అన్నీ ఉన్నాయ్‌.. డాక్టర్‌ లేడు | Telangana : lack of doctors in government hospitals | Sakshi
Sakshi News home page

అన్నీ ఉన్నాయ్‌.. డాక్టర్‌ లేడు

Nov 12 2017 4:19 AM | Updated on Nov 12 2017 4:19 AM

Telangana : lack of doctors in government hospitals - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రభుత్వ ఆస్పత్రుల రంగులు మారాయి. కొత్తగా ఖరీదైన మంచాలు తెచ్చారు. కొన్ని ఆస్పత్రుల్లో కొత్త దుప్పట్లు వేశారు. అత్యవసర వైద్య సేవలకు అవసరమైన పరికరాలను కొనుగోలు చేస్తున్నారు. పరికరాల కొనుగోలులో వైద్య, ఆరోగ్య శాఖ ఎక్కువగానే శ్రద్ధ చూపుతోంది. కాకపోతే ఆ పరికరాలను ఆపరేట్‌ చేసేందుకు అవసరమైన సిబ్బంది నియామకంలో మాత్రం ఎక్కడ లేని అశ్రద్ధ కనబరుస్తోంది. పరికరాలు, యంత్రాలే కాదు ప్రాథమిక వైద్య సేవల పరిస్థితి కూడా దారుణంగా ఉంటోంది. ఏ ఆస్పత్రిలో చూసినా, ఏ విభాగంలో చూసినా ఒకరిద్దరు వైద్యులే కన్పిస్తున్నారు. ప్రభుత్వ పరిధిలోని సూపర్‌ స్పెషాలిటీ, ప్రాంతీయ ఆస్పత్రుల్లోనూ కీలకమైన విభాగాలకు సైతం వైద్యుల్లేని పరిస్థితి. భవనాల నిర్మాణాలు, పరికరాల కొనుగోలుపై ఉన్న శ్రద్ధ వైద్యుల సంఖ్య పెంచే విషయంలో లేకపోవడం పేద రోగుల పాలిట శాపంగా మారుతోంది.

అవసరానికి తగ్గ పోస్టులేవీ?
వైద్యులు, సహాయక సిబ్బంది కొరతతో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు అల్లాడుతున్నాయి. పెరిగిన అవసరాలకు తగ్గట్లు కొత్తగా పోస్టులను మంజూరు చేయాల్సిన అవసరం ఉన్నా వైద్య, ఆరోగ్య శాఖ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తోంది. కొత్త పోస్టుల సంగతి దేవుడెరుగు.. కనీసం ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీలోనూ ఆ శాఖ అధ్వానంగా వ్యవహరిస్తోంది. వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని అన్ని విభాగాల్లో కలిపి 37,141 పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం 26,016 మందే పని చేస్తున్నారు. మొత్తం 11,125 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

మరో 12 వేల పోస్టులు అవసరం..
కొత్త పరికరాలు, యంత్రాలు.. పెరిగిన ఆస్పత్రుల సంఖ్య.. 24 గంటల పాటు సేవలు అందించాలంటే మరో 12,353 పోస్టులు అవసరమవుతాయని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ధారించింది. ఇప్పటికే ఖాళీగా ఉన్న 11,125 పోస్టులు, కొత్తగా అవసరమైన 12,353 పోస్టులు కలిపితే.. మొత్తం 23,478 పోస్టులను తక్షణం భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం అన్ని విభాగాల్లో కలిపి 6,180 పోస్టుల భర్తీకే అనుమతి ఇచ్చింది. అందులోనూ కొన్నింటికే నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. మరికొన్ని ఇంకా నోటిఫికేషన్‌ దశకు కూడా చేరుకోలేదు. కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయం కోసం 82 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. రెగ్యులర్‌ ప్రాతిపదికన ఇప్పటికీ ఒక్క పోస్టు కూడా భర్తీ కాలేదు. ఆహార కల్తీ నియంత్రణ విభాగంలోని 23 పోస్టులకు అనుమతిచ్చినా ఇప్పటికీ అతీగతీ లేదు. నిమ్స్‌ విస్తరణకు మంజూరు చేసిన 1,472 పోస్టుల పరిస్థితీ ఇలాగే ఉంది. ఎంఎన్‌జే కేన్సర్‌ ఆస్పత్రి కోసం మంజూరు చేసిన 251 పోస్టుల భర్తీ ముందుకు కదలట్లేదు.

పెరుగుతున్న రోగులు..
ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతోంది. ఇదే వైద్య సిబ్బందికి ఇబ్బందిగా మారుతోంది. వైద్య, ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం 2016–17లో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు 4.6 కోట్ల మంది వైద్య సేవల కోసం వచ్చారు. ప్రజారోగ్యం విభాగం ఆస్పత్రులకు సుమారు 2.62 కోట్ల మంది, వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రులకు 1.5 కోట్ల మంది, వైద్య విద్య ఆస్పత్రులకు 48 లక్షల మంది రోగులు వచ్చారు. కేసీఆర్‌ కిట్, డయాలసిస్‌ వంటి సేవలతో ఈ ఏడాది రోగుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా. ప్రస్తుత రోగుల సంఖ్యకు అనుగుణంగానే వైద్యులు, సిబ్బంది లేరు. ఇక పెరిగే రోగుల పరిస్థితేంటనేది అయోయమంగా మారింది. మౌలిక వసతుల కల్పన కూడా అంతంత మాత్రంగానే ఉంటోంది. ఆస్పత్రులకు వస్తున్నా ఆశించిన మేరకు వైద్య సేవలు అందకపోవడంతో తప్పనిసరై రోగులు పూర్తి స్థాయి వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

పోస్టుల వివరాలిలా..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement