ఇంటర్‌లో తప్పనిసరి ద్వితీయ భాషగా తెలుగు

Telugu is a mandatory secondary language - Sakshi

తెలుగు మీడియం వారికి అమలు చేసేలా చర్యలు

సాక్షి, హైదరాబాద్‌: ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు తెలుగు భాషను ఒక సబ్జెక్టుగా అమలు చేయడంపై ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ నివేదికను ఖరారు చేసింది. ఆదివారం ఇంటర్‌ బోర్డులో జరిగిన అధికారుల కమిటీ సమావేశంలో తెలుగు అమలుకు సంబంధించిన అంశాలపై చర్చించింది. తమిళనాడు, పంజాబ్, కర్ణాటక ప్రభుత్వాలు అధికార/ప్రాంతీయ భాషలను ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తప్పనిసరిగా చదవాలని చేసిన చట్టాలను, నివేదికలను పరిశీలించింది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డుల పాఠశాలలు ఇంటర్‌లో తెలుగు తప్పనిసరి అమలుకు తీసుకోవాల్సిన చర్యలను ఖరారు చేసింది. ఒకట్రెండు రోజుల్లో ఈ నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది.

కమిటీ సిఫార్సులు ఇవీ...
♦  ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగు మీడియం వారికి ఎలాగూ తెలుగు ఒక సబ్జెక్టుగా ఉంది. ఇంగ్లిష్, ఇతర మీడియంల వారికి తెలుగును ఒక సబ్జెక్టుగా అమలు చేయాలి. ద్వితీయ భాషగా దీన్ని ఎంచుకోవాలి.
♦  సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ సిలబస్‌లో తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేసేందుకు సీబీఎస్‌ఈకి లేఖ రాయాలి. 11, 12 తరగతుల్లో తెలుగును ఆప్షనల్‌ సబ్జెక్టుగాగానీ, ప్రధాన సబ్జెక్టుగాగానీ చదువుకోవాలి.
♦  పదో తరగతి వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా, తెలుగు మీడియంలో చదువుకున్న వారంతా ఇంటర్‌లో ద్వితీయ భాషగా తెలుగును కచ్చితంగా చదవాలి.
♦   పదో తరగతి వరకు తెలుగు మీడియం మినహా ఇతర మీడియంలలో చదువుకున్న వారు ద్వితీయ భాషగా 50 మార్కులకు తెలుగును, మరో 50 మార్కులకు తమకు నచ్చిన సబ్జెక్టును ఎంచుకోవచ్చు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top