
జిల్లాలో సర్పంచ్ పదవికి డిమాండ్ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా రెండు, మూడో విడత ఎన్నికలు జరగనున్న నర్సాపూర్, తూప్రాన్ డివిజన్లలోని కొన్ని పంచాయతీలకు తీవ్రమైన పోటీ నెలకొంటోంది. రెండు డివిజన్లలోని పలు గ్రామాలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉండటం, కొన్ని పారిశ్రామిక వాడల పరిధిలో, మరికొన్ని గ్రామాలకు ఆదాయ వనరులు అధికంగా ఉండటంతో ఇక్కడ నుంచి సర్పంచ్‌గా బరిలో దిగేందుకు రాజకీయ నాయకులు పోటీపడుతున్నారు. దీనికితోడు రియల్ వ్యాపారం అభ్యర్థులను ఊరిస్తోంది.
సాక్షి, మెదక్ : ఒక్కసారి సర్పంచ్‌గా గెలిస్తే ఐదేళ్లపాటు రియల్ దందా చేసి డబ్బులు సంపాదించవచ్చని ఆశపడుతున్నారు. ‘ఎంతఖర్చుకైనా వెనుకాడేదిలేదు.. ఎంత డబ్బైనా ఖర్చుచేస్తా.. నేను సర్పంచ్‌గా గెలవాల్సిందే’ అంటూ మనోహరాబాద్ మండలంలోని కాళ్లకల్ పంచాయతీకి చెందిన ఓ నేత వ్యాఖ్యానించాడు. తూప్రాన్ డివిజనల్‌లో మూడవ విడతగా ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. తూప్రాన్ డివిజన్ పరిధిలోని గ్రామ పంచాయతీలకు డిమాండ్ పెరిగింది.
రియల్ వ్యాపారంతో భూములకు రెక్కలు రావడం, పరిశ్రమల స్థాపనతో పంచాయతీలకు ఆదాయం వస్తున్న నేపథ్యంలో పలు పంచాయతీలకు ఆశావహుల్లో పోటీ పెరిగింది. తూప్రాన్ మండలంలో ఆదర్శ గ్రామం మల్కాపూర్, ఘనపూర్, నాగులపల్లి, ఇస్లాంపూర్ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవికి ఎక్కువ పోటీ ఉంది. ఒక్కో గ్రామం నుంచి పది మందికి పైగా పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. అలాగే మనోహరాబాద్ మండలంలో కాళ్లకల్, ముప్పిరెడ్డిపల్లి, కూచారం, జీడిపల్లి, మనోహరాబాద్ గ్రామ పంచాయతీలు హైదరాబాద్‌కు సమీప దూరంలో ఉండడం, 44వ జాతీయ రహదారికి ఆనుకొని ఉండడంతో రియల్ వ్యాపారం ఎక్కువగా జరుగుతోంది.
ఒక ఎకరం సుమారు రూ.2కోట్ల వరకు పలుకుతోంది. దీనికితోడు కాళ్లకల్, ముప్పిరెడ్డిపల్లిల్లో పారిశ్రామిక వాడలు ఉన్నాయి. పరిశ్రమలు ఉన్నందున పంచాయతీలకు ఆదాయం రావడంతోపాటు సర్పంచ్‌గా గెలిస్తే పరిశ్రమల్లో కాంట్రాక్టులు చేయవచ్చన్న ఆశతో ఎక్కువగా మంది పోటీకి సై అంటున్నారు. ముప్పిరెడ్డిపల్లి మహిళలకు రిజర్వు అయ్యింది. ఇక్కడి నుంచి ముగ్గురు నేతలు తమ భార్యలను పోటీలో దించేందుకు సిద్ధం అవుతున్నారు. ఎన్నికల్లో ఎంత ఖర్చయినా పెట్టేందుకు సిద్ధ పడుతున్నారు.
రూ.50 నుంచి రూ.80 లక్షల వరకు డబ్బు ఖర్చు చేసేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాళ్లకల్ పంచాయతీ జనరల్ రిజర్వు కావడంతో ఇక్కడా పోటీ ఎక్కువగా ఉంది. స్థానికంగా ఉన్న ముగ్గురు నేతలు సర్పంచ్ పదవిపై కన్నేశారు. వీరు ఎన్నికల్లో ఎంత ఖర్చైనా చేసేందుకు సిద్ధ పడుతున్నారు. వెల్దుర్తి మండలంలో మాసాయిపేట, కుకునూరు, వెల్దుర్తి, చేగుంట మండలంలో వడియారం, రెడ్డిపల్లితో నార్సింగి మండల కేంద్రానికి పోటీ ఎక్కువగా ఉంది.
నర్సాపూర్‌లోనూ సర్పంచ్ పదవికి పోటీ ఎక్కువే..
నర్సాపూర్ నియోజకవర్గంలోని పలు పంచాయతీల్లో పోటీ చేసేందుకు లీడర్లు ఆసక్తి చూపుతున్నారు. నర్సాపూర్, శివ్వంపేట మండలాలు హెచ్‌ఎండీఏ పరిధిలోకి రావడంతోపాటు ఇక్కడ రియల్ వ్యాపారం ఎక్కువగా సాగుతుండటంతో సర్పంచ్ పదవి కోసం ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. నర్సాపూర్ డివిజన్‌లో రెండవ విడతగా 25వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. నర్సాపూర్ మండలంలోని కాగజ్‌మద్దూరు, రెడ్డిపల్లి, ఆవంచ, రుస్తుంపేట, కొల్చారం మండలంలోని రాంపూర్ గ్రామంలో మైనింగ్ ఉండటంతో ఇక్కడి నుంచి ఎక్కువ మంది పోటీ చేసేందుకు ముందుకు వస్తున్నారు. కొల్చారం, వరిగుంతం, రంగంపేట, ఎనగండ్ల గ్రామాల్లో సర్పంచ్‌గా పోటీ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.
శివ్వంపేట మండలంలో దొంతి, శబాష్‌పల్లి, గోమారం పంచాయతీల్లో సర్పంచ్‌గా పోటీ చేసేందుకు నేతలు పోటీపడుతున్నారు. ఇదిలా ఉంటే నర్సాపూర్ డివిజన్‌లో టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆ పార్టీలో సైతం ఎక్కువ పోటీ ఉంది. కొల్చారం మండంలోని రంగంపేట, కొల్చారం, తుక్కాపూర్, పైతర, అంసాన్‌పల్లి గ్రామాల్లో టీఆర్‌ఎస్ నుంచి ఇద్దరి కంటే ఎక్కువ మంది నేతలు టికెట్ కోరుతున్నారు. కౌడిపల్లి మండలంలోని కొట్టాల, బుజరంపేట, కంచన్‌పల్లి, రాయిలాపూర్, కూకట్లపల్లి పంచాయతీల నుంచి పోటీ చేసేందుకు టీఆర్‌ఎస్ పార్టీ నేతలు పోటీ పడుతున్నారు. శివ్వంపేట, గోమారం గ్రామాల్లో సర్పంచ్ టికెట్ కోసం టీఆర్‌ఎస్ నాయకులు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒకే పంచాయతీ నుంచి టీఆర్‌ఎస్ నేతలు ఎక్కువ మంది టికెట్ ఆశిస్తుండటం స్థానిక ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి తలనొప్పిగా మారింది. టికెట్ కోసం పోటీ పడుతున్న టీఆర్‌ఎస్ నాయకుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.