పోలీసులు రైతులను తోస్తున్న దృశ్యం
పరిగిలో భూ సేకరణ బాధితుల ఆందోళన
బీజాపూర్ జాతీయ రహదారిపై ధర్నా
పరిగి: ప్రాణాలైనా ఇస్తాం కానీ పరిశ్రమల ఏర్పాటుకు భూములు ఇచ్చేది లేదని వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళ్లాపూర్ రైతులు నినదించారు. ఈ మేరకు గురువారం పరిగి బస్టాండ్ ఎదుట బీజాపూర్ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. మండలంలోని కాళ్లాపూర్, రాపోల్ గ్రామాల్లో 1,197 ఎకరాల భూమిలో ఇండ్రస్టియల్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 260 ఎకరాల పట్టా భూమి, 937 ఎకరాల లావాణి పట్టా భూములు ఉన్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ ఇరు గ్రామాల రైతులు నాలుగు రోజులుగా రిలే నిరాహార దీక్షలతో నిరసన తెలుపుతున్నారు.
ఇందులో భాగంగా ప్రజా సంఘాల నాయకులు, వివిధ పార్టీల మద్దతుతో కొడంగల్ చౌరస్తా నుంచి పరిగి బస్టాండ్ ర్యాలీ తీశారు. తమ జీవనాధారమైన భూములను లాక్కోవద్దని కోరారు. సీఎం, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని, తమకు సహకరించాలని పోలీసులను పలువురు రైతుల వేడుకున్నారు. రైతుల మాటలేవీ పట్టించుకోని పోలీసులు నిరసనకారులపై బలప్రదర్శన చేశారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రోడ్డుపై నిరసన చేపట్టడంతో ట్రాఫిక్ జామ్ అవుతోందని, వెంటనే విరమించాలని సూచించగా, రైతులు కొంత సమయం ఇవ్వాలని కోరారు.
ఇందుకు అంగీకరించని పోలీసులు కాళ్లాపూర్ సర్పంచ్ పల్లయ్యతో పాటు, రైతులను బలవంతంగా వాహనాల్లో ఎక్కించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న పెనుగులాటలో పలువురు రైతులు, సర్పంచ్‌కు గాయాలయ్యాయి. ఈ క్రమంలో వాహనాలను పీఎస్‌కు తరలిస్తుండగా మహిళా రైతులు అడ్డుపడ్డారు. తాము తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసి, ధర్నా ఆపేస్తామని చెప్పడంతో పోలీసులు శాంతించారు. అనంతరం నాయకులు, రైతులు వెళ్లి తహసీల్దార్ వెంకటేశ్వరికి వినతిపత్రం ఇచ్చారు. ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి వెంటనే భూ సేకరణను ఆపాలని, లేదంటే నిరసనలు మరింత ఉద్రితం చేస్తామని రైతులు హెచ్చరించారు.


