పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌లో తెలంగాణ నంబర్‌వన్‌

Telangana is number one in Passport verification - Sakshi

ఢిల్లీలో అవార్డు అందుకున్న డీజీపీ

సాక్షి, న్యూఢిల్లీ: పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌ సేవల్లో రాష్ట్ర పోలీస్‌ శాఖ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. పాస్‌పోర్ట్‌ సేవా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాస్‌పోర్టు వెరిఫికేషన్‌లో విశిష్ట సేవలు అందించిన రాష్ట్రాలకు కేంద్ర విదేశాంగ శాఖ ర్యాంకులు ప్రకటిస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణ మొదటి ర్యాంకు సాధించింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ చేతుల మీదుగా డీజీపీ మహేందర్‌రెడ్డి అవార్డు అందుకున్నారు. అనంతరం తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. పాస్‌పోర్టు వెరిఫికేషన్‌లో సాంకేతికత ద్వారా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి పారదర్శకతతో వెరిఫికేషన్‌ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. వెరిఫికేషన్‌లో యూజర్‌ ఫ్రెండ్లీ యాప్‌ను ప్రవేశపెట్టామని, 4 రోజుల్లో ప్రక్రియ పూర్తయి ఎప్పటికప్పుడు దరఖాస్తుదారులకు వివరాలు తెలియజేస్తున్నామన్నారు.

మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత థర్డ్‌ పార్టీ ద్వారా వెరిఫికేషన్‌ సేవల్లో పౌరుల ఫీడ్‌బ్యాక్‌ కూడా తీసుకొని సంబంధిత అధికారులకు రేటింగ్‌ ఇస్తున్నట్లు తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియకు 9 రోజుల గడువు తీసుకుంటుండగా, రాష్ట్రంలో 4 రోజుల్లోనే  ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వెరిఫికేషన్‌లో విశిష్ట సేవలకు గుర్తింపుగా గత మూడేళ్లుగా మొదటి స్థానంలో నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు. దీనికి సహకరించిన పోలీసు అధికారులకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. వెరిఫికేషన్‌ కోసం రాష్ట్ర పోలీసులు ప్రవేశపెట్టిన వెరీఫాస్ట్‌ యాప్‌తో పాస్‌పోర్ట్‌ దరఖాస్తును అనుసంధానం పై టీసీఎస్‌ సంస్థతో కలసి పనిచేస్తున్నట్లు తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top