దేశానికే తలమానికం | Textile Park will become the best in the country | Sakshi
Sakshi News home page

దేశానికే తలమానికం

Oct 21 2017 4:25 AM | Updated on Aug 15 2018 8:08 PM

Textile Park will become the best in the country - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశ టెక్స్‌టైల్స్‌ రంగానికే తలమానికంగా వరంగల్‌ రూరల్‌ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్‌టైల్స్‌ పార్కు నిర్మిస్తామని పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. మెగా టెక్స్‌టైల్స్‌ పార్కు దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్స్‌ పార్కు అవుతుందని చెప్పారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట, చింతపల్లి గ్రామాల పరిధిలోని 2 వేల ఎకరాల్లో ఈ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 22న శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. కాకతీయ టెక్స్‌టైల్స్‌ పార్కు ఏర్పాటుపై శుక్రవారం మంత్రి కేటీఆర్‌ బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఫైబర్‌ టు ఫ్యాషన్‌ పద్ధతిలో (నూలు పోగు నుంచి వస్త్రాల తయారీ వరకు) కావాల్సిన అన్ని అధునాతన వసతులను ఈ పార్కులో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.  

ప్రపంచస్థాయి ప్రమాణాలు..
రాష్ట్రంలో నాణ్యమైన పత్తి దిగుబడి అయ్యే ప్రాంతాలకు చేరువుగా ఈ పార్కు ఉందన్నా రు. ఇక్కడ ఏర్పాటయ్యే టెక్స్‌టైల్స్‌ పరిశ్రమలు ప్రపంచస్థాయి ప్రమాణాలు కలిగి ఉంటాయన్నారు. ఈ పార్కులో దుస్తుల తయారీకి అవసరమైన ‘ప్లగ్‌ అండ్‌ ప్లే ఫ్యాక్టరీ’షెడ్‌లను సైతం ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. అత్యుత్తమ టెస్టింగ్‌ లేబొరేటరీలతో పాటు పార్కు మొత్తం జీరో లిక్విడ్‌ డిశ్చార్జి విధానం అమలు అవుతుందన్నారు. దీంతో కాలుష్య సమస్య అంతగా ఉండదన్నారు. సమీప భవిష్యత్తులో ఔటర్‌రింగ్‌ రోడ్డుతో పాటు ఒక ఎయిర్‌ స్ట్రీప్‌ అందుబాటులోకి తెస్తామన్నారు. కాకతీయ టెక్స్‌టైల్స్‌ పార్కు ఏర్పాటుతో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో ఓ ముందడుగు పడిందన్నారు.  

విదేశాల నుంచి పెట్టుబడులు..
టెక్స్‌టైల్స్‌ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు దేశ, విదేశాల నుంచి పారిశ్రామిక దిగ్గజాలు ముందుకు వస్తున్నాయని కేటీఆర్‌ తెలిపారు. ఇప్పటికే 12 కంపెనీలు, రూ.3,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని వెల్లడించారు. దక్షిణకొరియాకు చెందిన యాంగ్వాన్‌ కంపెనీ రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని చెప్పారు.

సూర్య వంశీ, శ్రీనాథ్, సూర్యోదయ్‌ స్పిన్నింగ్‌ మిల్స్, శివానీ గ్రూప్, గిన్ని ఫిలామెంట్స్, స్వయంవర్‌ గ్రూప్, వెల్‌ స్పన్‌ గ్రూప్, గోకుల్‌ దాస్‌ ఇమేజేస్, నందన్‌ డెనీమ్, షాపర్స్‌ స్టాప్, చిరిపాల్‌ వంటి పలు కంపెనీలు మరో రూ.2 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయన్నారు. టెక్స్‌టైల్స్‌ పార్కుకు శంకుస్థాపన జరిపిన రోజే ఈ కంపెనీలతో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన అంశంపై ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు. దీంతో ప్రత్యక్షంగా 22 వేల మంది, పరోక్షంగా 44 వేల మంది కలిపి మొత్తం సుమారు 66 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. పార్కుకు అనుబంధ పరిశ్రమల కోసం ఇతర ప్రాంతాల్లో రూ.400 కోట్ల పెట్టుబడులను పెట్టేందుకు మరో 8 కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు.

డిజైన్‌ రెడీ..
కాకతీయ టెక్స్‌టైల్స్‌ పార్కు లోగో నమూనా, పైలాన్లను టీఎస్‌ఐఐసీ రూపొందించింది. టెక్స్‌టైల్‌ పరిశ్రమ ఉన్నతి, తెలంగాణ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకుని పైలాన్‌ తయారు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పరిశ్రమకు ప్రాణమైన దారపు కండెను మధ్యలో ఉంచి దాని చుట్టూ రంగు రంగుల దారాల పోగులతో పైలాన్‌ను అకర్షణీయంగా తయారు చేశారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను సూచించేలా పైలాన్‌ పైన గ్లోబ్‌ ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement