ఆ దేవస్థానాలు.. చర్చిలు.. మసీదులు  ఆర్‌టీఐ పరిధిలోకి రావు

Temples And Mosque Are It Not Be Brought Under The RTI Act - Sakshi

వీటి సమాచారాన్ని ఆర్‌టీఐ కింద ఇవ్వాల్సిన అవసరం లేదు

ఉమ్మడి హైకోర్టు తీర్పు

సాక్షి, హైదరాబాద్‌ : ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం పొందని దేవస్థానాలు, చర్చిలు, మసీదులు సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) పరిధిలోకి రావని ఉమ్మడి హైకోర్టు తీర్పునిచ్చింది. కాబట్టి దేవాదాయ చట్టం కింద కమిషనర్‌ లేదా ఇతర ఏ అధికారి అయినా కూడా ఆర్‌టీఐ పరిధిలోకి రాని దేవస్థానాల సమాచారాన్ని సమాచార హక్కు చట్టం కింద ఇవ్వాల్సిన అవసరం లేదంది. అయితే తమకు నిర్దిష్టంగా తెలిసిన సమాచారాన్ని మాత్రం వారు ఆర్‌టీఐ కింద ఇవ్వాలని, ఆ చట్టం కింద వారు పబ్లిక్‌ అథారిటీ కిందకు వస్తారంది.మతపరమైన సంస్థలు ప్రస్తుతం వివిధ మార్గాల నుంచి విరాళాల రూపంలో భారీ మొత్తాలను అందుకుంటున్న నేపథ్యంలో ఆ నిధుల వినియోగం పారదర్శకంగా జరిగేందుకు, సమాచార హక్కు చట్టం లక్ష్యాలను సాధించేందుకు కనీసం రిజిష్టర్‌ అయిన దేవస్థానాలను ఆర్‌టీఐ పరిధిలోకి తీసుకొచ్చేందుకు చట్ట సవరణ తేవాలని హైకోర్టు స్పష్టం చేసింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరామ్‌ ఇటీవల తీర్పునిచ్చారు. సమాచార హక్కు చట్టం కింద కోరిన సమాచారాన్ని దరఖాస్తుదారులకు ఇవ్వాలంటూ దేవాదాయశాఖ ఉన్నతాధికారులు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఉభయ రాష్ట్రాలకు చెందిన పలు మతపరమైన సంస్థలు, ధార్మిక సంస్థలు, ధర్మకర్తలు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు.ఇలా 2007 నుంచి ఈ ఏడాది వరకు దాఖలైన వ్యాజ్యాలన్నింటినీ కలిపి విచారించిన న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా కోదండరామ్‌ ఇటీవల వీటన్నింటినీ కలిపి ఉమ్మడి తీర్పునిచ్చారు. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్‌ 2 (హెచ్‌) ప్రకారం దేవస్థానాలు, ధార్మిక సంస్థలు పబ్లిక్‌ అథారిటీ నిర్వచన పరిధిలోకి రావన్నారు. కాబట్టి దేవస్థానాల ధర్మకర్తలు, పాలకమండళ్లు, చైర్‌పర్సన్‌లు ఆయా దేవస్థానాల సమాచారాన్ని ఆర్‌టీఐ చట్టం కింద అందించాల్సిన అవసరం లేదన్నారు.

కేరళ హైకోర్టు సైతం హిందూ ధార్మిక సంస్థలు, దేవస్థానాలు ఆర్‌టీఐ చట్టం కింద పబ్లిక్‌ అథారిటీ నిర్వచనం పరిధిలోకి రావని తీర్పునిచ్చిన విషయాన్ని న్యాయమూర్తి తన తీర్పులో ప్రస్తావించారు. దేవస్థానాల్లో కొందరు అధికారులు పనిచేస్తున్నప్పటికీ, వారు ఆర్‌టీఐ చట్టం కింద పబ్లిక్‌ అథారిటీ పరిధిలోకి రారన్నారు. దేవస్థానాల కార్యకలాపాల నిర్వహణను చూస్తున్నంత మాత్రాన వాటిని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని దేవాలయాలుగా, ప్రభుత్వ సాయం అందుతున్న దేవస్థానాలుగా పరిగణించటం సాధ్యం కాదని స్పష్టం చేశారు.సమాచార హక్కు చట్టం కింద కోరిన సమాచారాన్ని దరఖాస్తుదారులకు అందచేయాలంటూ పలు దేవాలయాల ఈవోలు, ట్రస్టీలు తదితరులను ఆదేశిస్తూ దేవాదాయశాఖ కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top