స్కోరింగ్‌ సబ్జెక్టుగా తెలుగు

Telugu as scoring subjects - Sakshi

     అవసరమైన మార్పులు చేయాలని మంత్రి కడియం ఆదేశాలు

     వచ్చే విద్యా సంవత్సరం నుంచి తప్పనిసరి సబ్జెక్టుగా తెలుగు

     సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈలోనూ తప్పనిసరి

     తెలుగు భాష అమలు సలహా సంఘం ఏర్పాటు

     నివేదికను అందజేసిన సబ్‌ కమిటీ

సాక్షి, హైదరాబాద్‌: ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అమలుకు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఆసక్తికరంగా ఉండేలా, మార్కుల స్కోరింగ్‌ సబ్జెక్టుగా తెలుగులో అవసరమైన మార్పులు చేయాలని సూచించారు. తెలుగు తప్పనిసరి చేసేందుకు ప్రభుత్వం నియ మించిన సబ్‌ కమిటీ మంగళవారం తన నివేదికను కడియం శ్రీహరికి అందజేసింది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో మాతృభాష అమలు, తెలుగు అమలుకు చేపట్టాల్సిన చర్యలను నివేదికలో పొందుపరిచారు. రాష్ట్రంలో తెలుగు మాతృభాషగా లేని పాఠశాలలు 1,370 ఉన్నాయని పేర్కొన్నారు. 5వ తరగతి వరకు తెలుగును చదువుకోని వారికి 6వ తరగతిలో అత్యంత సులభంగా సబ్జెక్టును నేర్చుకునేలా పాఠ్యపుస్తకాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. 7వ తరగతి వరకు తెలుగు చదువుకోని వారికి 8వ తరగతిలో, 10వ తరగతి వరకు చదువుకోని వారికి ఇంటర్‌ మొదటి సంవత్సరంలో తెలుగు భాషను సులభంగా నేర్చుకునేలా రూపొందిస్తామన్నారు.

సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈలో కూడా తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా అమలుకు ఆయా బోర్డుల ఉన్నతాధికా రులతో మాట్లాడగా.. తమకెలాంటి అభ్యంతరం లేదని చెప్పినట్లు కడియంకు వివరించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు తప్పనిసరి సబ్జెక్టుగా అమలు తీరు పర్యవేక్షణకు ఓ కమిటీ ఉండాలని కడియం అభిప్రాయపడ్డారు. ఇందుకు ప్రస్తుత సబ్‌ కమిటీని ‘తెలుగు భాష అమలు సలహా సంఘం’గా మారుస్తు న్నట్లు వెల్లడించారు. ఈ కమిటీ తెలుగు భాషను అన్ని విద్యా సంస్థల్లో తప్పనిసరి సబ్జెక్టుగా ఎలా అమలుచేయాలి.. అమలులోని ఇబ్బందులను అధిగ మించేందుకు ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలు.. అమలుపై పర్యవేక్షణకు సూచనలు చేయాలని చెప్పారు. జిల్లా స్థాయిలోనూ అమలుపై పర్యవేక్షణ కమిటీలుండాలని, వాటి నిర్మాణం ఎలా ఉండాలో కూడా ఈ కమిటీ సూచించాలన్నారు. సమావేశంలో విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌. ఆచార్య, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ కిషన్, సబ్‌ కమిటీ చైర్మన్‌ సత్యనారాయణ, కన్వీనర్‌ అశోక్, సభ్యులు దేశపతి శ్రీనివాస్, దేవులపల్లి ప్రభాకర్‌ రావు, సత్యనారాయణరెడ్డి, శేషు కుమారి,  సువర్ణవినాయక్‌ పాల్గొన్నారు.

నివేదికలోని ప్రధాన అంశాలు..
- 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిష్, ఇతర మీడియం వారు ద్వితీయ భాషగా తెలుగును ఎంచుకోవాలి.
సీబీఎస్‌ఈ 11, 12 తరగతుల్లో తెలుగును ఆప్షనల్‌ సబ్జెక్టుగా గానీ, ప్రధాన సబ్జెక్టుగా గానీ చదువుకోవాలి. 
10వ తరగతి వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా, తెలుగు మీడియంలో చదువుకున్న వారంతా ఇంటర్మీడియెట్‌లో ద్వితీయ భాషగా తెలుగును కచ్చితంగా చదువుకోవాల్సిందే.
10వ తరగతి వరకు తెలుగు మీడియం మినహా ఇతర మీడియంలో చదువుకున్న వారు ద్వితీయ భాషగా 50 మార్కులకు తెలుగును, మరో 50 మార్కులకు తమకు నచ్చిన భాషను ఎంచుకోవచ్చు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top