మృత్యువుతో పోరాడి.. | Three People Died In Accident At Bollikunta | Sakshi
Sakshi News home page

మృత్యువుతో పోరాడి..

Mar 22 2018 7:55 AM | Updated on Apr 7 2019 4:36 PM

Three People Died In Accident At Bollikunta - Sakshi

మామునూరు : వరంగల్‌–ఖమ్మం ప్రధాన రహదారిపై బొల్లికుంట క్రాస్‌ రోడ్డు వద్ద ఉగాది పర్వదినం రోజున కారు, బైక్‌ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలై హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం పెరుమాండ్ల శరత్‌(25) మృతి చెందగా బుధవారం పెరుమాండ్ల సాయితేజ్‌(23), అడ్డగట్ల రాహుల్‌(22) మృతి చెందారు. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఖిలా వరంగల్‌ మండలం బొల్లికుంటకు చెందిన పెరుమాండ్ల ఎల్లగౌడ్‌ రెండో కుమారుడు శరత్, పెరుమాండ్ల శ్రీనివాస్‌ కుమారుడు సాయితేజ్, అడ్డగట్ల మార్కండేయ కుమారుడు రాహుల్‌.. ముగ్గురు మంచి మిత్రులు. వీరంతా ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం సాయంత్రం తోటి స్నేహితులను కలిసేందుకు బొల్లికుంట నుంచి ఒకే బైక్‌పై సరదాగా బయటకు వెళ్లారు.

రాత్రి 8.45 గంటలకు ముగ్గురు మిత్రులు తిరిగి బైక్‌పై బొల్లికుంటకు బయల్దేరారు. ఈ క్రమంలో గ్రామ క్రాస్‌రోడ్డు వద్ద ఖమ్మం నుంచి వరంగల్‌ వైపు వస్తున్న కారు అదుపు తప్పి బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో శరత్, రాహుల్, సాయితేజ్‌ రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రులను ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.  పెరుమాండ్ల శరత్‌ చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందగా బుధవారం ఉదయం అడ్డ గట్ల రాహుల్, పెరుమాండ్ల సాయితేజ్‌ కూడా తనువు చాలించారు. దీంతో గాయపడిన ముగ్గురు యువకులు మృతిచెందడంతో వారి కుటుంబాల్లో విశాద ఛాయలు అలుముకున్నాయి.

అయితే మృతుడు పెరుమాండ్ల సాయితేజ్‌ తండ్రి పెరుమాండ్ల శ్రీనివాస్‌  ఇటీవలే తాటిచెట్టుపై నుంచి పడి గాయాలపాలై మంచానికే పరిమితమయ్యాడు. ఈ పరిస్థితిలో చేతికి అంది వచ్చిన కుమారుడు దూరం కావడంతో కుటుంబ సభ్యులు, బంధు వులు గుండెలవిసేలా రోదించారు. కాగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎంపీ పసు నూరి దయాకర్, గన్నోజు శ్రీనివాసాచారి, ఇనుగాల వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, నిమ్మగండ వెంకన్న, సుదర్శన్‌రెడ్డి, సారంగపాణితో పాటు పలువురు శరత్, రాహుల్, సాయితేజ్‌ మృతదేహాలను సందర్శించి నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement