లీజుదారులకు నిష్‌‘ఫలమే’ | Sakshi
Sakshi News home page

Published Thu, Apr 26 2018 8:29 AM

Tenants Facing Mango Flowering Problems In Jagtial - Sakshi

సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్‌:   జిల్లాలో దాదాపు 50 వేల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. ఇక్కడి రైతులు అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 5 నుంచి 6 టన్నుల దిగుబడి వస్తుంది. కానీ, ఈ సీజన్‌లో పూత నుంచే సమస్యలు మొదలయ్యాయి. పూత ఆలస్యంగా రావడంతోపాటు, పూత సమయంలో రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడం, తేమ వాతావరణంతో వచ్చిన పూత నిలువలేదు.

నిలిచిన పూతను సైతం తెగుళ్లు ఆశించి నష్టం చేశాయి. మామిడి చెట్లకు అక్కడక్కడ ఉన్న కాయలు ఇటీవల కురిసిన వడగండ్ల వానకు రాలిపోయాయి. ఈ క్రమంలో వడగండ్లు, ఈదురుగాలుల బాధ పడలేక గుత్తేదారులు కాయ సైజు పెరగకుండానే కోస్తున్నారు. మార్కేట్‌లో   ఏదో ఒక రేటుకు మార్కెట్‌లో అమ్ముతున్నారు. ప్రస్తుతం ఒక్కో చెట్టుకు కనీసం 2 నుంచి 3 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు.

గుత్తెదారుల గుండెల్లో దడ
మామిడి తోటలను జిల్లాలో దాదాపు 70 శాతం మంది రైతులు లీజుకు ఇస్తుంటారు. ఈసారి మామిడి తోటలపై వాతావరణ ప్రభావంతోపాటు వడగండ్ల ప్రభావంతో ఉండటంతో లీజుదారులు ఇబ్బందులు పడుతున్నారు. తోట యాజమానులకు ముందే డబ్బులు చెల్లించడం, కాయలు పెద్దగా లేకపోవడం, ఉన్న కొద్దిపాటి కాయ రాలడం, మంచి కాయ రేటు సైతం రోజు రోజుకు పడిపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

వడ్డీలు తెచ్చి మరీ తోటలు లీజుకు తీసుకున్న లీజుదారులు.. దిగుబడి సగానికిపైగా పడిపోవడంతో లీజు డబ్బులు సైతం దక్కే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు. ఒక్కో ఎకరానికి రూ.50 వేలపైగా రైతులకు చెల్లించి తోటలు లీజుకుతీసుకున్నారు. అయితే ఇతర ప్రాంతాల్లో మామిడికాయ లేకపోవడంతో ధర ఓ మోస్తారుగా టన్నుకు మార్కెట్‌లో రూ.40 వేల నుంచి రూ.45 వేల వరకు ఉండటం లీజుదారులకు కొంత ఊరటనిస్తోంది.

భారీగా పెట్టుబడి ఖర్చులు..
లీజుదారులు మామిడి తోటలను లీజుకు తీసుకున్నప్పటి నుంచి ప్రతీ పనిని వారే చేసుకోవాల్సి ఉంటుంది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పూత రాలిపోవడం, కాయ సైజు పెరగడానికి రెండు సార్లు క్రిమిసంహారక మందులతోపాటు పోటాష్‌ వేశారు. కాయ సైజు పెరిగినప్పటికీ తోటలకు రక్షణగా ఓ కాపాలదారుడిని పెడుతుంటారు. తర్వాత, సైజుకు వచ్చిన కాయలను కూలీలతో కోయించడం, మార్కెట్‌కు తరలించడం వంటి వాటికి లీజుదారులు భారీగానే ఖర్చు చేస్తున్నారు. దాదాపు ఎకరాకు కనీసం రూ.10 వేలపైనే ఖర్చు చేస్తున్నారు.

పెట్టుబడి వచ్చేలా లేదు
నేను ఐదు ఎకరాల తోట లీజుకు తీసుకున్నాను. పూత బాగానే వచ్చింది కాని ఆ మేరకు కాయ కనబడటం లేదు. కాయ చిన్నగా ఉన్నప్పటికీ రాళ్లవాన వస్తే ఇబ్బంది అని కొంతమేర తెంపి జగిత్యాల మార్కెట్‌లో అమ్మిన. ఈ సారీ మామిడి తోటలకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేలా లేదు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.
– గాదె శంకరయ్య, అనంతారం

ఏం చేసుడో అర్థమైతలేదు
ఈసారి ఐదారు తోటలు లీజుకు తీసుకున్న. పూత బాగా వచ్చిందని తోటలు పట్టిన. రెండుసార్లు మందులు కూడా కొట్టినా. అయినా ఊహించినంతగా కాయ రాలేదు. ఉన్న కాయ గాలులకు రాలిపోతున్నయ్‌. భయంతో ఇప్పటికే సగం కాయలు తెంపి అమ్మిన. మిగిలిన కాయలకు కూడా పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు.  – సత్తవ్వ, తిర్మలాపూర్‌

నిరుడు మంచిగ కాసినయ్‌
నేను ఈ ఏడాది 20 ఎకరాల మామిడి తోటలు లీజుకు తీసుకున్న. ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు రైతులకు ముట్టజెప్పిన. అయితే నిరుడు మామిడి చెట్లు మంచిగ కాసిన. ఈసారి కూడా దిగుబడి బాగా వస్తదనుకున్నం. కానీ అనుకున్నంతగా చెట్లు కాయలేదు. ఇప్పటికే రెండుసార్లు కురిసిన రాళ్లవానకు ఉన్న కాయలు రాలినయ్‌. మళ్లీ గాలి దుమారం.. రాళ్ల వన పడుతదోనని భయమేస్తుంది. ఉన్న కాయను ఏదో ఒక రేటుకు అమ్ముకోవాల్సి వస్తుంది. కాయ సైజు పెద్దగా ఉంటే బరువు వచ్చి లాభం ఉంటుంది.          
– పంబల్ల లక్ష్మి, తాటిపల్లి
 

Advertisement
Advertisement