‘అవి ప్రభుత్వ హత్యలు’ | the cause of that murders is government | Sakshi
Sakshi News home page

‘అవి ప్రభుత్వ హత్యలు’

Nov 6 2014 1:44 AM | Updated on Oct 1 2018 2:36 PM

రైతుల ఆత్మహత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని....

పరిగి: రైతుల ఆత్మహత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని డీసీసీ ఉపాధ్యక్షుడు సుభాష్‌చందర్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నారాయణ్‌రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు లాల్‌కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. అప్పుల బాధతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న దోమ మండలం బొంపల్లి తండాకు చెందిన రాములునాయక్ మృతదేహంతో నాయకులు, మృతుడి బంధువులు పట్టణంలో బుధవారం మధ్యాహ్నం ధర్నా నిర్వహించారు.

 బస్‌స్టాండు ఎదుట హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై బైటాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ నాయకులు కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడ్డారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూ పిట్టలా నేలరాలుతున్నా సర్కార్‌కు చీమకుట్టినట్లు కూడా కావడంలేదని మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

 బ్యాంకులు కొర్రీలు పెడుతూ రుణాలివ్వకున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. బ్యాంకులు అప్పులివ్వక.. కరెంట్ లేక పంటలు కళ ్లముందే ఎండిపోవడంతో అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని నాయకులు తెలిపారు. రైతుల మృతితో వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే రైతు సమస్యలపై దృష్టిసారించి సమస్యలు పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు.

గంటకు పైగా నిర్వహించిన రాస్తారోకోతో రోడ్డుపై వాహనాలు స్తంభించిపోయాయి. సీఐ ప్రసాద్, ఎస్‌ఐ కృష్ణ, శంషొద్దీన్‌లు ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను శాంతింపజేసే యత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. పరిగి తహశీల్దార్ విజయ్‌కుమార్‌రెడ్డి అక్కడికి చేరుకొని వారిని సముదాయించారు. రాములునాయక్ ఆత్మహత్య విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని, మృతుడి కుటుంబీకులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.  అనంతరం మృతుడి కుటుంబీకు లు, నాయకులు ఇచ్చిన వినతి పత్రాన్ని స్వీకరించారు.

దీంతో ఆందోళనకారులు ధర్నా విరమించారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొంపల్లి రాములు, రవీంద్ర, రామకృష్ణ, ఎర్రగడ్డపల్లి కృష్ణ, సర్వర్, అక్బర్, ఆంజనేయులు, టీ.వెంకటేష్, సమద్,  షాహెద్, శివకుమార్ తదితరులు ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement