జిల్లా ప్రభుత్వాసుపత్రిలో లంచావతారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించడంతో హడలిపోతున్నారు.
మహబూబ్‌నగర్ వైద్యవిభాగం: జిల్లా ప్రభుత్వాసుపత్రిలో లంచావతారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించడంతో హడలిపోతున్నారు. వైద్యం కోసం వచ్చిన రోగులు, వారి సహాయకులను డబ్బుల కోసం జలగల్లా పీడిస్తున్న ముగ్గురు ఆస్పత్రి నాలుగో తరగతి సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసినట్లు కలెక్టర్ టీకే శ్రీదేవి బుధవారం వెల్లడించారు. సంబంధిత మెటర్నిటీ వార్డు ఇన్‌చార్జి వైద్యుడికి మెమో జారీచేసినట్లు పేర్కొన్నారు. జిల్లా ఆస్పత్రిలో కొడుకు పుడితే రూ.వెయ్యి, కూతురు పుడితే రూ.500 వసూలు చేస్తున్నట్లు తమ విచారణలో తేలిందని తెలిపారు.
కాగా, ఇటీవల జిల్లా ఆస్పత్రిలో సిబ్బందికి డబ్బులు ఇవ్వలేక.. భార్యకు వైద్యం చేయించుకోలేక మనస్తాపానికి గురై రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడిన జడ్చర్లవాసి చెన్నకేశవులు హత్యోదంతంతో జిల్లా అధికారయంత్రాంగం కదిలింది. విచారణ కోసం ప్రత్యేకాధికారిగా ఇన్‌చార్జి జేసీ డాక్టర్ రాజారాంను కలెక్టర్ టీకే శ్రీదేవి నియమించారు. దీంతో ఆయన నేతృత్వంలోని ప్రత్యేక బృందం రెండురోజుల పాటు జిల్లా ఆస్పత్రిలో విచారణ జరిపింది. ఆత్మహత్యకు దారిన పరిస్థితులపై ఆరాతీశారు.
ఆస్పత్రి సిబ్బంది డబ్బుల కోసం వేధించడం వల్లే చెన్నకేశవులు ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. కాగా, ఈ సంఘటన జిల్లావ్యాప్తంగా దుమారం లేవడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే సిబ్బంది సస్పెన్షన్ వివరాలను డీసీహెచ్ పద్మజా, డీఎంహెచ్‌ఓ గోవింద్ వాగ్మోరే, సూపరిటెండెంట్‌శామ్యూల్ వెల్లడించకపోవడం గమనార్హం.