నిషేధానికి పొగ

Tires Burning In Oil Mill - Sakshi

పాత టైర్ల నుంచి ఆయిల్‌ తీస్తున్న వైనం

తారులో కలుపుతూ అక్రమ దందా..

పగలంతా గప్‌చుప్‌.. కంపెనీలకు తాళం

రాత్రయితే చాలు  దందా షురూ..

బాయిలర్స్‌ కోసం  పచ్చని చెట్ల నరికివేత

వాసన తట్టులేకపోతున్న గ్రామస్తులు

పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

పాడైన పాత టైర్లను పంక్చర్‌ దుకాణదారు వద్దనో.. లేదా టైర్లు మార్చిన మెకానిక్‌ వద్దనో వదిలేస్తాం. కానీ హైదరాబాద్‌కు చెందిన కొంతమంది వాటితోనే వ్యాపారం చేస్తున్నారు.  హైదరాబాద్‌లో సేకరించిన పాత టైర్లను చిన్నశంకరంపేట మండల కేంద్రానికి తరలిస్తున్నారు. ఇక్కడి టైర్ల నుంచి అయిల్‌ తీసే మిల్‌ (ఈ తరహా పరిశ్రమలపై నిషేధం ఉంది)లో గానుగాడించేందుకు రాత్రికి రాత్రికి తెస్తున్నారు. ఇలా పరిశ్రమలో ఉడికించిన టైర్ల నుంచి వచ్చిన ఆయిల్‌ను గుట్టు చప్పుడు కాకుండా మళ్లీ హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. దీన్ని బీటీరోడ్డు కోసం వాడుతున్న తారులో కలిపి నాసిరకం తారు దందాను నడుపుతున్నారు. అనుమతులు లేని ఈ కంపెనీలో పచ్చని చెట్ల నుంచి సేకరించిన కలపను బట్టీల నిర్వహణకు వాడుతున్నారు. ఈ పరిశ్రమ నుంచి వెలువడుతున్న పొగతో పరిసర ప్రాంతాల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

చిన్నశంకరంపేట(మెదక్‌): ప్రభుత్వం కాలుష్య కారక పరిశ్రమలపై వేటు వేసింది. అయినా చిన్నశంకరంపేట శివారులో అధికారుల కన్నుగప్పి గుట్ట చప్పుడు కాకుండ టైర్ల నుంచి ఆయిల్‌ తీసే పరిశ్రమలను నడుపుతున్నారు. పగలంత గప్‌చూప్‌గా ఉండేæ ఈ పరిశ్రమలు రాత్రయితే చాలు పని ప్రారంభిస్తున్నారు. ఇక్కడ పాత టైర్ల నుంచి ఆయిల్‌ తీసి అక్రమ దందాను నడుపుతున్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంతో పాటు కామారం శివారులోనూ ఈ రకమైన పరిశ్రమలున్నాయి. గతంలోనే టైర్లను ఉడికించి అయిల్‌ తీసే పరిశ్రమలు కాలుష్య కారకమైనవిగా గుర్తించి ప్రభుత్వం వాటిని నిషేధించింది. ఉమ్మడి జిల్లా కలెక్టర్‌ నిషేధిస్తు ఉత్తర్వులు ఇవ్వడంతో మూత పడ్డాయి. తాజాగా కొన్ని నెలలుగా ఈ వ్యాపారం మళ్లీ ప్రారంభించారు.  టైర్లను రాత్రి సమయంలో ఉడికించి తీసిన అయిల్‌ను ట్యాంకర్ల ద్వారా రాత్రికి రాత్రే తరలిస్తున్నారు. పగలంతా ఆ పరిశ్రమలకు తాళం వేసి ఎవరికి అనుమానం రాకుండా జాగ్రత్త పడుతున్నారు. దీంతో రాత్రి సమయంలో వదిలే కాలుష్య రసాయనలతో వాతవారణం  చెడిపోతుంది. సమీప వ్యవసాయ పొలల్లో దుమ్మదూలి పేరుకుపోవడంతో పాటు బోర్లలోని నీరు సైతం కాలుషితం అవుతున్నాయి ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. 

హైదరాబాద్‌కు తరలింపు..
హైదరాబాద్‌ నుంచి తీసుకొచ్చిన  టైర్లను చిన్నశంకరంపేట శివారులోని గోడుగుమర్రి సమీపంలో ఉన్న టైర్ల కంపెనీలో ఉడికిస్తున్నారు. ఇలా ఉడికించగా టైరు డాంబర్‌ అయిల్‌గా మారిపోతుంది. దీంతో పాటు టైర్లలోని ఇనుప తీగలు కూడ బయటకు తీస్తున్నారు. ఈ అయిల్‌ను ట్యాంకులో నుంచి ట్యాంకర్‌లోకి తీసుకుని రాత్రికి రాత్రే హైదరాబాద్‌కు తరలిస్తు సొమ్ము చేసుకుంటున్నారు. ఇనుప తీగలను సైతం ఒక దగ్గర చేర్చి పాత ఇనుప సామను తరలించే వ్యాపారులకు విక్రయిస్తున్నారు.

అక్రమ కలప నిలువ...
నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న ఈ పరిశ్రమలలో టైర్లను ఉడికించడానికి బారీగా కలప అక్రమ నిల్వలను సేకరిస్తున్నారు. ఈ కలపతోనే బాయిలర్‌లను నడుపుతున్నారు. దీంతో మండలంలోని వృక్ష సంపద కూడా తగ్గిపోతోంది. దీని కోసం కలప వ్యాపారులను  ప్రోత్సహిస్తూ అవసరమైన కలపను పరిశ్రమకు తెప్పించుకుంటున్నారు.

గుట్టుగా జరుగుతోంది..
ఈ కంపెనీల్లో పని చేసే కూలీలు సైతం చత్తీస్‌గఢ్‌ నుంచి తీసుకువస్తున్నారు. వీరంతా రాత్రి పని చేసి, పగలంతా విశ్రాంతి తీసుకుంటారు. పరిశ్రమ పరిసరాల్లోనే వీళ్లకు అవసరమైన ఇళ్లను ఏర్పాటు చేశారు. వీరికి బయట ఎవరితోనూ సంబంధం లేకుండా  అవసరమైన కిరాణం సమాను సైతం వారే సమకూర్చుతున్నారు. స్థానికంగా ఓ వ్యక్తి ఇదంతా మేనేజ్‌ చేస్తున్నప్పటికి టైర్లు తీసుకువచ్చేవారు కాని, డాంబ ర్‌ను తరలించేవారు కాని తనకు తెలియదని చెబుతున్నాడు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ దందా నడిపిస్తున్నాడని తెలిపాడు. రోజు కంపెని నడవదని, టైర్లు వచ్చినప్పుడు, మరో వైపు డంబర్‌ అయిల్‌ తీసుకుపోతారనుకున్నప్పుడే నడిపిస్తారని చెప్పాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top