపన చేస్తుండడాన్ని కేంద్రం కూడా తీవ్రంగా ఆక్షేపించింది. దీంతో కూటమి ప్రభుత్వం ఇన్నాళ్లకు ఆ నిధులను విడుదల చేసింది.
గత ప్రభుత్వంలో సర్పంచుల ఆధ్వర్యంలోనే స్వేచ్ఛగా చెల్లింపులు
15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం ప్రత్యేకించి గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేసే నిధులను రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలు లేకుండా సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్ల పరిధిలో అభివృద్ధి పనులకు ఖర్చు చేసేలా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కొత్త విధానం మొదలైంది.
పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌లలో తీర్మానాల ప్రకారం చేపట్టే పనులకు ఆయా స్థానిక సంస్థల ప్రభుత్వాలే నేరుగా బిల్లులు చెల్లించేలా, రాష్ట్ర ట్రెజరీల ఆంక్షలు కూడా లేకుండా ఆ నిధులను గ్రామీణ స్థానిక సంస్థల ప్రత్యేక బ్యాంకు ఖాతాల్లో జమ చేసే పద్ధతి అమలులో ఉంది. ఇందుకుగాను 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు కేంద్రం విడుదల చేసే నిధులను ఎప్పటికప్పుడు గ్రామీణ స్థానిక సంస్థలకు జమ చేసేది.
కూటమి పాలనలో రెండుసార్లు
కూటమి ప్రభుత్వం వచ్చాక.. మరీ గత 10 నెలల కాలంలోనే రెండుసార్లు గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్రం విడుదల చేసిన నిధులను నెలల తరబడి రాష్ట్ర ఖజానాలో ఉంచేసింది. ఈ తీరుపై విమర్శలు వచ్చాక గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరం మొదటి విడత నిధులు రూ.988.76 కోట్లను నిరుడు సెప్టెంబరులో విడుదల చేయగా.. దాదాపు రెండు నెలల తర్వాత నవంబరులో స్థానిక సంస్థల ఖాతాల్లో వేసింది.
2023–24 ఆర్థిక సంవత్సరానికి రెండో విడతగా కేంద్రం విడుదల చేసిన రూ.998 కోట్లను కూడా ఆలస్యంగా విడుదల చేసింది. గత ఏడాది మార్చి నాటికి ఎన్నికల షెడ్యూల్ విడుదలై కోడ్ అమలు లోకి వచ్చింది. అప్పటి అధికారులు నిధులను గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేయలేదు. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం నిరుడు జూన్ 12న బాధ్యతలు చేపట్టినా ఆగస్టు దాకా స్థానిక సంస్థల నిధులను ఇవ్వలేదు. నిరుడు ఆగస్టు 13న ఈ అంశంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించాక చర్యలు చేపట్టింది.