టెన్త్‌ కోసం టైం టేబుల్‌

Time table for Tenth - Sakshi

100 శాతం ఫలితాల కోసం గురుకులాల సమగ్ర ప్రణాళిక

ఉదయం, సాయంత్రం స్పెషల్‌ క్లాసులు, ప్రతి వారం రెండు పరీక్షలు

సెప్టెంబర్‌ రెండో వారం నుంచి కొత్త కార్యాచరణ అమల్లోకి..

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాల సాధన కోసం ప్రత్యేక కార్యాచరణ అమలుకు గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. ప్రస్తుతం కొనసాగుతున్న సమయపాలనకు అదనంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లనున్నాయి. 2018–19 వార్షిక సంవత్సరంలో గురుకుల పాఠశాలల్లో పదోతరగతి ఫలితాల్లో 94.5 శాతం సగటు ఉత్తీర్ణతను సాధించాయి. ఈసారి నూరు శాతం ఫలితాలు సాధించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. అలాగే ఎక్కువ మంది విద్యార్థులు 10 జీపీఏ పాయింట్లు సాధించేలా చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ గురుకులాలు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాయి.

నాలుగు గురుకుల సొసైటీలు ఉమ్మడిగా రూపొందించిన ఈ ప్రణాళికను వచ్చే నెల రెండో వారం నుంచి అమలు చేసేందుకు ఏర్పాట్లు చేపట్టాయి. 4 గురుకుల సొసైటీలు ఉమ్మడిగా రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక అమలు పర్యవేక్షణ సైతం రోజువారీగా నిర్వహించనున్నాయి. గురుకుల సొసైటీ కార్యాలయాల్లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. క్షేత్రస్థాయిలో విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసిన తర్వాత ఆ వివరాలను గురుకుల ప్రిన్సిపాళ్లు సంబంధిత సొసైటీ కార్యాలయాలకు పంపించాలి. అలా వచ్చిన వివరాలను సొసైటీలు అంచనా వేస్తాయి. దీంతో సొసైటీ పరిధిలోని పాఠశాలల పనితీరుపై స్పష్టత వస్తుంది. 

ప్రతిరోజు రెండు స్పెషల్‌ క్లాసులు 
గురుకుల సొసైటీలు రూపొందించిన ఉమ్మడి ప్రణాళికను ప్రస్తుతం పదోతరగతి చదువుతున్న వారికే అమలు చేయనున్నారు. ఈ ప్రత్యేక ప్రణాళికలో భాగంగా ప్రతిరోజు రెండు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. దీంతో వారంలో ప్రతి సబ్జెక్టును రెండు సార్లు ప్రత్యేక తరగతుల్లో బోధిస్తారు. ఇందులో ఒక తరగతిలో రివిజన్, మరో తరగతిలో అభ్యాసన కార్యక్రమాలు ఉంటాయి. వారాంతంలో శని లేదా ఆదివారాల్లో స్లిప్‌టెస్టులు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకుంటూ విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. సబ్జెక్టులో వెనుకబడినట్లు గుర్తిస్తే వారికి మరింత సాధన చేయించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల రెండో వారం నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభమవుతాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top