షి'కారే'!

Telangana Municipl Elections TRS Party Six Corporations - Sakshi

7 కార్పొరేషన్లలో ఆరు టీఆర్‌ఎస్‌కే?

21 మున్సిపాలీటీల్లో 17 చోట్లఅధికార పార్టీ హవా

బోడుప్పల్, తుర్కయంజాల్‌లోకాంగ్రెస్‌ హోరాహోరీ   

తుక్కుగూడ, ఆమనగల్లులో బీజేపీ, టీఆర్‌ఎస్‌ పోటాపోటీ  

జల్‌పల్లిలో ఎంఐఎంకు చాన్స్‌ 640 వార్డుల్లో 9 ఏకగ్రీవం

395 వార్డుల్లో కారు, హస్తం–102, బీజేపీ–64,

ఎంఐఎం–14, ఇతరులు–56 గెలిచే అవకాశాలు

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: గ్రేటర్‌ శివారుపురపాలక సంఘాల్లో కారుదే జోరు కొనసాగే అవకాశం కన్పిస్తోంది.బుధవారం జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో మెజార్టీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను అధికారపార్టీ కైవసం చేసుకుంటుందనిపరిశీలకులు అంచనా వేస్తున్నారు.ఎన్నికలకు ముందేఐదు మున్సిపాలిటీల్లో తొమ్మిది వార్డులను ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్‌..బుధవారం జరిగిన ఎన్నికల్లో జోరును పెంచినట్లు పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే తెలుస్తున్నది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఏడు కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో బోడుప్పల్‌ కార్పొరేషన్, తుర్కయంజాల్‌ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, తుక్కుగూడ, ఆమనగల్లు మున్సిపాలిటీల్లో బీజేపీ, జల్‌పల్లిలో ఎంఐఎం పార్టీలు ప్రభావం చూపగా..మిగతా అన్ని చోట్లా టీఆర్‌ఎస్‌కే గెలుపు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల మాత్రం స్వతంత్ర అభ్యర్థులు ప్రభావం చూపే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశాయి.

నగర శివారులోని మున్సిపాలిటీల్లో అత్యధికం జనరల్‌కు రిజర్వు కావటం..పురపోరులో అత్యధికులు స్థిరాస్తి వ్యాపారులు నిలబడటం వల్ల ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగింది. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయటానికి అభ్యర్థులు విచ్చవిడిగా మద్యం, డబ్బులు, గిఫ్టులు పంపిణీ చేశారు. ఆ పార్టీ, ఈ పార్టీ అనే తేడాలేకుండా అన్ని పార్టీలు, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు కూడా డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేశారు. బోడుప్పల్, తుర్కయంజాల్‌ పురపాలక సంఘాల్లో కారుకు కాంగ్రెస్‌ గట్టిపోటీనిచ్చినట్లు పోలింగ్‌ సరళిని బట్టి అంచనా వేస్తున్నారు. కాగా రెండు జిల్లాల్లో 631 వార్డులకు ఎన్నికలు జరగగా 395 వార్డుల్లో కారు, 102 వార్డుల్లో హస్తం, 64 వార్డులో కమలం, 56 వార్డుల్లో ఇతరులు గెలిచే చాన్స్‌ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కాగా ఎంఐఎం 20 నుంచి 25 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ను బలంగా ఢీకొన్నట్లు తెలుస్తున్నది. ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ శ్రేణులు, ముఖ్య కేడర్‌ నుంచి తెప్పించుకున్న సమాచారంతోపాటు  తమ అంచనాల ప్రకారం గ్రేటర్‌ శివారు పురపాలక సంఘాలన్నింటినీ తామే గెలుచుకుంటామని టీఆర్‌ఎస్‌ నేతలు పేర్కొన్నారు. సైలెంట్‌ ఓటింగ్, ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్‌ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top