టీజీసెట్‌–2019 ఫలితాలు వెల్లడి 

TGCET 2019 results was revealed - Sakshi

పరీక్ష రాసిన 1.35లక్షల మంది విద్యార్థులు.... 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ గురుకులాల్లో 47,740 సీట్లు 

గురుకులాల్లో ఐదోతరగతి ప్రవేశాల షెడ్యూల్‌ జారీ 

సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 31లోగా పాఠశాలలో రిపోర్టు చేయాలి 

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల పాఠశాలల ప్రవేశ పరీక్ష(టీజీసెట్‌–2019) ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఏప్రిల్‌ తొలివారంలో జరిగిన ఈ పరీక్ష.. ఫలితాలను టీజీసెట్‌ కన్వీనర్‌ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ కేటగిరీలకు చెందిన 613 సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో 47,740 సీట్ల భర్తీకోసం టీజీసెట్‌–2019 నిర్వహించారు. ఇందులో భాగంగా 1,46,411 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా... 1,35,608 (92.62శాతం) మంది పరీక్ష రాశారు. తాజాగా విడుదలైన ఫలితాలను  www. tswreis.in  వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పరీక్ష రాసిన విద్యార్థి హాల్‌టిక్కెట్‌ నంబర్‌తో పాటు పుట్టిన తేదీని నమోదు చేస్తే విద్యార్థికి వచ్చిన మార్కులు, ఎక్కడ సీటు కేటాయించారనే వివరాలుంటాయి. మార్కుల ఆధారంగానే సీట్లు కేటాయించగా... తక్కువ మార్కులు వచ్చిన వారికి మాత్రం ఎక్కడా సీటు ఇవ్వలేదు. సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 21వ తేదీ నుంచి 31లోగా నిర్దేశిత పాఠశాలలో అడ్మిషన్‌ తీసుకోవాలని సెట్‌ కన్వీనర్‌ స్పష్టం చేశారు. ఈసారి కొత్తగా ప్రారంభమవుతున్న 119 బీసీ గురుకులాల్లో ఐదోతరగతి ప్రవేశాలను కూడా టీజీసెట్‌ ద్వారానే భర్తీ చేస్తున్నారు. 

ఇవి తప్పనిసరి... 
టీజీసెట్‌లో సీటు సాధించిన విద్యార్థులు కేటాయించిన పాఠశాలకు నేరుగా వెళ్లాలి. ఈ సమయంలో టీజీసెట్‌ అర్హత పత్రాన్ని ఆన్‌లైన్‌లో ప్రింట్‌ తీసుకోవాలి. వీటితో పాటు నాల్గో తరగతి టీసీ, బోనఫైడ్, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం, అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్‌ నుంచి పొందిన ఆరోగ్య ధ్రువీకరణ పత్రం, బ్లడ్‌ గ్రూప్‌ సూచించే పత్రం, ఆధార్‌ జిరాక్సు కాపీతో పాటు నాలుగు పాస్‌పోర్టు సైజు ఫోటోలు పాఠశాలలో సమర్పించాలి. దివ్యాంగులు, మైనార్టీలు, అనాథలు అయితే సంబంధిత ధ్రువీకరణపత్రాలను జత చేయాలి. అడ్మిషన్‌ తీసుకున్న తర్వాత విద్యార్థికి పాఠశాలలో ప్లేటు, గ్లాసు, కటోర, ట్రంకుబాక్సు, దుప్పట్లు, నోటు పుస్తకాలు, సబ్బులు, తల నూనె, బకెట్, మగ్గు, టార్చిలైట్, యూనిఫాం ఇస్తారు. వీటిని ఆ విద్యార్థి ఏడాది పాటు వినియోగించుకోవాల్సి ఉంటుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top