
సాక్షి, హైదరాబాద్: యూపీఏ హయంలో చారిత్రాత్మక చట్టాలు అమల్లోకి వచ్చాయని చెప్పుకొచ్చారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఇదే సమయంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్టు తెలిపారు. బీజేపీ.. బీసీ వ్యతిరేక పార్టీ.. బీజేపీకి బీఆర్ఎస్ తోడైంది అంటూ ఘాటు విమర్శలు చేశారు.
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ..‘రేపు ఢిల్లీకి వెళ్తాం. సుప్రీంకోర్టు తలుపు తడుతాం. ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలకు మేం భయపడం. బీసీ రిజర్వేషన్ల పెంపుపై మా చిత్తశుద్ధి ప్రజలకు తెలుసు. బీసీ రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టుకు వెళ్తాం. బీసీ రిజర్వేషన్ల పెంపుపై వెనక్కి తగ్గేది లేదు. బిల్లులు గవర్నర్ దగ్గర పెండింగులో ఉన్నాయి. ప్రధాని దగ్గరికి వెళ్ళి బీజేపీ నాయకులు ఎందుకు అడగడం లేదు?. బీసీ సంఘాలు బంద్‌కి పిలుపునిస్తే మద్దతు ఇస్తాం. బీసీ సంఘాలు ధర్నా చేసినప్పుడు ఈటల, సంజయ్ ఎక్కడ దాక్కున్నారు?. బీజేపీ నరనరాన బీసీ వ్యతిరేక పార్టీ. బీజేపీకి బీఆర్ఎస్ తోడైంది అంటూ విమర్శలు చేశారు.
అలాగే,
ఆర్టీఐపై కీలక వ్యాఖ్యలు..
నేటితో RTI చట్టం అమలులోకి వచ్చి 20 ఏళ్ళు అయిన సందర్భంగా స్పందిస్తూ.. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం, సోనియా గాంధీ దూరదృష్టి నాయకత్వంలో చారిత్రాత్మక సమాచార హక్కు చట్టం (RTI) 2005 అక్టోబర్ 12న అమలులోకి వచ్చింది. దేశ చరిత్రలో RTI చారిత్రాత్మక నిర్ణయం. ప్రజలకి వాస్తవాలను తెలుసుకోవడానికి మహత్తర అవకాశం RTI ద్వారా కల్పించారు. ప్రజలకు RTI జీవన రేఖగా మారింది. ఈ చట్టం ప్రజలకు ప్రభుత్వ విభాగాల సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చి పాలనలో పారదర్శకత, బాధ్యతాయుతమైన విధానాన్ని తీసుకొచ్చింది. 2014 నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం RTIకి తూట్లు పొడుస్తోంది.
2019 సవరణలతో సమాచారం కమిషన్ల స్వతంత్రతను బలహీనపరిచాయి. కమిషనర్ల పదవీకాలం (5 సంవత్సరాలు), సేవా షరతులను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించేలా మార్పులు జరిగాయి. స్వయం ప్రతిపత్తితో నిర్వహించే RTI కమిషనర్లు కేంద్రం ఒత్తిడిలకు తల్లోగే పరిస్థితి ఏర్పడింది. కేంద్ర సమాచారం కమిషన్ ప్రస్తుతం 11 పోస్టులకు బదులుగా కేవలం ఇద్దరు కమిషనర్లతోనే పనిచేస్తోంది. 2025 సెప్టెంబర్ తర్వాత చీఫ్ కమిషనర్ పదవి కూడా ఖాళీగా ఉంటుంది. ఇంతకంటే దుర్మార్గం లేదు. కేంద్రంలోని ఫాసిస్టు బీజేపీ ప్రభుత్వ అవినీతిని బహిర్గతం చేసే వ్యక్తులు రక్షణ లేకుండా దాడులు, వేధింపులకు గురవుతున్నారు. 2019 సవరణలను రద్దు చేసి కమిషన్ల స్వతంత్రతను పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర కమిషన్లలో ఖాళీలను తక్షణమే పారదర్శకంగా భర్తీ చేయాలి. కమిషన్ల పనితీరుపై నిర్దిష్ట ప్రమాణాలు, ప్రజా నివేదికలు తప్పనిసరి చేయాలి’ అని డిమాండ్ చేశారు.